మరో పరువు హత్య : కూతురిని ప్రేమించాడని పుట్టినరోజు నాడే నరికి చంపిన త్రండి
తాజాగా పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం ముప్పిరి తోట గ్రామంలో మరో దారుణం చోటు చేసుకుంది.;

తెలంగాణ రాష్ట్రంలో పరువు హత్యలు ఆగడం లేదు. తాజాగా పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం ముప్పిరి తోట గ్రామంలో మరో దారుణం చోటు చేసుకుంది. వేర్వేరు కులాలకు చెందిన ప్రేమ జంటను విడదీయడానికి ప్రయత్నించిన యువతి తండ్రి, ప్రియుడిని దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
ముప్పిరి తోట గ్రామానికి చెందిన పూరెల్ల సాయికుమార్ అనే యువకుడు అదే గ్రామానికి చెందిన ఓ యువతిని కొంతకాలంగా ప్రేమిస్తున్నాడు. అయితే వీరిద్దరి కులాలు వేరు కావడంతో యువతి తండ్రి ఈ ప్రేమను తీవ్రంగా వ్యతిరేకించాడు. తన కూతురితో మాట్లాడవద్దని సాయికుమార్‌ను హెచ్చరించాడు. అయినప్పటికీ, సాయికుమార్ - ఆ యువతి తమ ప్రేమను కొనసాగించారు. దీంతో ఆగ్రహించిన యువతి తండ్రి, వారి సంబంధాన్ని శాశ్వతంగా ముగించాలని నిర్ణయించుకున్నాడు.
గురువారం రాత్రి సుమారు పది గంటల సమయంలో సాయికుమార్ తన స్నేహితులతో కలిసి వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద తన బర్త్ డే సందర్భంగా కేక్ కట్ చేసుకుంటున్నాడు. అప్పుడు యువతి తండ్రి గొడ్డలితో అక్కడికి ఒక్కసారిగా దూసుకొచ్చాడు. క్షణం కూడా ఆలస్యం చేయకుండా సాయికుమార్‌పై విచక్షణారహితంగా దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన సాయికుమార్‌ను వెంటనే అతని స్నేహితులు - కుటుంబ సభ్యులు సుల్తానాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే, గాయాలు తీవ్రంగా ఉండటంతో చికిత్స పొందుతూ సాయికుమార్ మృతి చెందాడు.
ఈ హత్య మరింత విషాదకరమైన విషయం ఏమిటంటే, గురువారం సాయికుమార్ పుట్టినరోజు. ఆనందంగా గడపాల్సిన రోజున ఓ తండ్రి క్రూరత్వానికి బలైపోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఈ ఘటనతో ముప్పిరి తోట గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. యువకుడి మృతితో గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో పోలీసులు భారీగా మోహరించారు. పెద్దపల్లి ఏసీపీ గజ్జి కృష్ణ , సుల్తానాబాద్ సీఐ సుబ్బారెడ్డి ఆసుపత్రిలో మృతదేహాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు. నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.
ఈ ఘటన ప్రేమ వివాహాలపై సొంత కుటుంబ సభ్యులే అడ్డుపడుతున్న తీరుకు మరో నిదర్శనంగా నిలిచింది. కులం , పరువు కోసం ప్రాణాలు బలిగొంటున్న వైనానికి ఎప్పుడు తెరపడుతుందో వేచి చూడాలి. ప్రస్తుతం పరారీలో ఉన్న నిందితుడిని పోలీసులు త్వరగా పట్టుకుంటారని ఆశిద్దాం.