తెలంగాణ మంత్రి వర్గ విస్తరణ షురూ.. గవర్నర్‌కు జాబితా!
ఈ సందర్భంగా గవర్నర్‌కు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. శాలువాతో సత్కరించారు. ఈ క్రమంలోనే ఏకాంతంగా అరగంట సేపు సీఎం, గవర్నర్ భేటీ అయ్యారు.;

తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రి వర్గ విస్తరణకు ముహూర్తం రెడీ అయింది. ఏప్రిల్ 3వ తేదీ అని ఆది నుంచి ప్రచారం జరుగుతున్నా.. దీనిని రెండో తేదికి మార్చినట్టు తాజాగా ప్రచారంలోకి వచ్చింది. మరోవైపు.. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు భట్టి విక్రమార్క తదితరులు.. గవర్నర్ విష్ణుదేవ్ వర్మను కలుసుకున్నారు. రవీంద్ర భారతిలో జరిగిన ఉగాది పర్వదిన వేడుకల్లో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి.. కార్యక్రమం అనంతరం.. రాజ్‌భవన్‌కు చేరుకున్నారు.
ఈ సందర్భంగా గవర్నర్‌కు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. శాలువాతో సత్కరించారు. ఈ క్రమంలోనే ఏకాంతంగా అరగంట సేపు సీఎం, గవర్నర్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మంత్రి వర్గ విస్తరణకు సంబంధించిన అంశాన్ని గవర్నర్‌తో రేవంత్‌రెడ్డి చర్చించినట్టు తెలిసింది. అంతేకాదు.. ఇప్పటికే రెడీ చేసిన నూతన మంత్రుల జాబితాను కూడా ఆయనకు అందించారని విశ్వసనీయ వర్గాల సమాచారం. దీనిని బట్టి ముగ్గురు నుంచి నలుగురు కొత్తవారికి మంత్రివర్గంలో చోటు కల్పించనున్నట్టు తెలిసింది.
దీని ప్రకారం.. సీనియర్లు, జూనియర్ల కలగలుపుగా నూతన మంత్రుల కూర్పు ఉన్నట్టు తెలిసింది. అలాగే.. రెడ్డి సామాజిక వర్గానికి ఒకటి, ఎస్సీ, ఎస్టీలకు ఒక్కొక్క సీటును, బీసీలకు రెండు సీట్లు కేటాయించినట్టు తెలిసింది. పేర్ల విషయానికి వస్తే.. అత్యంత గోప్యంగా ఉంచారు. ఎక్కువ మంది ఆశావహులు ఉండడంతో ఇప్పుడే పేర్లు వెల్లడించడం ద్వారా లేని పోని వివాదాలకు తెరదీసినట్టు అవుతుందని భావిస్తున్నారు. దీంతో పేర్ల విషయాన్ని అత్యంత గోప్యంగా ఉంచారు. మొత్తానికి ఏప్రిల్ 2న మంత్రివర్గ విస్తరణ ఖరారైందని సమాచారం.