జగన్ వర్సెస్ విజయసాయిరెడ్డి...కంటిన్యూ !
వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్, మాజీ ఎంపీ వి విజయసాయిరెడ్డిల మధ్య అనుబంధం అందరికీ తెలిసిందే.;

వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్, మాజీ ఎంపీ వి విజయసాయిరెడ్డిల మధ్య అనుబంధం అందరికీ తెలిసిందే. విజయసాయిరెడ్డి కేరాఫ్ వైఎస్సార్ ఫ్యామిలీ అని అంతా అంటారు. ఆయన కూడా వైఎస్ రాజారెడ్డి నుంచి మొదలుపెట్టి రాజశేఖర్ రెడ్డి జగన్ దాకా కలసి నడిచారు. అలా మూడు తరాలతో అనుబంధం పెనవేసుకున్నవారు.
జగన్ ని విజయసాయిరెడ్డిని వేరుగా చూసే వాతావరణం ఎపుడూ లేదు అని చెప్పాలి. జగన్ మేలు కోసం విజయసాయిరెడ్డి తపన పడేవారు. విజయసాయిరెడ్డిని కుటుంబం మనిషిగా జగన్ చూసేవారు. ఇద్దరూ కలసి కష్టాలు నష్టాలూ అన్నీ చూశారు. వైసీపీని జగన్ ప్రారంభిస్తే దానికి అండగా దండగా విజయసాయిరెడ్డి ఉంటూ వచ్చారు. ఆయన మేధస్సు, వ్యూహాలు వైసీపీకి శ్రీరామ రక్షగా ఉండేవారు.
జగన్ తో సమానంగా విజయసాయిరెడ్డిని పార్టీ నాయకులు క్యాడర్ అభిమానించేవారు. ఈ ఇద్దరూ వేరు పడతారు అని ఎవరూ అనుకోలేదు. ఆ మాటకు వస్తే విజయసాయిరెడ్డి కూడా అనుకోని ఉండరు. కానీ అది జరిగిపోయింది. కొత్త ఏడాది మొదటి నెలలోనే వైసీపీకి ఎంపీ పదవికి రాజకీయాలకు రాజీనామా చేస్తున్నట్లుగా విజయసాయిరెడ్డి ప్రకటించి సంచలనం రేపారు.
ఆ తరువాత ఆయన తాను పార్టీని వీడడానికి కారణం జగన్ వెనక ఉన్న కోటరీ అని ఆరోపించారు. జగన్ ఈ రోజుకీ అర్ధం చేసుకోలేకపోతున్నారు అని కూడా ట్వీట్ల ద్వారా విమర్శలు చేశారు. తాజాగా చూస్తే ఆయన తెలంగాణాకు చెందిన బీఆర్ఎస్ నాయకుడు కేటీఆర్ ని పొగుడుతూ ట్వీట్ చేశారు. డీలిమిటేషన్ మీద కేటీఆర్ మాట్లాడుతూ అన్న మాటలను విజయసాయిరెడ్డి సమర్ధించారు.
జీడీపీ ఆధారంగా ఎంపీ సీట్ల సంఖ్య పెంచాలన్న కేటీఆర్ సూచనలను మెచ్చుకున్నారు. దక్షిణాది రాష్ట్రాల మీద కేంద్రం వివక్ష చూపదని కేంద్ర హోం మంత్రి అమిత్ షా హామీ ఇచ్చారని కూడా గుర్తు చేశారు. డీలిమిటేషన్ మీద కేటీఆర్ ఆవేదన ఆందోళనకు ఆయన మద్దతు ప్రకటించారు.
అయితే విజయసాయిరెడ్డి జగన్ విషయంలో మాత్రం పూర్తిగా విస్మరించారని అంటున్నారు. కావాలనే ఆయన జగన్ ని ఇగ్నోర్ చేశారా అన్న చర్చ అయితే సాగుతోది. డీలిమిటేషన్ మీద జగన్ సైతం దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి లేఖ రాసారు. దామాషా పద్ధతిలో ఎంపీల సీట్లు పెంచాలని ఆయన విలువైన సూచనలే చేశారు.
నిజానికి జగన్ సూచన కూడా బాగానే ఉంది. మరి విజయసాయిరెడ్డికి జగన్ డీలిమిటేషన్ మీద మాట్లాడిన మాటలు ఆయన ఆవేదన కనబడలేదా అన్న చర్చ సాగుతోంది. ఒకే ఇష్యూ మీద రెండు తెలుగు రాష్ట్రాల కీలక పార్టీల అధినేతలు మాట్లాడారు అందులో సొంత రాష్ట్రం నాయకుడు జగన్ ఉన్నారు. పైగా నిన్నటి దాకా విజయసాయిరెడ్డి ఆ పార్టీలో ఉన్నారు.
కానీ ఎన్నడూ తలవని బీఆర్ఎస్ నాయకుడి విషయంలోనే విజయసాయిరెడ్డి రెస్పాండ్ కావడం ఆయనను ప్రశంసించడం మీద చర్చ సాగుతోంది. అదే సమయంలో జగన్ ఊసు ఎత్తకుండా వ్యవహరించడంతో తమ మధ్య గ్యాప్ అలాగే కంటిన్యూ అవుతుందని చెప్పకనే చెప్పేసారు అని అంటున్నారు.
జగన్ పేరు ఎత్తకుండా కేటీఅర్ ని మధ్యలోనికి తెచ్చి ట్వీట్ వేయడంలోనే విజయసాయిరెడ్డి వ్యూహం ఉందని అంటున్నారు. అంటే ఏపీలో వైసీపీ అధినేత కంటే కేటీఅర్ ది బెస్ట్ గా డీలిమిటేషన్ విషయంలో వ్యవహరించారని విజయసాయిరెడ్డి భావమా అన్నది కూడా చర్చిస్తున్నారు. విజయసాయిరెడ్డి రాజకీయ మేధావిగా పేరు పొందారు ఆయన ఏమి చేసినా అందులో అర్ధాలు పరమార్ధాలు ఎన్నో ఉంటాయి. ఇపుడు ఈ ట్వీట్ ద్వారా కూడా ఆయన ఏమైనా సందేశం ఇచ్చారా అన్నది కూడా అంతా చర్చిస్తున్నారు. మొత్తానికి జగన్ వర్సెస్ విజయసాయిరెడ్డి కంటిన్యూ అన్నది మాత్రం మరోసారి రుజువు అయింది అని అంటున్నారు.