బలవంత రాజకీయాలు.. జంపింగులతో ప్రయోగాలు..!
మరో ఏడాది పాటు మాత్రమే ఉన్న స్థానిక సంస్థల్లో వైసీపీ నాయకులను ఎంపీపీలను, కౌన్సిలర్లను, కార్పొరేటర్లను కూడా.. కూటమి పార్టీలు తమవైపు తిప్పుకొంటున్నాయి.;

రాష్ట్రంలోని స్థానిక సంస్థల్లో కూటమి పార్టీలు పాగా వేస్తున్నాయి. అయితే.. ఈ క్రమంలో సాగుతున్న బలవంతపు రాజకీయాలు భవిష్యత్తులో ఏమేరకు సక్సెస్ అవుతాయన్నది ప్రశ్న. మరో ఏడాది పాటు మాత్రమే ఉన్న స్థానిక సంస్థల్లో వైసీపీ నాయకులను ఎంపీపీలను, కౌన్సిలర్లను, కార్పొరేటర్లను కూడా.. కూటమి పార్టీలు తమవైపు తిప్పుకొంటున్నాయి. ఇది రాజకీయంగా ఇప్పటికిప్పుడు మంచిదే.
ఎందుకంటే.. వైసీపీని తుత్తునియలు చేసేందుకు.. పార్టీ ప్రాభవాన్ని తగ్గించేందుకు ఇది దోహద పడుతుంది. అంతేకాదు.. ప్రస్తుతం స్థానికంలో పాగా వేసేందుకు కూడా.. ఇది దోహదపడుతుంది. కానీ.. భవిష్యత్తును తలుచుకుంటే మాత్రం కూటమి పార్టీలకు ఇది ఏమేరకు మేలు చేస్తుందన్నది ప్రశ్నగా మారింది. ఎందుకంటే.. ఓడినా.. గెలిచినా.. పార్టీలను అంటిపెట్టుకుని చాలా మంది నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.
గత స్థానికంలో పోటీ చేసి ఓడిపోయిన నాయకులు ఉన్నారు. ఇప్పుడు వారి అభీష్టానికి వ్యతిరేకంగా వైసీపీ నాయకులను గుండుగుత్తగా మార్చేసి.. తమ కండువా కప్పేసి.. ఎంపీపీలను కైవసం చేసుకోవడంపై స్థానిక నాయకులు గుర్రుగా ఉన్నారు. మరో ఏడాదిలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో తమ పరిస్థితి ఏంటన్నది వారు ప్రశ్నిస్తున్న విషయం. అంతేకాదు.. స్థానికంగా రాజకీయాలు చేయాలంటే.. అంతో ఇంతో ఇమేజ్ సామాజిక వర్గాల మద్దతు చాలా అవసరం.
ఇప్పుడు కూటమి పార్టీలు చేస్తున్న జంపింగు రాజకీయాలతో ఆయా వర్గాలు కూడా ఖిన్నులవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. వచ్చే ఎన్నికల నాటికి తమకు అవకాశం దక్కదన్న భావన కూడా టీడీపీ, జనసేన నాయకులు కార్యకర్తల్లో ఎక్కువగానే కనిపిస్తోంది. ఇదిలావుంటే.. స్థానికంగా ఆధిపత్య పోరు విషయంలో ఇప్పటి వరకు ఒక పంథా ఉంటే.. ఇప్పుడు జంపింగుల కారణంగా.. తమకు ఇబ్బందేనని తమ్ముళ్లు వాపోతున్న పరిస్థితి కనిపిస్తోంది.
సో.. ఎలా చూసుకున్నా.. ఇప్పటికిప్పుడు బాగానే ఉన్నా.. ఏడాది తర్వాత వచ్చే ఎన్నికలను చూస్తే.. ఇబ్బందులు తప్పవన్న సంకేతాలు.. క్షేత్రస్థాయిలో బలంగా కనిపిస్తున్నాయి. ఈ విషయాన్ని ఆయా పార్టీలు పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.