వైసీపీ నేత‌ల‌ ఒంట‌రి పోరాటం.. ఎందుకిలా ..!

ఒక నాయ‌కుడికి అవ‌మానం జ‌రిగినా.. ఇబ్బంది వ‌చ్చినా.. ఇత‌ర నాయ‌కులు ముందుకు వ‌స్తారు.;

Update: 2025-03-28 11:30 GMT
Lack Of Support In YCP Leaders

వైసీపీ నాయ‌కురాలు, మాజీ మంత్రి విడ‌ద‌ల ర‌జ‌నీ వ్య‌వ‌హారం.. వైసీపీలో చ‌ర్చ‌కు దారితీసింది. ఒక్క వైసీపీలోనే కాదు.. రాజ‌కీయ వ‌ర్గాల్లోనూ ఈ వ్య‌వ‌హారం ఆస‌క్తిగా మారింది. ఒక కాకికి దెబ్బ త‌గిలితే.. మ‌రికొన్ని కాకులు వ‌చ్చి యాగీ చేస్తాయి. అలాంటిది సొంత పార్టీలోనే ర‌జ‌నీకి ఇప్పుడు మ‌ద్ద‌తు లేకుండా పోయింది. వాస్త‌వానికి రాజ‌కీయ పార్టీల్లో నాయ‌కుల మ‌ధ్య విభేదాలు ఉన్నా.. ఒక నాయ‌కుడికి అవ‌మానం జ‌రిగినా.. ఇబ్బంది వ‌చ్చినా.. ఇత‌ర నాయ‌కులు ముందుకు వ‌స్తారు.

గ‌తంలో టీడీపీ నేత‌లు అరెస్ట‌యిన‌ప్పుడు.. కేసులు ఎదుర్కొన్న‌ప్పుడు.. ఆ పార్టీలోని నాయ‌కులు ముందుకు వ‌చ్చారు. ధ‌ర్నాలు నిర‌స‌న‌ల‌తో రాష్ట్రంలో ఉద్య‌మాలు నిర్మించారు. వైసీపీకి ఎదురు తిరిగి.. అంద‌రూ ఏక‌తాటిపైకి వ‌చ్చారు. ఫ‌లితంగా పార్టీ బలం ఏంటో అప్ప‌ట్లో తెలిసింది. అంతేకాదు.. పార్టీలో ఐక్య‌త‌ను కూడా అంద‌రికీ తెలిసేలా చేసింది. కానీ, ఇప్పుడు వైసీపీలో లంచం ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న మాజీ మంత్రి విడ‌ద‌ల ర‌జ‌నీ విష‌యంలోను, మాజీ ఎమ్మెల్యే వ‌ల్ల‌భ‌నేని వంశీ విష‌యంలోనూ ఒంటరిపోరాట‌మే క‌నిపిస్తోంది.

వారిద్ద‌రే కాదు.. బోరుగ‌డ్డ అనిల్‌కుమార్ కావొచ్చు.. నందిగం సురేష్ కావొచ్చు.. కాకాణి గోవ‌ర్ధ‌న్‌రెడ్డి కావొచ్చు.. ఇలా అనేక మంది నాయ‌కులు త‌మ‌పై కేసులు న‌మోదైనా.. పార్టీ నుంచి ఇత‌ర నాయ‌కుల నుంచి మ‌ద్ద‌తును కూడ‌గ‌ట్ట‌ లేకపోతున్నారు. వారి త‌ర‌ఫున వాయిస్ వినిపించేందుకు, వారి త‌ర‌ఫున బ‌ల‌మైన గ‌ళం వినిపించేందుకు కూడా ఎవ‌రూ ముందుకు రావ‌డం లేదు. కేవలం పార్టీ అధినేత జ‌గ‌న్ మాత్ర‌మే ఒక‌టి రెండు సార్లు వారిని ప‌రామ‌ర్శిస్తున్నారు.

ఈ త‌ర‌హా వ్య‌వ‌హారం.. వైసీపీని ఇర‌కాటంలో ప‌డేస్తోంది. అంతేకాదు.. స‌ద‌రు నేత‌ల‌కు ద‌న్నులేని వ్య‌వ‌హారం.. కూడా చ‌ర్చ‌కు వస్తోంది. గతంలో వారు వ్య‌వ‌హ‌రించిన తీరు, ప్ర‌స్తుతం వారిపై వ‌చ్చిన ఆరోప‌ణ‌ల తీరును కూడా అవి తేట‌తెల్లం చేస్తున్నాయి. అంతేకాదు.. వారి విష‌యంలో సానుభూతి కొర‌వ‌డడం కూడా.. పార్టీ విష‌యంలో మైన‌స్ అవుతోంది. ఇప్ప‌టికైనా పార్టీ నాయ‌కుల మ‌ధ్య ఉన్న విభేదాల‌ను క‌ట్ట‌డి చేసి అంద‌రూ ఐక్యంగా ముందుకు సాగేలా జ‌గ‌న్ వ్య‌వ‌హ‌రించాల్సిన అవ‌స‌రం ఉంది. మ‌రి ఏం చేస్తారో చూడాలి.

Tags:    

Similar News