ఎంజాయిబుల్ ఎడ్యుకేషన్... లోకేష్ 'నో బ్యాగ్ డే' కీలక లక్ష్యాలివే!

బాల్యం అంటే.. కేవలం పుస్తకాల మోత మాత్రమే కాదని.. ఆ మోతలకు, రొటీన్ ఆలోచనలకు స్వస్థి పలికేలా అడుగులు వేశారు.;

Update: 2025-03-28 13:19 GMT
No Bag Day in ap govt expands

బరువైన బ్యాగులు.. బ్యాగుల నిండా పుస్తకాలు.. చూసేవారికి వెళ్తోంది చదువుకోవడానికేనా అనే సందేహాలు.. ర్యాంకుల వేటలో ఈ పుస్తకాల మోతతో.. మస్తిష్కానికి పుస్తకం తప్ప మరో ఆలోచన లేని పరిస్థితులు.. దీంతో బాల్యం అంటే పుస్తకాలు, మార్కులు తప్ప మరొకటి లేకుండా గడిచిపోతున్న వ్యవహారాలు.. ఈ సమయంలోనే ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కీలక నిర్ణయం తీసుకున్నారు.

బాల్యం అంటే.. కేవలం పుస్తకాల మోత మాత్రమే కాదని.. ఆ మోతలకు, రొటీన్ ఆలోచనలకు స్వస్థి పలికేలా అడుగులు వేశారు. ఈ క్రమంలోనే విద్యార్థులకు బ్యాగుల మోత తప్పించేలా కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగానే... నో బ్యాగ్ డే అమలు చేస్తోన్నారు. దీనివల్ల... నెలలో ఒక్క రోజైనా బ్యాగు లేకుండా స్కూలుకు వెళ్లి.. సరికొత్త విషయాలపై అవగాహన, ఆసక్తికి పెంచుకునేలా చేస్తున్నారు.

ఈ క్రమంలోనే ప్రతి నెలా మూడో శనివారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల్లో నో బ్యాగ్ డే అమలు చేస్తున్నారు. ఈ సమయంలో ఏపీ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. నెలలో ఒక రోజు కాదు.. వారంలో ఒకరోజు కచ్చితంగా కేవలం పాఠ్యపుస్తకాల చదువులు మాత్రమే కాకుండా.. ఎన్నో విషయాలపై విద్యార్థి దశలో అవగాహన, ఆసక్తి పెంచుకునేలా ఆలోచన చేశారు. ఈ విషయాన్ని ఇటీవల ఎక్స్ లో వెల్లడించారు.

ఇందులో భాగంగా... ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల సమగ్ర వికాసం లక్ష్యంగా ఎన్నో చర్యలు తీసుకుంటున్నామని.. ఇప్పటివరకు మూడో శనివారం మాత్రమే ఉన్న నో బ్యాగ్ డేని, వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రతి శనివారం అమలుచేస్తామని.. ఆ రోజు విద్యార్థులకు క్విజ్‌ లు, సమకాలీన అంశాలపై డిబేట్లు, సదస్సులు, క్రీడలు, వివిధ పోటీలు నిర్వహిస్తామని ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వెల్లడించారు.

మరోవైపు... పాఠశాల విద్యలో సమగ్ర సంస్కరణలతో లోకేష్ దూసుకుపోతున్నారనే చర్చ వినిపిస్తోంది. ఈ రకమైన చొరవ విద్యార్థులను స్కిల్ టెస్ట్స్, స్పోకెన్ ఇంగ్లిష్, స్పెల్ బీ పోటీలు, వృత్తి విద్య, లలిత కళలు, ప్రదర్శన కళలు, మార్క్ పార్లమెంట్ సెక్షన్స్ మొదలైనవాటికి అవసరమైన నైపుణ్యాలతో సన్నంధం చేయడం ఏపీ విద్యాశాఖ లక్ష్యంగా పెట్టుకుంది. నో బ్యాగ్ డే నాడు ఇవన్నీ అమలుచేయనుంది.

ఇదే సమయంలో... పాఠాంశాల్లో వృత్తి విద్యను చేర్చడం జరుగుతుంది. దీనివల్ల విద్యార్థులకు వివిధ చేతిపనులలో ఆచరణాత్మక అనుభవం లభిస్తుంది. అదేవిధంగా.. ప్రత్యేక విద్యావేత్తలు, కెరీర్ & మానసిక ఆరోగ్య సలహాదారులు సామాజిక పరస్పర చర్య, నైపుణ్యాలను పెంపొందించడానికి రూపొందించిన పలు వినోద ఆటలతో కార్యకాలాపాలను నిర్వహిస్తారు.

అదేవిధంగా... కేవలం విద్య మాత్రమే కాదు, ప్రతీ విద్యార్థికి నైతిక విలువలు కూడా నేర్పించాలని ఏపీ ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు మార్గదర్శకాలను అనుసరించి విలువ ఆధారిత విద్యాసెషన్స్ వల్ల విద్యార్థుల్లో నైతిక విలువలను పెంపొందిస్తాయి. ఇవి వారికెంతగానో ఉపయోగపడతాయి.

వాస్తవానికి గత వైసీపీ ప్రభుత్వ హయాంలో పలు ఏకపక్ష విధానాల కారణంగా.. లక్షలాది మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల నుంచి తప్పుకున్న పరిస్థితి. వీటికి సంబంధించిన గణాంకాలు ఇప్పటికే లోకేష్ ఏపీ అసెంబ్లీలో వెల్లడించారు! ఈ క్రమంలో... వరుసగా రెండు నుంచి మూడు నెలలు విద్యార్థులు గైర్హాజరైతే.. వారి వివరాలను డ్రాప్ బాక్స్ లో ఉంచారు.

ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 5,94,863 మంది విద్యార్థుల పేర్లను ఈ డ్రాప్ బాక్స్ లో నమోదు చేశారు. అయితే.. 10వ తరగతి ఫెయిల్, ఐటీఐ, పాలిటెక్నిక్ లలో ఉన్న విద్యార్థులను మినహాయించి గత విద్యా సంవత్సరంలో డ్రాప్ అవుట్ అయినవారి సంఖ్య 4,85,662గా తేలింది. ఇదే సమయంలో ఆర్థిక ఇబ్బందులు కూడా ఈ డ్రాప్ అవుట్స్ కి కారణం అని తేలింది.

'అమ్మ ఒడి' అమలు చేశామని, సంక్షేమ కార్యక్రమాలు ఆద్భుతంగా చేశామని చెప్పే గత ప్రభుత్వ హయాంలో 1,75,254 మంది విద్యార్థులు ఆర్థిక ఇబ్బందుల కారణంగా డ్రాప్ అవుట్ అయ్యారనే లెక్కలు చెబుతున్నాయి! ఈ క్రమంలో... తాజా పరిశోధనల్లో 6,178 మంది విద్యార్థులు మరణించినప్పటికీ వారి పేర్లు డ్రాప్ బాక్స్ లోనే ఉన్నాయని చెబుతున్నారు.

ఇదే సమయంలో... తల్లితండ్రులు వలసల కారణం 82,103 మంది, అనాథలకు సరైన ఆశ్రయం లేక 1,632 మంది వారి విద్యను కొనసాగించలేకపోయారు. దీనికితోడు సమీపంలో పాఠశాలలు లేకపోవడం, తగినంత రవాణా సౌకర్యాలు లేకపోవడం వల్ల 44,818 మంది విద్యార్థులు చదువు మానేశారు.

ఈ నేపథ్యంలోనే నారా లోకేష్ నో బ్యాగ్ డే కి.. విద్యా అభివృద్ధితో పాటు ప్రతీ వారం విద్యార్థులకు సంతృప్తికరమైన, ఆకర్షణీయమైన అనుభవాన్ని అందించడం లక్ష్యంగా చేసుకుంది. అయితే... ఇది ప్రారంభం మాత్రమే.. రాబోయే రోజుల్లో విద్యా వ్యవస్థలో సమూల మార్పులతో లోకేష్ ముందుకు రాబోతున్నారని తెలుస్తోంది.

ఈ వేగవంతమైన సాంకేతిక పోటీ ప్రపంచంలో.. విద్యార్థుల భవిష్యత్తును అద్భుతంగా రూపొందించడానికి ఏపీ విద్యాశాఖ మంత్రి అపూరుపమైన కృషిని, సమయాన్ని అంకితం చేస్తున్నారనే చెప్పాలి.

Tags:    

Similar News