ఆ విషయంలో దక్షిణాది బ్యాక్ బెంచ్ అన్న బాబు
ఉత్తారాదితో దక్షిణాది ఒక విషయంలో వెనకబడిపోయిందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు.;

ఉత్తారాదితో దక్షిణాది ఒక విషయంలో వెనకబడిపోయిందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. మద్రాస్ ఐఐటీలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ దక్షిణాది ఎప్పటికీ ఈ విషయంలో బ్యాక్ బెంచీలోనే ఉందని అన్నారు.
ఉత్తరాది రాష్ట్రాలు పెద్ద ఎత్తున పిల్లలను కంటూ దేశ జనాభాను పెంచుతూంటే దక్షిణాది రాష్ట్రాలు మాత్రం ఫెర్టిలిటీ సమస్యతో సతమతమవుతున్నాయని అన్నారు. అందుకే దక్షిణాదిలో జనాభా సమస్య ఏర్పడుతోందని ఆయన అన్నారు.
ఉత్తరప్రదేశ్, బీహార్ వంటి రాష్ట్రాలు జనాభాను ఎప్పటికపుడు పెంచుతూ ఇండియాను కాపాడుతున్నారని కూడా బాబు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. అదే పని దక్షిణాది చేయలేకపోతోందని దాని వల్ల అనేక ఇతర సమస్యలు కూడా వస్తున్నాయని అన్నారు.
తమిళనాడు, ఏపీ వంటివి సంతానోత్పత్తిలో రేటింగ్ తగ్గి ఇబ్బంది పడుతున్నాయని బాబు అన్నారు. ఒకనాడు జనాభా పెరుగుదల అన్నది దేశానికి ముప్పుగా పరిణమించేదని, కానీ ఈనాడు మాత్రం అది దేశానికి వరంగా మారిందని బాబు అన్నారు.
ఎక్కువ మంది పిల్లలు ఉండడం భారత్ కి ఒక వరం అని దేవుడు ఇచ్చిన డివిడెండ్ అని చంద్రబాబు అన్నారు. దీనిని భారత్ ఉపయోగించుకోవాలని ఆయన అన్నారు. ప్రపంచ దేశాలలో జనాభా ఈ రోజున బాగా తగ్గిపోతోంది అని బాబు చెప్పారు. అదే భారత్ లో జనాభా అధికంగా ఉండడం ఒక అదృష్టంగా భావించాలని ఆయన అన్నారు.
మరో నలభై అయిదేళ్ళ వరకూ భారత్ కి జనాభా విషయంలో సమస్య లేదని బాబు స్పష్టం చేశారు. అందరూ కలసి కృషి చేస్తే భారత్ ప్రపంచంలోనే అగ్రస్థానంలో చేరుకోవడం ఖాయమని అన్నారు. కాగా ఇటీవలే డీలిమిటేషన్ వల్ల దక్షిణాది రాష్ట్రాలు తీవ్రంగా నష్టపోతాయని చెబుతూ తమిళనాడు సీఎం స్టాలిన్ ఒక అఖిల పక్ష సమావేశాన్ని నిర్వహించారు. జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్ కనుక జరిగితే దక్షిణాది రాష్ట్రాలకు తీవ్రంగా నష్టం వస్తుందని ఎంపీ సీట్ల సంఖ్య తగ్గుతుందని ఆయనతో పాటు సౌత్ స్టేట్స్ సీఎంలు కొందరు ఆవేదన వ్యక్తం చేస్తూ వచ్చారు.
ఈ నేపధ్యంలో చంద్రబాబు జనాభా తగ్గుదల గురించి మాట్లాడడం, ఉత్తరాదిన బీహార్ యూపీని కోట్ చేస్తూ అక్కడ అధిక జనాభా ఉందని చెప్పడం రాజకీయంగా ఆసక్తిని పెంచుతోంది. అంతే కాదు దక్షిణాది రాష్ట్రాలు పిల్లలను కనాలని ఆయన కోరడం విశేషం. డీలిమిటేషన్ మీద ఎన్డీయే ముఖ్య భాగస్వామిగా టీడీపీ బయటకు ఏమీ చెప్పకపోయినా జనాభా తగ్గిన నేపథ్యంలో సౌత్ స్టేట్స్ ఇబ్బంది అవుతుందన్నది అంతా అంటున్నదే. బాబు పిల్లలను కనాలని కోరడం ద్వారా కొంతలో కొంత సౌత్ స్టేట్స్ లీడర్ల ట్యూన్ ని తానూ వినిపించారు అని చర్చ సాగుతోంది.