చంద్ర‌బాబుకు అందుకే మ‌ద్దతిచ్చాం.. : ప‌వ‌న్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

ఈ క్ర‌మంలోనే చంద్ర‌బాబు పీ-4 ప‌థ‌కానికి శ్రీకారం చుట్టార‌ని చెప్పారు. ప్ర‌భుత్వం, ప్రైవేటు క‌లిసి పేద‌ల‌ను ఆదుకుని.. వారి జీవితాల‌ను బాగు చేయ‌డ‌మే ల‌క్ష్యంగా ఈ కార్య‌క్ర‌మాన్ని రూపొందించిన‌ట్టు ప‌వ‌న్ క‌ల్యాణ్ తెలిపారు.;

Update: 2025-03-31 05:54 GMT
చంద్ర‌బాబుకు అందుకే మ‌ద్దతిచ్చాం.. : ప‌వ‌న్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

జ‌న‌సేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. తాజాగా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఆదివారం రాత్రి రాజ‌ధాని అమ రావ‌తిలోని వెల‌గ‌పూడిలో జ‌రిగిన `పీ-4` ప్రారంభ కార్య‌క్ర‌మంలో ఆయ‌న పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. గ‌త ఎన్నిక‌ల్లో చంద్ర‌బాబు ఎందుకు మ‌ద్ద‌తు ఇచ్చిందీ.. భ‌విష్య‌త్తులోనూ ఆయ‌న‌తో ఎందుకు పొత్తులోనే ఉంటామ‌ని చెబుతు న్న‌దీ స‌మ‌గ్రంగా ప‌వ‌న్ క‌ల్యాణ్ వివ‌రించారు. రాష్ట్రంలో 164 అసెంబ్లీ, 21 పార్ల‌మెంటుస్థానాలు అందించిన ప్ర‌జ‌ల జీవితాల‌ను బాగు చేయాల్సిన అవ‌స‌రం త‌మ‌పై ఉంద‌న్నారు.

ఈ క్ర‌మంలోనే చంద్ర‌బాబు పీ-4 ప‌థ‌కానికి శ్రీకారం చుట్టార‌ని చెప్పారు. ప్ర‌భుత్వం, ప్రైవేటు క‌లిసి పేద‌ల‌ను ఆదుకుని.. వారి జీవి తాల‌ను బాగు చేయ‌డ‌మే ల‌క్ష్యంగా ఈ కార్య‌క్ర‌మాన్ని రూపొందించిన‌ట్టు ప‌వ‌న్ క‌ల్యాణ్ తెలిపారు. ``అస‌లు ఈ ఆలోచ‌న ఎలా వ‌చ్చిందో నాకు తెలియ‌దు. నాకైతే రాలేదు. అదే మ‌న సీఎం చంద్ర‌బాబు ప్ర‌త్యేక‌త‌. మ‌నం రేప‌టి నుంచి ఆలోచిస్తాం. కానీ, ఆయ‌న రేపు వ‌చ్చే ప‌దేళ్ల గురించి ఆలోచిస్తారు. ఇదే నాకు న‌చ్చింది. మ‌నం ఒక త‌రం గురించే ఆలోచిస్తాం. కానీ, మూడు త‌రాల భ‌విష్య‌త్తును చంద్ర‌బాబు క‌ల‌గంటారు. సాకారం చేసేందుకు ప్ర‌య‌త్నిస్తారు .. ఇదే ఆయ‌న వెంట మ‌మ్మ‌ల్ని న‌డిపించింది`` అని ప‌వ‌న్ క‌ల్యాణ్ అన్నారు.

నాయ‌కుడు అన్న‌వాడు.. ఇప్ప‌టి గురించి ఆలోచించ‌డం కాద‌ని, భ‌విష్య‌త్తును కూడా స్వ‌ప్నించాల‌ని తాను చ‌దువుకున్న‌ట్టు ప‌వ‌న్ చెప్పారు. ఇది చంద్ర‌బాబులో మాత్ర‌మే త‌న‌కు క‌నిపించింద‌న్నారు. ఏపీని ఆవిధంగా అభివృద్ధి చేస్తారనే చంద్రబాబుకు మద్దతు ఇచ్చామ‌ని చెప్పారు. భ‌విష్య‌త్తులోనూ ఆయ‌న‌తో క‌లిసి న‌డుస్తామ‌ని.. దీనికి ప్రాతిప‌దిక‌.. ఆయ‌న విజ‌న్‌(దూర‌దృష్టి) అని తెలిపారు. గ‌త ప్ర‌భుత్వం(వైసీపీ) త‌న వారి గురించి.. త‌మ ఆస్తుల గురించే ఆలోచించింద‌ని దుయ్య‌బ‌ట్టారు. కానీ, చంద్ర‌బాబు ప్ర‌జ‌ల ఆస్తుల గురించి.. వారి భ‌విష్య‌త్తు గురించి ఆలోచిస్తున్నార‌ని.. ఈ క్ర‌మంలోనే పీ-4 అనే కార్య‌క్ర‌మాన్ని ఆయ‌న క‌ల గ‌న్నార‌ని చెప్పారు.

చంద్రబాబు సారథ్యంలో రాష్ట్రం స్వర్ణాంధ్రగా మారుతుందని ప‌వ‌న్ చెప్పారు. చంద్ర‌బాబు తెచ్చిన‌ పీ-4 వల్ల లక్షలాది మంది కుటుంబాల్లో మార్పులు వస్తాయని తెలిపారు. ``ఈ ఉగాది రాష్ట్ర చ‌రిత్ర‌లో ఒక చారిత్రాత్మక రోజుగా నిలిచిపోతుంది. ఒక నాయకుడు వచ్చే ఎన్నికల గురించి ఆలోచిస్తాడు. ఒక నిజమైన లీడర్(చంద్ర‌బాబు) వచ్చే తరం కోసం ఆలోచిస్తాడు. ఆయ‌నే మ‌న చంద్ర‌బాబు. ఆయ‌న మేం ఉన్న‌ది అందుకే. ఆయ‌న ఒక తరం కోసం కాదు.. రెండు మూడు తరాల కోసం ఆలోచిస్తారు. ప‌నిచేస్తారు. అదే ఆయ‌న ఘ‌న‌త‌. మేం అనుస‌రించేది అందుకే`` అని ప‌వ‌న్ స‌భికుల హ‌ర్షాతిరేకాల మ‌ధ్య ప్ర‌క‌టించారు.

Tags:    

Similar News