గాల్లో తేలిపోతున్న టైగర్ వుడ్స్.. ట్రంప్ కోడలితో రోమాన్స్ మరీ!
పాశ్చాత్య దేశాల్లో అంతే.. ప్రేమకు వయసు లేదు.. బంధానికి దాపరికం లేదు. ఎవరు ఎవరినైనా ప్రేమించవచ్చు.;

పాశ్చాత్య దేశాల్లో అంతే.. ప్రేమకు వయసు లేదు.. బంధానికి దాపరికం లేదు. ఎవరు ఎవరినైనా ప్రేమించవచ్చు. అయితే వాళ్లు సెలబ్రెటీలు అయితే మాత్రం ఇదిగో ఇలా వార్త అయ్యి కూర్చుంటుంది. క్షణాల్లో వైరల్ అవుతుంది. డొనాల్డ్ ట్రంప్ కొడుకు మాజీ భార్య తో టైగర్ వుడ్స్ ఘాటు ప్రేమాయణం ఇప్పుడు సోషల్ మీడియాను ఊపేస్తోంది.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాజీ కోడలు వెనెసాతో గోల్ఫ్ దిగ్గజం టైగర్ వుడ్స్ ప్రేమలో ఉన్నట్లు ప్రకటించడంతో సోషల్ మీడియా ఒక్కసారిగా వేడెక్కింది. తాను వెనెసాతో డేటింగ్ చేస్తున్నానని టైగర్ వుడ్స్ స్వయంగా సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.
"నీ ప్రేమలో ఉంటే గాల్లో తేలినట్లుంది.. నువ్వు నా పక్కన ఉంటే జీవితం మరింత అద్భుతంగా ఉంటుంది" అంటూ వెనెసాపై తనకున్న ప్రేమను వ్యక్తం చేస్తూ ఆమెతో కలిసి దిగిన కొన్ని ఫోటోలను కూడా టైగర్ వుడ్స్ పంచుకున్నారు. తమ వ్యక్తిగత జీవితానికి గౌరవం ఇచ్చినందుకు తన సన్నిహితులకు ఆయన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.
టైగర్ వుడ్స్ ప్రకటనను వెనెసా కూడా ధృవీకరించారు. తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో టైగర్ వుడ్స్‌తో కలిసి ఉన్న ఫోటోను షేర్ చేస్తూ వారి బంధాన్ని అధికారికంగా ప్రకటించారు.
వెనెసా గతంలో డొనాల్డ్ ట్రంప్ కుమారుడు డొనాల్డ్ ట్రంప్ జూనియర్‌ను వివాహం చేసుకున్నారు. 2005లో వీరి వివాహం జరగగా, మనస్పర్థల కారణంగా 2018లో వీరిద్దరూ విడాకులు తీసుకున్నారు. వీరికి ఐదుగురు పిల్లలు ఉన్నారు.
ఆ తర్వాత 2020లో డొనాల్డ్ ట్రంప్ జూనియర్ ఫాక్స్ న్యూస్ మాజీ హోస్ట్ కింబర్లీతో నిశ్చితార్థం చేసుకున్నారు. అయితే, తాజాగా డొనాల్డ్ ట్రంప్ జూనియర్ మరో మహిళతో కలిసి చేయి పట్టుకుని నడుస్తున్న ఫోటోలు అంతర్జాతీయ మీడియాలో వైరల్ కావడంతో ఆయన కింబర్లీతో నిశ్చితార్థం రద్దు చేసుకున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి.
మొత్తానికి, టైగర్ వుడ్స్ - వెనెసా ప్రేమ వ్యవహారం ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఒకప్పటి రాజకీయ ప్రత్యర్థుల కుటుంబాల మధ్య ఏర్పడిన ఈ బంధంపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు.