పెద్దోళ్లకు మినహాయింపా? షారుఖ్‌ఖాన్, సచిన్, కోహ్లీలకు బెట్టింగ్ ఉచ్చు?
దేశంలోని బడా ప్రముఖులు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశారని వారిపై ముందు కేసులు పెట్టాలని పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు దాఖలు కావడం సంచలనమైంది.;
ఈరోజు కేఏ పాల్ అన్నట్టు.. కోట్లు ఉన్నా కూడా సచిన్ టెండూల్కర్ డబ్బుల కోసం బెట్టింగ్ యాప్ లు ప్రమోట్ చేయడం ఏంటి అన్న పాయింట్ లో నిజంగానే లాజిక్ ఉంది. ఎందుకంటే తెలుగు యూట్యూబర్స్, చిన్నా చితక నటీనటులు ఏదో డబ్బుల అవసరార్థం ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశారంటే అర్థం చేసుకోవచ్చు. కానీ దేశంలోనే బడా సినీ, క్రీడా ప్రముఖులు, కోట్లకు పడగలెత్తిన షారుఖ్, సచిన్, కోహ్లీ లాంటి వారు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం నిజంగానే నేరం. ఇప్పుడు టాలీవుడ్ స్టార్స్, చిన్నా చితక నటీనటులు, యూట్యూబర్స్ పై పడుతున్న తెలంగాణ పోలీసులకు మరో చిక్కు వచ్చి పడింది. దేశంలోని బడా ప్రముఖులు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశారని వారిపై ముందు కేసులు పెట్టాలని పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు దాఖలు కావడం సంచలనమైంది. కోట్లు సంపాదించిన వారిని వదిలి,యూట్యూబర్స్‌ను టార్గెట్ చేయడం సబబు కాదంటున్న హైదరాబాద్ గ్రీన్స్ సొసైటీ ఈ మేరకు దేశంలో బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన షారుఖ్‌ఖాన్, సచిన్, కోహ్లీలపై పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేయడానికి రెడీ కావడం చర్చనీయాంశమైంది.
ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌ల ప్రమోషన్ వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర కలకలం రేపుతున్న నేపథ్యంలో, హైదరాబాద్ గ్రీన్స్ సొసైటీ సంచలన నిర్ణయం తీసుకుంది. బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్, క్రికెట్ దిగ్గజాలు సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీలపై పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని సొసైటీ నిర్ణయించింది. ఈ ముగ్గురు ప్రముఖులు బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేసి కోట్ల రూపాయలు సంపాదించారని, అయితే వారిని వదిలేసి కేవలం యూట్యూబర్లను మాత్రమే టార్గెట్ చేయడం సరికాదని సొసైటీ తీవ్రంగా ఆక్షేపిస్తోంది.
తెలంగాణలో గత కొన్ని నెలలుగా బెట్టింగ్ యాప్‌లను ప్రోత్సహిస్తున్న వారిపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఇప్పటికే పంజాగుట్ట, మియాపూర్ పోలీస్ స్టేషన్లలో పలువురు యూట్యూబర్లు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లు, చిన్న స్థాయి సెలబ్రిటీలపై కేసులు నమోదయ్యాయి. హర్ష సాయి, విష్ణుప్రియ, టేస్టీ తేజ, శ్యామల వంటి వారు ఈ జాబితాలో ఉన్నారు. అయితే, ఈ యాప్‌లను నిజంగా ప్రమోట్ చేసిన పెద్ద సెలబ్రిటీలపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై హైదరాబాద్ గ్రీన్స్ సొసైటీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.
షారుఖ్ ఖాన్ గతంలో అనేక ఆన్‌లైన్ గేమింగ్ , బెట్టింగ్ యాప్‌లకు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించారు. అలాగే, సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ వంటి క్రికెట్ స్టార్లు ఫాంటసీ స్పోర్ట్స్ యాప్‌లను ప్రమోట్ చేస్తూ కోట్లాది రూపాయలు ఆర్జించారని సొసైటీ ఆరోపిస్తోంది. ఈ ఫాంటసీ యాప్‌లు కూడా బెట్టింగ్‌కు సంబంధించినవేనని, వీటి వల్ల యువత తప్పుదోవ పడుతోందని వారు వాదిస్తున్నారు.
ఈ విషయంపై హైదరాబాద్ గ్రీన్స్ సొసైటీ ప్రతినిధి మాట్లాడుతూ "ఇంత పెద్ద స్థాయి సెలబ్రిటీలు బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేస్తే వారి అభిమానులు వాటిని నమ్మి మోసపోతారు. కానీ, పోలీసులు వీరిని వదిలేసి చిన్న చిన్న యూట్యూబర్లను మాత్రమే లక్ష్యంగా చేసుకోవడం ఎంతవరకు సమంజసం?" అని ప్రశ్నించారు. పెద్ద సెలబ్రిటీలను వదిలేసి, చిన్న వారిని మాత్రమే శిక్షించడం సరైన విధానం కాదని ఆయన స్పష్టం చేశారు.
మొత్తానికి ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌ల ప్రమోషన్ వ్యవహారంలో హైదరాబాద్ గ్రీన్స్ సొసైటీ తీసుకున్న ఈ నిర్ణయం చర్చనీయాంశంగా మారింది. పోలీసులు ఇకపై ఈ విషయంలో ఎలా స్పందిస్తారో వేచి చూడాలి. పెద్ద సెలబ్రిటీలపై కూడా చర్యలు తీసుకుంటారా లేదా అనేది కాలమే నిర్ణయించాలి.