ఏపీలో సీఎం మాజీ సీఎం కి డీలిమిటేషన్ అవసరం లేదా...రెండు పార్టీలు ముంచుతున్నాయా ?

డీలిమిటేషన్ చేస్తే దక్షిణాదికి తీరని అన్యాయం జరుగుతుందని ఆ ప్రాంత ముఖ్యమంత్రులు కీలక నేతలు రాజకీయ పార్టీలు అంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు;

Update: 2025-03-25 12:30 GMT

ఈ రోజున దక్షిణాది అంతా డీలిమిటేషన్ అన్న దాని మీద ఊగిపోతోంది. డీలిమిటేషన్ చేస్తే దక్షిణాదికి తీరని అన్యాయం జరుగుతుందని ఆ ప్రాంత ముఖ్యమంత్రులు కీలక నేతలు రాజకీయ పార్టీలు అంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆందోళనకు సిద్ధపడుతున్నారు.

నిజానికి ఇది రాజకీయ సమస్య కానే కాదు, రాష్ట్ర సమస్య. ఇంకా గట్టిగా చెప్పాలంటే భావి తరాల సమస్య. ఈ రోజున ఉన్న రాజకీయ పార్టీలు కానీ నాయకులు కానీ సరైన నిర్ణయం ఈ విషయంలో తీసుకోకపోతే మాత్రం భావి తరాలు తీరని నష్టానికి నోచుకుంటాయి. ఎంపీ సీట్ల నుంచే కాదు నిధుల విడుదల నుంచి అభివృద్ధి నుంచి కూడా దక్షిణాది రాష్ట్రాలు ఇబ్బందులు పడతాయి.

ఒక విధంగా చెప్పాలంటే ఇది అత్యంత సీరియస్ ఇష్యూగా ఉంది. ఈ రోజున ఇంతకు మించిన తీవ్రమైన అంశం వేరొకటి లేదు. రాజకీయ పార్టీలు అన్నీ కలసి సంఘటితం కావాల్సిన తరుణం ఇది. ఇపుడు కాకపోతే మరెప్పుడు అన్నట్లుగా ఉద్యమించాలి. చూస్తూండగానే 2026 వచ్చేసి డీలిమిటేషన్ కనుక అమలు అయితే మాత్రం సౌత్ స్టేట్స్ తీరని నష్టంతో కొట్టుమిట్టాడుతాయన్నది మేధావులు నిపుణుల మాటగా ఉంది.

పొరుగున ఉన్న తమిళనాడు అలాగే తెలంగాణా కర్ణాటక కేరళ వంటి రాష్ట్రాలు ఈ విషయంలొ సీరియస్ గానే ఉన్నాయి. ఏపీ మాత్రమే నిమ్మకు నీరెత్తినట్లుగా ఉంది అని అంటున్నారు. ఇదిలా ఉంటే ఏపీకి సంబంధించి టీడీపీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు వైపు అలాగే వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ వైపు దక్షిణాది పార్టీల నేతలు చూస్తున్నారు.

ఈ విషయంలొ పవన్ కళ్యాణ్ ని అంతగా లెక్కలోకి తీసుకోవడం లేదు అని అంటున్నారు. ఇక చంద్రబాబు కానీ జగన్ కానీ డీలిమిటేషన్ మీద ఎంత వరకూ సీరియస్ గా ఉన్నారని కూడా సౌత్ స్టేట్స్ పార్టీలకు చెందిన పెద్దలు నిశితంగా గమనిస్తున్నారు.

అయితే ఎంతో అనుభవం కలిగిన రాజకీయ నాయకుడు చంద్రబాబు డీలిమిటేషన్ గురించి అసలు పట్టించుకోవడం లేదు అని అంటున్నారు. ఇక జగన్ సైతం అఖిలపక్షం రోజున ప్రధానికి స్మూత్ గా ఒక లేఖ రాసేసి మమ అనిపించారు ఇది అలాంటి చిన్న విషయమా అన్నది కూడా ఆలోచించడంలేదని అంటున్నారు.

అదే తమిళనాడులో అన్ని పార్టీలూ డీలిమిటేషన్ కి వ్యతిరేకంగా గొంతు కలిపాయి. అలాగే రాజకీయంగా బద్ధ శత్రువులు గా ఉన్న కాంగ్రెస్ బీఆర్ఎస్ ఈ రెండు పార్టీలకు చెందిన నాయకులు చెన్నై మీటింగుకు వెళ్ళి వచ్చాయి. అక్కడ సీఎం రేవంత్ రెడ్డి మాజీ సీఎం కేసీఆర్ ఇద్దరూ కూడా డీలిమిటేషన్ మీద చాలా సీరియస్ గానే ఉన్నారు. భవిష్యత్తు కార్యాచరణ ఏమిటి అన్నది ఆలోచిస్తున్నారు.

కానీ ఒక్క ఏపీ మాత్రమే తేడా కొడుతోంది అని అంటున్నారు. సీఎం చంద్రబాబు మాజీ సీఎం జగన్ ఇద్దరూ ఇంతటి కీలకమైన ఇష్యూని పట్టించుకోకపోవడం మీద విమర్శలు వస్తున్నాయి. జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్ జరిగితే ఏపీలో ప్రస్తుతం ఉన్న 25 సీట్లకు ఒకటో రెండో పెరిగితే పెరగవచ్చు. అంతకు మించి ఏమీ ఉండదు.

అంతే కాదు కేంద్రంలో చక్రం తిప్పాలన్న కలలకు శాశ్వతంగా సమాధి కట్టినట్లే అంటున్నారు. వైసీపీ టీడీపీ రెండూ ప్రాంతీయ పార్టీలు. ఈ పార్టీలకే ఎక్కువ ఇబ్బందులు డీలిమిటేషన్ వల్ల వస్తాయని అంటున్నారు. జాతీయ పార్టీల ప్రాధాన్యత పెరుగుతుందని దాంతో వాటి వైపే జనాలు మొగ్గు చూపితే కనుక ప్రాంతీయ పార్టీల అస్తిత్వమే లేకుండా పోతుంది అని అంటున్నారు.

ఈ రోజున కేంద్రంలో ప్రభుత్వం ఉంది అంటే టీడీపీ మద్దతుతో. దాంతో ఎంతో కొంత బాబు మాట చెల్లుబాటు అవుతోంది. మరి డీలిమిటేషన్ తరువాత ఉత్తరాదికే రాజకీయం మొత్తం పరిమితం అయితే ఫ్యూచర్ లో ఈ పార్టీల సంగతేంటి అన్న ఆలోచన అయినా చేఅయాలి కదా అని అంటున్నారు.

జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్ కి మేము వ్యతిరేకం అని బాబు అల్టిమేటం ఇవ్వాలని కోరుతున్నారు. అలాగే జగన్ సైతం సౌత్ స్టేట్స్ కి జరుగుతున్న అన్యాయం మీద గళం విప్పాలని అంటున్నారు. అపుడే కేంద్రం కూడా తన ఆలోచనలు మార్చుకుంటుంది అని అంటున్నారు. సౌత్ లో ఎన్డీయే ప్రభుత్వం ఉన్న ఏకైక రాష్ట్రం ఏపీనే. అక్కడ నుంచే ఆందోళన మొదలైతేనే ఆ సెగ వేరే లెవెల్ లో కేంద్రానికి తాకుతుంది అని అంటున్నారు. మరి బాబు జగన్ ఇద్దరూ డీలిమిటేషన్ మీద మోడీని ఢీ కొట్టడానికి సిద్ధమేనా అన్నదే చర్చ. అలా కనుక చేయకపోతే మాత్రం విమర్శల పాలు అవడం ఖాయమని అంటున్నారు.

Tags:    

Similar News