కబడ్డీ మాజీ ప్లేయర్ దీపక్ హుడాపై పోలీస్ స్టేషన్‌లో భార్య దాడి: వీడియో వైరల్

భారత కబడ్డీ జట్టు మాజీ ఆటగాడు దీపక్ నివాస్ హుడా... అతని భార్య ప్రముఖ భారత బాక్సర్ స్వీటీ బూరా కొంతకాలంగా విభేదాలతో దూరంగా ఉంటున్నారు.;

Update: 2025-03-25 11:54 GMT

భారత కబడ్డీ జట్టు మాజీ ఆటగాడు దీపక్ నివాస్ హుడా... అతని భార్య ప్రముఖ భారత బాక్సర్ స్వీటీ బూరా కొంతకాలంగా విభేదాలతో దూరంగా ఉంటున్నారు. తాజాగా వీరి వివాదం మరింత ముదిరింది. అదనపు కట్నం కోసం దీపక్ తనను వేధిస్తున్నాడని స్వీటీ బూరా పోలీసులకు ఫిర్యాదు చేయగా.. ఈ విషయంపై పెద్దల సమక్షంలో చర్చలు జరుగుతుండగా స్వీటీ బూరా అసహనంతో దీపక్ హుడా కాలర్ పట్టుకొని దాడి చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఈ ఘటనకు ముందు హిసార్ మహిళా పోలీస్ స్టేషన్‌లో మోసం, దాడి, వరకట్న వేధింపుల కేసులో ఇరువర్గాలను విచారణకు పిలిచారు. ఈ సందర్భంగా అంతర్జాతీయ బాక్సర్ అయిన స్వీటీ బూరా, ఆమె మామ , తండ్రితో కలిసి తనపై దాడి చేశారని దీపక్ హుడా ఆరోపించారు. దీపక్ ఫిర్యాదు మేరకు సదర్ పోలీసులు కేసు నమోదు చేశారు.

దీపక్ హుడా తన ఫిర్యాదులో ఫిబ్రవరి 25న స్వీటీ బూరా తనపై మహిళా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసిందని పేర్కొన్నారు. "ఈ విషయంపై విచారణ కోసం మార్చి 15న నన్ను హిసార్ మహిళా పోలీస్ స్టేషన్‌కు పిలిచారు. స్వీటీ , ఆమె కుటుంబ సభ్యులు కూడా పోలీస్ స్టేషన్‌కు వచ్చారు. ఆ సమయంలో, నాకు - స్వీటీకి మధ్య వాగ్వాదం జరిగింది. అది తీవ్రం కావడంతో, స్వీటీ నాపై దాడి చేసింది. ఆమె తండ్రి, మామ కూడా ఆమెకు సహకరించారు. నాకు గాయాలు కావడంతో నేరుగా హిసార్‌లోని సివిల్ ఆసుపత్రికి వెళ్లాను. చికిత్స పొందిన తర్వాత మార్చి 16న సదర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాను" అని దీపక్ వివరించారు.

మరోవైపు స్వీటీ బూరా తరపున ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. అయితే, వైరల్ అవుతున్న వీడియోలో ఆమె ఆగ్రహంగా దీపక్ హుడా కాలర్ పట్టుకోవడం స్పష్టంగా కనిపిస్తోంది. ఈ ఘటన ఇరువురి మధ్య నెలకొన్న వివాదం ఎంత తీవ్రంగా ఉందో తెలియజేస్తోంది.

ప్రస్తుతం ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇరువైపుల ఆరోపణలు, ఫిర్యాదుల ఆధారంగా తగిన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. కబడ్డీ - బాక్సింగ్ రంగాల్లో తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈ ఇద్దరు క్రీడాకారుల మధ్య నెలకొన్న ఈ వివాదం క్రీడా వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ కేసు ఏ మలుపు తిరుగుతుందో వేచి చూడాలి.

Tags:    

Similar News