వెంటిలేటర్ ‌పై బన్నీ బామ్మ.. రామ్ చరణ్ అమ్మమ్మ?

భర్త నుంచి మనవళ్ల వరకు 60-70 ఏళ్లుగా కుటుంబం అంతా సినీ రంగంలోనే ఉన్నా బయటి ప్రపంచానికి చాలా తక్కువగా తెలిసిన వ్యక్తి అల్లు కనకరత్నం.;

Update: 2025-03-24 12:19 GMT

దివంగత ప్రముఖ నటుడు అల్లు రామలింగయ్య సతీమణి.. దిగ్గజ నిర్మాత అల్లు అరవింద్ తల్లిగారు.. మెగాస్టార్ చిరంజీవి అత్తగారు, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నానమ్మ, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అమ్మమ్మ అల్లు కనకరత్నం అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని తెలుస్తోంది. 95 ఏళ్ల కనకరత్నం ఐసీయూలో వెంటిలేటర్ పై ఉన్నారని సమాచారం.

భర్త నుంచి మనవళ్ల వరకు 60-70 ఏళ్లుగా కుటుంబం అంతా సినీ రంగంలోనే ఉన్నా బయటి ప్రపంచానికి చాలా తక్కువగా తెలిసిన వ్యక్తి అల్లు కనకరత్నం. దాదాపు రెండేళ్ల కిందట భర్త అల్లు రామలింగయ్య శత జయంతి సందర్భంగా మాత్రమే ఆమె కనిపించారు. అప్పుడు కూడా వీల్ చైర్ లో హాజరయ్యారు. కాగా, కనకరత్నం ఆస్పత్రిలో ఉన్నట్లు సోషల్ మీడియాలోనూ వార్తలు వస్తున్నాయి.

వయో భారంతో కొన్నిరోజులుగా కనకరత్నం అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. దీంతో కుటుంబసభ్యులు హైదరాబాద్‌ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారట. కాగా, అల్లు రామలింగయ్య, కనకరత్నం దంపతులకు కుమారుడు అల్లు అరవింద్, కుమార్తె సురేఖ, మరో కుమార్తె ఉన్నారు. మెగా ప్రొడ్యూసర్ గా అరవింద్, మెగాస్టార్ చిరంజీవి భార్యగా సురేఖ సినీ అభిమానులకు సుపరిచితమే. ఇక బన్నీ అని ముద్దుగా పిలుచుకునే అల్లు అర్జున్ తో పాటు శిరీష్, బాబీ, రామ్ చరణ్, సుష్మిత, శ్రీజ తదితరులు కనకరత్నం మనవరాళ్లు, మనవళ్లు.

అల్లు రామలింగయ్య 2004లో చనిపోయారు. ఆయన శత జయంతి సందర్భంగా కుటుంబ సభ్యులు 'అల్లు స్టూడియో' ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి కనకరత్నం హాజరయ్యారు. ఇక ‘పుష్ప 2' ప్రీమియర్ షో టైంలో సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో అల్లు అర్జున్ అరెస్టయి, జైలు నుంచి వచ్చాక అతడికి కనకరత్నమే దిష్టి తీశారు.

కాగా, సినీ పరిశ్రమలో అప్పుడప్పుడే ఎదుగుతున్న చిరంజీవిని తమ ఇంటి అల్లుడిగా చేసుకోవాలన్నది కనకరత్నం ఆలోచనే. తమ ఇంటిపైన ఉండే స్నేహితుడిని చూసేందుకు వచ్చిన చిరంజీవిని గమనించిన కనకరత్నం ఆ విషయాన్ని భర్త అల్లు రామలింగయ్యకు చెప్పారు. ఆయన ఆరా తీసి తమ కుమార్తె సురేఖను చిరంజీవికి ఇచ్చి వివాహం చేశారు.

Tags:    

Similar News