బోర్డర్ లో ఏఐ రోబోలు.. ఏమేమి చేస్తాయంటే..?
బోర్డర్ లో సెక్యూరిటీ కోసం అస్సాంలోని ఐఐటీ పరిశోధకులు అధునాతన రోబోలను అభివృద్ధి చేశారు.;
అంతర్జాతీయ సరిహద్దుల వద్ద నిత్యం సైన్యం పహారా కాస్తుందనే సంగతి తెలిసిందే. అయితే... ఇకపై బోర్డర్ దగ్గర భద్రతను నిర్వహించడానికి అస్సాంలోని గువాహటి ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) పరిశోధకులు అధునాతన రోబోలను అభివృద్ధి చేశారని అధికారులు తెలిపారు. ఈ రోబోలు ఏ స్థాయిలో పెర్ఫార్మ్ చేస్తాయనేది వెల్లడించారు.
అవును... బోర్డర్ లో సెక్యూరిటీ కోసం అస్సాంలోని ఐఐటీ పరిశోధకులు అధునాతన రోబోలను అభివృద్ధి చేశారు. అత్యంత సవాళ్లతో కూడిన అంతర్జాతీయ సరిహద్దులను నిరంతరం పర్యవేక్షించడానికి ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఆధారిత రోబోలు అద్భుతంగా పనిచేస్తాయని.. ఈ ఏఐ ఆధారిత నిఘాతో చాలా ప్రయోజనాలు ఉంటాయని తెలిపారు.
ఐఐటీలోని డీఏ స్పాటియో రోబోటిక్ లాబొరేటరీ ప్రైవేట్ లిమిటెడ్ అనే స్టార్టప్ అభివృద్ధి చేసిన ఈ రోబోలు రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ నుంచి గుర్తింపు పొందినట్లు తెలుస్తోంది. భారత సైన్యం ఇప్పటికే ఈ నిఘా వ్యవస్థ కోసం ఫీల్డ్ ట్రయల్స్ నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
ఈ సందర్భంగా స్పందించిన డీఏ స్పాటియో రోబోటిక్ లాబొరేటరీ ప్రైవేట్ లిమిటెడ్ సీఈఓ అర్నబ్ కుమార్ బర్మాన్... మాన్యువల్ పెట్రోలింగ్ పై ఆధారపడే సంప్రదాయ భద్రతా చర్యలకు భిన్నంగా ఈ రోబోలు స్వయంప్రతిపత్త వ్యవస్థను కలిగి ఉంటాయని అన్నారు. ఇవి అన్ని వాతవరణ పరిస్థితుల్లో సమర్థవంతంగా పనిచేస్తాయని తెలిపారు.
అంతర్జాతీయ సరిహద్దుల్లో దుండగులు డ్రోన్లను పంపడం, చొరబాట్లకు ప్రయత్నించడం వంటివి చేసినప్పుడు ఈ రోబోల సెన్సార్లు వెంటనే గుర్తిస్తాయని.. అలర్ట్ చేస్తాయని అర్నబ్ కుమార్ తెలిపారు. నావిగేషన్, ఏఐ ఆధారిత నిఘాతో కూడిన ఈ వ్యవస్థ సరిహద్దు రక్షణ, కీలకమైన మౌలిక సదుపాయాల నిఘా విప్లవాత్మక మార్పు కానుందని అన్నారు.
ఇదే సమయంలో... జాతీయ, అంతర్జాతీయ భద్రత విషయంలో ఎదురవుతున్న సవాళ్లను ఎదుర్కోవడానికి ఏఐ ఆధారిత అత్యాధునిక నిఘా పరికరాలను అభివృద్ధి చేయాలనేది తమ లక్ష్యమని పేర్కొన్నారు.