మర్రి తర్వాత వైసీపీకి గుడ్ బై చెప్పే ఎమ్మెల్సీ ?

ఇపుడు ఆరవ ఎమ్మెల్సీ ఎవరా అని చర్చ అయితే జోరుగా సాగుతోంది.;

Update: 2025-03-23 12:53 GMT

పాంచ్ పటాకా అన్నట్లుగా అయిదురుగు ఎమ్మెల్సీలు వైసీపీని వీడిపోయారు. దీనికి పోతుల సునీత తోవ తీశారు. అదే బాటలో కర్రి పద్మశ్రీ, కళ్యాణ్ చక్రవర్తి, జయమంగళ వెంకటరమణ నడిచారు. లేటెస్ట్ గా చూస్తే కనుక వైఎస్సార్ కుటుంబానికి అత్యంత సన్నిహితుడు అయిన మర్రి రాజశేఖర్ పార్టీని వీడి వెళ్ళారు.

ఇపుడు ఆరవ ఎమ్మెల్సీ ఎవరా అని చర్చ అయితే జోరుగా సాగుతోంది. అయితే ఆ ఆరవ ఎమ్మెల్సీ ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాకు చెందిన వారే అవుతారని అంటున్నారు. ఆయన మూడు దశాబ్దాల రాజకీయ జీవితం కలిగిన సీనియర్ మోస్ట్ నేత తోట త్రిమూర్తులు అని ప్రచారం సాగుతోంది.

ఆయన 1994లో తొలిసారి రామచంద్రపురం నుంచి గెలిచారు. ఆ తరువాత అనేక సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయన టీడీపీ కాంగ్రెస్ ప్రజారాజ్యం వైసీపీ ఇలా పార్టీలు ఎన్నో మారారు. ఇక ఆయన వైసీపీలోకి వచ్చాక ఎమ్మెల్సీ పదవి దక్కింది.

ఇవన్నీ ఇలా ఉంటే ఇంతటి సీనియర్ నేత అయినా మంత్రి కావాలన్న కోరిక అయితే ఆయనకు తీరలేదు. ఇపుడు ఆయన తన కుమారుడిని రాజకీయ వారసుడిగా చూసుకోవాలని చూస్తున్నారు. మరో వైపు చూస్తే ఆయన జనసేనలోకి వెళ్తారని ప్రచారం పెద్ద ఎత్తున వ్యాపిస్తోంది.

ఆయన జిల్లాలో వైసీపీ తరఫున గట్టిగా మాట్లాడుతున్నా అమరావతికి వెళ్తే మాత్రం టోన్ మారుతోందని అంటున్నారు. ఇటీవల బడ్జెట్ సెషన్ సందర్భంగా ఆయన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో సన్నిహితంగా మెలగడంతో ఆయన రూట్ ఎటు వైపు అన్నది మరింతగా చర్చకు వస్తోంది.

పైగా సామాజిక వర్గాల పరంగా జనసేనకు గోదావరి జిల్లాలో ఆదరణ అధికంగా ఉన్న చోట ఆ పార్టీని కాదని వేరే పార్టీ నుంచి రాజకీయం చేయడం కష్టమే అన్నది ఒక సామాజిక వర్గం వారి ఆలోచనగా ఉంది అని అంటున్నారు. ఇక తోట త్రిమూర్తులు విషయం తీసుకుంటే ఆయన వైసీపీలో ఉండలేకపోతున్నారని అంటున్నారు.

చాలా కాలంగా ఆయన జనసేనలో చేరుతారని ప్రచారం అయితే పెద్ద ఎత్తున సాగుతూ వచ్చింది. అయితే వైసీపీ ఎమ్మెల్సీలు రాజీనామాలు చేసినా వాటిని చైర్మన్ ఆమోదించక పోవడంతోనే తోట వంటి వారు వెనక్కి తగ్గుతున్నారు తప్ప ఆలోచనలు వేరేగా ఉన్నాయనే అంటున్నారు.

ఇంకో వైపు నుంచి చూస్తే కనుక యనమల రామక్రిష్ణుడికి మరోసారి ఎమ్మెల్సీగా చాన్స్ ఇవ్వాలని తోట త్రిమూర్తులు శాసనమండలిలో తన వాయిస్ ని వినిపించడంతో అధికార ప్రతిపక్షాలు రెండూ ఉలిక్కిపడాల్సి వచ్చింది. యనమల టీడీపీ నేత. ఆయనకు మద్దతుగా ఎందుకు తోట తన గొంతుని వినిపించాల్సి వచ్చింది అన్నది మాత్రం అర్థం కావడం లేదని అంటున్నారు.

ఇవన్నీ పక్కన పెడితే తోట త్రిమూర్తుల పదవీ కాలం మరో రెండున్నరేళ్ళకు పైగా ఉంది అని అంటున్నారు. తనకు ఇదే హోదాతో కనుక పార్టీ మారినా అవకాశం ఇస్తే కనుక పార్తీ మారేందుకు ఆయన సిద్ధంగా ఉన్నారని అంటున్నారు. అలాగే తన రాజకీయ వారసుడికి టికెట్ మీద హామీ ఇచ్చినా ఆయన గాజు గ్లాస్ అందుకుంటారు అని అంటున్నారు. మొత్తానికి చూస్తే తోట త్రిమూర్తులు మూడు దశాబ్దాల తన రాజకీయ జీవితంలో నాలుగు పార్టీలు మారారు. అందువల్ల ఆయన పార్టీ మారినా అందులో ఆశ్చర్యం లేదన్న విశ్లేషణలు ఉన్నాయి. చూడాలి మరి ఈ ప్రచారంలో వాస్తవం ఎంత ఉందో.

Tags:    

Similar News