ప్రజలు మార్కులు వేస్తేనే ...యనమల సంచలన కామెంట్స్ !

టీడీపీ పుట్టిన నాటి నుంచి ఆ పార్టీలోనే ఉంటూ వచ్చిన సీనియర్ నేతలలో యనమల రామక్రిష్ణుడు ఒకరు.;

Update: 2025-03-23 12:51 GMT

టీడీపీ పుట్టిన నాటి నుంచి ఆ పార్టీలోనే ఉంటూ వచ్చిన సీనియర్ నేతలలో యనమల రామక్రిష్ణుడు ఒకరు. ఆయన ఈ రోజుకీ పొలిట్ బ్యూరో మెంబర్ గా ఉన్నారు. ఆయన లేని టీడీపీ కేబినెట్ 2024ది కావడం విశేషం. ఎన్నో సార్లు ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి పదవులు అనేకం చేపట్టిన యనమల రెండు టెర్ములు 12 ఏళ్ళ పాటు ఎమ్మెల్సీగా వ్యవహరించారు.

ఆయన తాజాగా రెండవ పర్యాయం ఎమ్మెల్సీగా తన పదవీ కాలం పూర్తి చేసుకున్నారు. ఈసారి ఆయనకు రెన్యూల్ చేస్తారని అనుకున్నా కుదరలేదు. దాంతో చివరి రోజు పదవీ విరమణ చేసిన ఎమ్మెల్సీల కోసం ఏర్పాటు చేసిన వీడ్కోలు మీటింగ్ కి కూడా ఆయన గైర్ హాజరు అయ్యారు. అంతే కాదు బడ్జెట్ సెషన్ చివరి రోజున నిర్వహించిన ఫోటో సెషన్ కి కూడా హాజరు కాలేదు.

దాంతో యనమల మళ్ళీ ఎమ్మెల్సీగా చాన్స్ దక్కలేదన్న దాని మీద ఆగ్రహంతో ఉన్నారని అందుకే సీఎం చంద్రబాబు తో ఫోటో సెషన్ కి సైతం రాలేదని ప్రచారం సాగింది ఈ నేపధ్యంలో ఒక యూట్యూబ్ చానల్ కి ఆయన ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులో ఆయన అనేక అంశాలను ప్రస్తావించారు.

మరీ ముఖ్యంగా తాను ఫోటో సెషన్ కి గైర్ హాజరు కావడం మీద మాట్లాడుతూ తనకు ఆరోగ్యం సరిగ్గా లేనందువల్లనే వెళ్ళలేదని అన్నారు. ఇందులో వేరే విషయం ఏమీ లేదని అన్నారు. ఇక తాను తన పదవీ కాలాన్ని సక్సెస్ ఫుల్ గా పూర్తి చేసుకున్నాను అని చెప్పారు. తనకు ఎంతో సంతృప్తి ఉందని అన్నారు.

తన వయసు ఏడు పదులు దాటిందని అన్నారు ఇంకా పరుగులు పెట్టమంటే ఈనాటి యువతతో సాటిగా పరుగులు పెట్టలేమని అన్నారు. యంగ్ స్టర్స్ రావాలని కోరుకునే వారిలో తాను ఒకరిని అన్నారు. టీడీపీ మరో నాలుగు దశాబ్దాల పాటు బలంగా కొనసాగాలీ అంటే కొత్త రక్తం రావాల్సిందే అన్నారు.

తనకు రాజకీయాల్లో తెలిసింది ఒక్కటే పార్టీ ఒక్కటే గుర్తు అని ఆయన అన్నారు. తాను టీడీపీని సైకిల్ ని తప్ప మరో వైపు చూసేది ఈ జనంలో లేదని అన్నారు. మరో వైపు చూస్తే తునిలో తన కుమార్తె దివ్య చక్కగా పనిచేస్తున్నారని తెలిపారు. ఆమె ఉన్నత విద్యావంతురాలు అని ఆమె నియోజకవర్గంలో అభివృద్ధి పట్ల నిబద్ధతతో పనిచేస్తున్నారని అన్నారు.

తన వరకూ చూస్తే పార్టీ కోసమే పనిచేస్తాను అని యనమల చెప్పారు. పనిచేసే ఓపిక అయితే ఉందని ఆయన అన్నారు. అందువల్ల పార్టీ పరంగా ఏ బాధ్యత ఇచ్చినా సిద్ధమని చెప్పారు. అంటే యనమల 2026లో ఖాళీ అయ్యే రాజ్యసభ సీట్ల మీద చూస్తున్నారని అంటున్నారు.

ఆ పదవి ఇస్తే ఆయన పెద్దల సభకు వెళ్ళాలని అనుకుంటున్నారని అంటున్నారు. మరి ఆ విధంగా పార్టీ యనమలను రాజ్యసభకు ఎంపిక చేస్తుందా అన్నది చూడాలి. మరో వైపు చూస్తే యనమల వైసీపీ అధినేత జగన్ తీరు మీద విమర్శలు గుప్పించారు. జగన్ కి ప్రతిపక్ష హోదా అన్నది రాదని అన్నారు.

కోరం ప్రకారం 18 మంది సభ్యులు ఉంటేనే లీడర్ ఆఫ్ అపొజిషన్ పదవి దక్కుతుందని అన్నారు. జగన్ కి కూడా ఆ విషయం తెలుసు అని అయినా ఆయన దానిని రాద్ధాంతంగా చేస్తున్నారని అన్నారు. తాను మళ్ళీ అధికారంలోకి వస్తే అధికారుల సంగతి చూస్తాను అని జగన్ అనడం పట్ల యనమల ఫైర్ అయ్యారు. బెదిరింపు రాజకీయాలు ప్రజాస్వామ్యంలో కుదిరేవి కావని అన్నారు.

అయినా మరో నాలుగేళ్ళకు పైగా కూటమి అధికారంలో ఉంటుందని అప్పటిదాకా వైసీపీని ఎలా నిలుపుకుంటారో కూడా జగన్ ఆలోచించుకోవాలని అన్నారు. ఎన్టీఆర్ నుంచి చంద్రబాబు లోకేష్ దాకా చూసిన యనమల ఆ ముగ్గురిలో ఎవరికి ఎన్ని మార్కులు వేయాలన్న దాని మీద మాట్లాడుతూ మార్కులు వేయాల్సింది తాను కాదని ప్రజలు అని చెప్పారు. ప్రజలు మార్కులు వేస్తేనే ఎవరైనా ఎంతటి స్థాయిలో అయినా ఉండగలరని అన్నారు. మొత్తానికి చూస్తే యనమల అసంతృప్తితో కొంత ఉన్నా కూడా టీడీపీలో తనకు అవకాశాలు ఏమైనా దక్కకపోతాయా అన్నది ఆలోచిస్తున్నారని అంటున్నారు.

Tags:    

Similar News