ఇక థియేటర్లో బిగ్ స్క్రీన్ పై 'ఐపీఎల్' పండుగ చేసుకోండి..

ముఖ్యంగా ఐపీఎల్ లో తమ జట్లు ఆడుతుంటే ఆ ఉత్సాహం చెప్పనలవి కాదు. ఇప్పడు ఇదే నిజం కాబోతోంది.;

Update: 2025-03-22 16:42 GMT

టీవీలో మ్యాచ్ చూడటం ఒక ఎత్తయితే, స్టేడియంలో ప్రత్యక్షంగా చూడటం మరో ఎత్తు. కానీ ఇప్పుడు ఏకంగా సినిమా థియేటర్‌లోనే క్రికెట్ మ్యాచ్ చూసే అవకాశం రావడంతో ప్రేక్షకుల ఆనందానికి అవధులు లేవు. థియేటర్ లోపలికి వెళ్ళగానే ప్రేక్షకులకు ఒక కొత్త అనుభూతి కలగడం ఖాయం. భారీ తెరపై ఆటగాళ్లు స్పష్టంగా కనిపిస్తారు. సౌండ్ సిస్టమ్ అయితే స్టేడియంలో ఉన్నట్టే అనిపించింది. కూర్చున్న ప్రతి ఒక్కరూ తమ తమ జట్లకు మద్దతు తెలుపుతూ కేరింతలు కొడుతారు. ముఖ్యంగా ఐపీఎల్ లో తమ జట్లు ఆడుతుంటే ఆ ఉత్సాహం చెప్పనలవి కాదు. ఇప్పడు ఇదే నిజం కాబోతోంది.

ప్రముఖ మల్టీప్లెక్స్ చైన్ పీవీఆర్‌ ఐనాక్స్‌ క్రికెట్ అభిమానులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)తో కీలక ఒప్పందం కుదుర్చుకున్నట్లు ప్రకటించింది. దీని ప్రకారం దేశంలోని 30కి పైగా నగరాల్లోని పీవీఆర్‌ ఐనాక్స్‌ సినిమా థియేటర్లలో ఇకపై ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) మ్యాచ్‌లను ప్రత్యక్షంగా చూడవచ్చు.

ఈ ప్రత్యేక ప్రసారాలు నేటి నుంచే (మార్చి 22) ప్రారంభం కానున్నాయి. ఐపీఎల్ ప్రారంభోత్సవ వేడుకతో ఈ సందడి మొదలు కానుంది. వారాంతాల్లో జరిగే మ్యాచ్‌లతో పాటు, ప్లేఆఫ్ మ్యాచ్‌లను కూడా థియేటర్లలో ప్రదర్శించనున్నారు.

పీవీఆర్‌ ఐనాక్స్‌ థియేటర్లలో అత్యాధునిక హైక్వాలిటీ విజువల్స్, సౌండ్ సిస్టమ్, అత్యుత్తమ సీటింగ్ ఏర్పాట్లు ఉండటంతో స్టేడియంలో మ్యాచ్ చూస్తున్న అనుభూతి కలుగుతుందని సంస్థ తెలిపింది. ఈ సందర్భంగా పీవీఆర్‌ ఐనాక్స్‌ రెవెన్యూ, ఆపరేషన్స్‌ సీఈఓ గౌతమ్‌ దత్తా మాట్లాడుతూ.. "సినిమాను, క్రీడను ఒకే వేదికపైకి తీసుకురావడం చాలా ఆనందంగా ఉంది. గత ఏడాది క్రికెట్ మ్యాచ్‌ల ప్రసారానికి ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన లభించింది. ఈ సంవత్సరం మరింత ప్రీమియం క్వాలిటీ అనుభవాన్ని అందించాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నాం" అని అన్నారు.

ఈ స్క్రీనింగ్‌లు దక్షిణ భారతదేశంతో పాటు ఉత్తరాదిలోని మహారాష్ట్ర, గుజరాత్, పశ్చిమ బెంగాల్, రాజస్థాన్ వంటి రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలతో పాటు టైర్-2, టైర్-3 నగరాల్లో కూడా అందుబాటులో ఉండనున్నాయి. అయితే, ఒక్కో నగరం షెడ్యూల్ వేర్వేరుగా ఉండవచ్చని పీవీఆర్‌ ఐనాక్స్‌ తెలిపింది.

మరిన్ని వివరాలు, షెడ్యూల్ కోసం పీవీఆర్‌ ఐనాక్స్‌ వెబ్‌సైట్‌ లేదా యాప్‌ను సంప్రదించాలని సంస్థ సూచించింది. దీంతో క్రికెట్ అభిమానులు ఇకపై తమ అభిమాన ఆటను థియేటర్లలో పెద్ద స్క్రీన్‌పై ఆస్వాదించవచ్చు.

Tags:    

Similar News