'పరుగు'సీన్ రిపీట్.. ఈ వీడియో వెనుక కథ
తండ్రికి కూతురు కావాలి.. కూతురికి ప్రేమించిన వాడు కావాలి.. ఇలా పారిపోతున్న కూతురిని ప్రాధేయపడ్డ ఓ తండ్రి వీడియో అందరినీ కదిలిస్తోంది.. కన్నీరు పెట్టిస్తోంది;

తండ్రికి కూతురు కావాలి.. కూతురికి ప్రేమించిన వాడు కావాలి.. ఇలా పారిపోతున్న కూతురిని ప్రాధేయపడ్డ ఓ తండ్రి వీడియో ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది... అచ్చం పరుగు సినిమాలో సీన్ ను గుర్తు చేస్తోంది. ఇప్పుడు ఈ సంఘటన సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.
17 ఏళ్ల క్రితం విడుదలై సంచలనం సృష్టించిన 'పరుగు' సినిమాలో తన ప్రేమించిన వాడితో వెళ్తున్న కూతురి వెంట తండ్రి పరిగెడుతూ బతిమాలుతాడు. తనను వదిలి వెళ్లొద్దని, గుండెకోత మిగిల్చొద్దని వేడుకుంటాడు. అప్పట్లో ఈ సినిమా ఎంతోమంది హృదయాలను తాకింది.
ఇప్పుడు ఈ సినిమా ప్రస్తావన ఎందుకంటే.. సరిగ్గా అలాంటి సంఘటనే తమిళనాడులో చోటు చేసుకుంది. తమిళనాడులో ఒక తండ్రి తన కూతురు ప్రేమించిన వాడితో వెళ్లిపోతుండగా.. ఆ ప్రేమను, వాత్సల్యాన్ని తట్టుకోలేక ఆమె వెంట పరిగెత్తాడు. అయితే ఆ కూతురు మాత్రం.. "నాకు అతనంటేనే ఇష్టం. అతనితో ఉండటమే నాకు సంతోషం. నా ఇష్టంతోనే వెళ్తున్నాను. మీరు ఎందుకు నా వెంట పడుతున్నారు? నా ఇష్టానికి వ్యతిరేకంగా ఎందుకు చేస్తున్నారు? నాకు చాలా ఇబ్బందిగా ఉంది" అని అనడంతో ఆ తండ్రి ఒక్కసారిగా షాక్‌కు గురయ్యాడు. కూతురి మాటలు విన్న ఆ తండ్రి గుండె బరువెక్కడంతో వెక్కివెక్కి ఏడ్చాడు. ఈ దృశ్యం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. కూతురి ప్రవర్తనపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
తమిళనాడులో జరిగిన ఈ ఘటన వీడియో ఆరాతీస్తే.. ఇది అసలైనది కాదని.. కేవలం ఒక షార్ట్ ఫిలిం లోని సీన్ అని తెలిసింది. అచ్చం 'పరుగు' సినిమాను గుర్తు చేసేలా ఉండడంతో వైరల్ గా మారింది... అయితే ఇది నిజమైన వీడియో అని కొందరు నెటిజన్లు మండిపడుతూ వీడియోను వైరల్ చేస్తున్నారు. "తండ్రి అంతగా బతిమిలాడుతున్నా ఆ కూతురి మనసు కరగలేదు. మొన్నటిదాకా తెలియని వ్యక్తితో వెళ్లిపోవడానికి సిద్ధమైంది. కన్న తండ్రిని కాదనుకుంటుంది. ఇలాంటి కూతురు ఉన్నందుకు సిగ్గుగా ఉంది. తన కూతురు వద్దంటున్నా ఆ తండ్రి ఎంత బాధపడుతున్నాడో చూస్తుంటే గుండె తరుక్కుపోతోంది" అని నెటిజన్లు వీడియోను షేర్ చేస్తూ దుమ్మెత్తిపోస్తున్నారు.. అయితే ఇది షార్ట్ ఫిలిం అని తాజాగా బయటపడింది. ఇది ఒరిజినల్ వీడియో కాదని.. అంతగా రియాక్ట్ కావాల్సిన అవసరం లేదని పలువురు చెబుతున్నారు.