ముహూర్తం ఫిక్స్ : జనంలోకి జనసేనాని !
తాజాగా కర్నూలు పర్యటనలో పవన్ కళ్యాణ్ తన జిల్లా టూర్ల మీద కీలక సమాచారం అందించారు.;
జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జనంలోకి రానున్నారు. ఆయన చాలా కాలంగా తాను ప్రజలతో ఉంటాను వారి ద్వారానే సమస్యలను తెలుసుకుని పరిష్కరిస్తామని చెబుతూ వచ్చారు. తాజాగా కర్నూలు పర్యటనలో పవన్ కళ్యాణ్ తన జిల్లా టూర్ల మీద కీలక సమాచారం అందించారు.
త్వరలోనే తాను ప్రతీ జిల్లాలోనూ పర్యటిస్తానని చెప్పారు. అంతే కాదు ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గంలో మూడు రోజులు పాటు ఉండి అక్కడ సమస్యలను పరిష్కరిస్తామని చెప్పారు. ప్రభుత్వం తరఫున సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇస్తున్నామని కూడా చెప్పారు.
దాంతో పవన్ జిల్లా పర్యటనలు ఉంటాయని అంటున్నారు. ప్రస్తుతం వేసవి కాలం కొనసాగుతున్నందువల్ల ఆయన పర్యటనలు ఎప్పటి నుంచి ప్రారంభిస్తారు అన్నది తెలియడం లేదు. అదే సమయంలో తొందరలోనే ఈ పర్యటనలు ఉంటాయని అంటున్నారు.
ఇక జనంలో ఉంటే సమస్యలు తెలుసుకోవచ్చునని పవన్ భావిస్తున్నారు. అంతే కాకుండా ప్రభుత్వంలో ఉండడం వల్ల వీలైనన్ని సమస్యలను పరిష్కరించవచ్చు అని ఆలోచిస్తున్నారు. అంతే కాదు గ్రౌండ్ లెవెల్ లో ప్రభుత్వం పట్ల ప్రజల ఆలోచనలు ఎలా ఉన్నాయో కూడా దగ్గరుండి తెలుసుకోవచ్చు అని కూడా భావిస్తున్నారు. వాటిని బట్టి ప్రభుత్వ కార్యక్రమాలు విధానాలు కూడా వీలైతే మధింపు చేసుకోవచ్చు అని అంటున్నారు.
మరో వైపు చూస్తే వైసీపీకి ఏ మాత్రం చాన్స్ ఇవ్వరాదని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గట్టిగా భావిస్తున్నారు. ప్రజలలో ఏ మాత్రం వ్యతిరేకత పెరిగినా సొమ్ము చేసుకునే ఆస్కారం విపక్షంగా వైసీపీకి ఉందని అందువల్ల ఆ విధమైన పరిస్థితి లేకుండా తామే రంగంలోకి దిగాలని భావిస్తున్నారు అని అంటున్నారు.
ఇక పవన్ రాయలసీమ మీద ఫోకస్ ని కూడా కొనసాగిస్తున్నారు. ఆయన ఏ కార్యక్రమం చేపట్టినా రాయలసీమ జిల్లాలనే ఎంచుకుంటున్నారు. జనసేనకు విస్తరించేందుకు అవకాశం ఉన్న రాజకీయ క్షేత్రంగా రాయలసీమను ఆయన భావిస్తున్నారు. తాజాగా ప్రపంచ జల దినోత్సవం వేళ రాయలసీమకు వచ్చి అభివృద్ధి కార్యక్రమాలను ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా రాయలసీమను రతనాల సీమను చేస్తామని కూడా పవన్ హామీ ఇచ్చారు. రాయలసీమ అభివృద్ధికి తమ ప్రభుత్వం చేస్తున్న కృషిని వివరించారు. రోడ్లు ఇతర మౌలిక సదుపాయాలను తాము పెద్ద ఎత్తున పది నెలల కాలంలో చేపడుతున్నామని చెప్పారు. రాయలసీమకు పూర్వవైభవం తీసుకుని వస్తామని అన్నారు. గత ప్రభుత్వం గ్రామాల అభివృద్ధిని విస్మరించింది అని ఆయన విమర్శించడం వెనక కూడా వైసీపీ నిర్వాకాల గురించి సీమ వాసులకు వివరించడమే అని అంటున్నారు. మొత్తానికి జనంలోకి జనసేన అధినేత వస్తే కనుక ఆ ప్రభావం ఎలా ఉంటుందో చూడాల్సి ఉంది.