మూర్తిగారికి సుధమ్మ మద్దతు.. 70 గంటల పనిపై కీలక వ్యాఖ్యలు!
రోజుకు 8 గంటల చొప్పు.. వారానికి 6 రోజులు పనిచేసే విధానాన్ని భారత ప్రభుత్వం సహా.. రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్నాయి.;
ప్రపంచ ప్రఖ్యాత ఐటీ సంస్థ ఇన్ఫోసిస్ అధినేత నారాయణ మూర్తి.. రెండు మాసాల కిందట ఉద్యోగుల పనితీరు... వారు చేస్తున్న పని గంటలపై కీలక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. దేశం అభివృద్ధిలో ముందుకు సాగాలంటే.. ఉద్యోగులు.. వారానికి 70 గంటలు పనిచేయడం తప్పదని వ్యాఖ్యానించారు. అయితే.. సదరు వ్యాఖ్యలపై మిశ్రమ స్పందన వచ్చింది. ప్రస్తుతం వారానికి 48 గంటల పనివిధానం భారత్‌లో అమల్లో ఉంది. రోజుకు 8 గంటల చొప్పు.. వారానికి 6 రోజులు పనిచేసే విధానాన్ని భారత ప్రభుత్వం సహా.. రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్నాయి.
వీటినే ఐటీ సంస్థలు అటు ఇటుగా అమలు చేస్తున్నాయి. అయితే.. ఇది చాలదని.. మరింత కావాలని నారాయణ మూర్తి.. అప్ప ట్లో చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపాయి. తాజాగా ఈ వ్యాఖ్యలపై ఆయన సతీమణి, రాజ్యసభ సభ్యురాలు, ఇన్పోసిస్ ఫౌండేషన్ చైర్మన్ సుధా మూర్తి స్పందించారు. ``అంకిత భావంతో పనిచేస్తే.. అసలు పని గంటలతో సంబంధమే ఉండదన్నారు. మనసు పెట్టి పనిలోకి దిగితే.. అది 70 గంటలా.. 90 గంటలా అని చూసుకునే ప్రయత్నం కూడా చేయరు`` అని నారాయణ మూర్తికి పరోక్షంగా ఆమె మద్దతు పలికారు. అంతేకాదు.. ప్రస్తుతం వైద్యులు, పోలీసులు, జర్నలిస్టులు.. వారానికి 90 గంటలకు పైగానే పనిచేస్తున్నారని కూడా చెప్పుకొచ్చారు.
ఏ ఉద్యోగి అయినా.. ఇష్టంతో పనిచేస్తే.. ఆ పనికి పనిగంటలతో సంబంధమే ఉండదని సుధామూర్తి తేల్చి చెప్పారు. ఈ సందర్భం గా ఇన్ఫోసిస్ స్థాపించిన సమయంలో ఎదురైన అనుభవాన్ని ఆమె పంచుకున్నారు. తొలినాళ్లలో నారాయణమూర్తి కొందరు ఉద్యోగులతో మాత్రమే ఈ సంస్థను ఏర్పాటు చేశారని తెలిపారు. అయితే.. ఆ సమయంలో ఇష్టంతో పనిచేయడంతో 70 గంటలకు పైగానే వారు కష్టించారని.. తద్వారా సంస్థ పురోభివృద్దిలోకి వచ్చిందని చెప్పారు. దేవుడు అందరికీ సమానంగా రోజుకు 24 గంటల సమయం ఇచ్చారన్న సుధామూర్తి.. దీనిని ఎవరు ఎలా వినియోగించుకుంటారన్నది వారి వారి ఇష్టాల ప్రకారం ఉంటుందని ముక్తాయించారు.
ప్రస్తుతం తాను రాజ్యసభ సభ్యురాలిగా, ఇన్ఫోసిస్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలిగా.. గృహిణిగా ఎక్కువ సమయం పనిచేస్తున్నట్టు సుధామూర్తి వెల్లడించారు. ఇది ఒకరకంగా నారాయణ మూర్తికంటే ఎక్కువ సమయం వెచ్చిస్తున్నట్టేనని చెప్పారు. గతంలోనూ తాను ఇంటి పనిని చూసుకుంటూనే పిల్లలను పెంచుకుంటూనే.. మరోవైపు కంప్యూటర్ అధ్యాపకురాలిగా కాలేజీలో పనిచేసినట్టు వివరించారు. పనిచేయాలన్న ఇష్టం ఉంటే.. పనిగంటలు ప్రతిబంధకం కాదని ఆమె వివరించారు.