కాలిఫోర్నియాలో కుమారుడి గొంతు కోసి హత్య చేసిన తెలుగు మహిళ
అమెరికాలో దారుణం చోటుచేసుకుంది. కాలిఫోర్నియా రాష్ట్రంలో ఒక విషాదకరమైన సంఘటన చోటుచేసుకుంది.;
అమెరికాలో దారుణం చోటుచేసుకుంది. కాలిఫోర్నియా రాష్ట్రంలో ఒక విషాదకరమైన సంఘటన చోటుచేసుకుంది. శాంటా అనా నగరంలో భారతీయ సంతతికి చెందిన 48 ఏళ్ల సరితా రామరాజు అనే మహిళ తన 11 ఏళ్ల కుమారుడిని గొంతు కోసి చంపింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆరెంజ్ కౌంటీ డిస్ట్రిక్ట్ అటార్నీ కార్యాలయం తెలిపిన వివరాల ప్రకారం.., ఒకవేళ సరితా రామరాజు దోషిగా తేలితే ఆమెకు 26 సంవత్సరాల వరకూ జీవిత ఖైదు వరకు శిక్ష పడే అవకాశం ఉంది.
పోలీసులు వెల్లడించిన ప్రకారం..., సరితా రామరాజు 2018లో తన భర్తతో విడాకులు తీసుకున్న తర్వాత తన కుమారుడితో కలిసి శాంటా అనాలోని ఒక మోటెల్‌లో నివసిస్తోంది. ఆమె తన కుమారుడి కోసం డిస్నీల్యాండ్‌కు మూడు రోజుల టిక్కెట్లు కొనుగోలు చేసింది. మార్చి 19న ఆమె తన కుమారుడిని అతని తండ్రికి అప్పగించవలసి ఉండగా, ఉదయం 9:12 గంటలకు ఆమె 911కు ఫోన్ చేసి తన కుమారుడిని చంపి, తాను ఆత్మహత్య చేసుకోవడానికి మాత్రలు వేసుకున్నట్లు చెప్పింది.
వెంటనే స్పందించిన పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. సరితా రామరాజు తన కుమారుడిని చంపి, మాత్రలు మింగి ఆత్మహత్యకు ప్రయత్నించినట్లు అంగీకరించింది. పోలీసులు గదిలో బాలుడి మృతదేహాన్ని గుర్తించారు. మరణించిన బాలుడిని యతిన్ రామరాజుగా గుర్తించారు. పోలీసులు సరితా రామరాజును అరెస్టు చేశారు.
గత సంవత్సరం నుంచి సరితా రామరాజు , ఆమె మాజీ భర్త రామరాజుల మధ్య కుమారుడి సంరక్షణ విషయంలో వివాదం కొనసాగుతోందని నివేదికలు సూచిస్తున్నాయి. సరితా రామరాజు తన మాజీ భర్త తన కుమారుడి వైద్య చికిత్స , పాఠశాల విద్యకు సంబంధించిన నిర్ణయాలను ఏకపక్షంగా తీసుకుంటున్నాడని, అలాగే అతను డ్రగ్స్‌కు బానిసయ్యాడని ఆరోపించింది.
కోర్టు పత్రాల ప్రకారం.. రామరాజు బెంగళూరులో జన్మించాడు. ఈ ఘటనపై ఆరెంజ్ కౌంటీ జిల్లా అటార్నీ టాడ్ స్పిట్జర్ స్పందిస్తూ, తల్లిదండ్రుల మధ్య ఉన్న కోపం కారణంగా పిల్లల జీవితాలను ప్రమాదంలో పడేయకూడదని అన్నారు.