కమ్యూనిస్టులపై విలన్ అజయ్ ఘోష్ గోస!
పుష్ప 1 సినిమాలో తన విలనిజంతో మనల్ని ఆకట్టుకున్న ప్రముఖ సినీ నటుడు అజయ్ ఘోష్ సంచలన వ్యాఖ్యలు చేశారు.;
పుష్ప 1 సినిమాలో తన విలనిజంతో మనల్ని ఆకట్టుకున్న ప్రముఖ సినీ నటుడు అజయ్ ఘోష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పుష్ప సినిమాతో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఆయన సాధారణంగా రాజకీయాలకు దూరంగా ఉంటారు. అయితే తాజాగా ఆయన కమ్యూనిస్టు పార్టీల గురించి మాట్లాడటం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. హైదరాబాద్‌లోని బాగ్ లింగంపల్లిలో ఉన్న సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన భగత్ సింగ్ యువజన ఉత్సవాల ముగింపు వేడుకకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా అజయ్ ఘోష్ మాట్లాడుతూ ప్రపంచంలో కమ్యూనిస్టు పార్టీల అవసరం ఎంతైనా ఉందని అన్నారు. ఇప్పటికే అనేక దేశాల్లో కమ్యూనిస్టు పార్టీలు అధికారంలోకి వస్తున్నాయని, కానీ భారతదేశంలో మాత్రం ఆ పరిస్థితి లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి అనేక కారణాలు ఉండొచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.
అంతేకాకుండా దేశంలోని కమ్యూనిస్టు పార్టీలన్నీ ఏకం కావాల్సిన సమయం ఆసన్నమైందని అజయ్ ఘోష్ గట్టిగా నొక్కి చెప్పారు. కమ్యూనిస్టు నేతలు తమ వ్యక్తిగత విభేదాలను పక్కన పెట్టి, ప్రజల కోసం ఒకే తాటిపైకి రావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ దేశాన్ని కాపాడే శక్తి కేవలం కమ్యూనిస్టు పార్టీలకే ఉందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.
అజయ్ ఘోష్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సాధారణంగా రాజకీయాల గురించి మాట్లాడని ఆయన, తొలిసారిగా కమ్యూనిస్టు పార్టీల గురించి మాట్లాడటం పలువురిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఇతర రాజకీయ పార్టీల గురించి ఎలాంటి వ్యాఖ్యలు చేయకుండా కేవలం కమ్యూనిస్టు పార్టీల గురించే ఆయన మాట్లాడటం ఆసక్తికరంగా మారింది. ఆయన వ్యాఖ్యలపై వివిధ వర్గాల నుంచి భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.