కర్ణాటక స్కూళ్లలో 'సెక్స్ ఎడ్యుకేషన్'
దీనిపై ఒకవైపు చర్చ జరుగుతున్న సమయంలో అనూహ్యంగా సీఎం సిద్దరామయ్య సర్కారు లైంగిక విద్యపై కీలక ప్రకటన చేయడం గమనార్హం.;
కర్ణాటకలోని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రాథమికోన్నత పాఠశాలలు, ఉన్నత స్థాయి విద్యాసంస్థల్లో సెక్స్ ఎడ్యుకేషన్(లైంగిక విద్య)ను ప్రవేశ పెట్టాలని నిర్ణయించింది. ఈ మేరకు విద్యా శాఖ మంత్రి మధు బంగారప్ప కీలక ప్రకటన చేశారు. నిజానికి ప్రస్తుతం ఎమ్మెల్యేలు, మంత్రులు కొందరు.. ప్రస్తుతం వలపు వల(హానీ ట్రాప్)లో చిక్కుకున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. దీనిపై పెద్ద ఎత్తున అసెంబ్లీలో శుక్రవారం రగడ చోటు చేసుకుంది. దీనిపై ఒకవైపు చర్చ జరుగుతున్న సమయంలో అనూహ్యంగా సీఎం సిద్దరామయ్య సర్కారు లైంగిక విద్యపై కీలక ప్రకటన చేయడం గమనార్హం.
మంత్రి ఏం చెప్పారు?
మంత్రి మధు బంగారప్ప స్పందిస్తూ.. విద్యార్థులకు ఒక వయసు వచ్చిన తర్వాత.. వారి శరీర భాగాల గురించి.. లైంగికంగా వస్తున్న మార్పుల గురించి తెలుసుకోవాలన్న ఆసక్తి ఉంటుందని పేర్కొన్నారు. అయితే.. దీనిని విద్యలో భాగం చేయడం ద్వారా.. వారికి శాస్త్రీయ విధానంలోనే నిపుణులతో సెక్స్ ఎడ్యుకేషన్ అందిస్తే.. వారికి, సమాజానికి కూడా మేలు చేస్తుందని చెప్పారు. ఈ నేపథ్యంలో 8 వ తరగతి నుంచి ఇంటర్ మీడియెట్ చదువుతున్న విద్యార్థులకు వారానికి రెండుసార్లు లైంగిక విద్యపై వైద్య నిపుణులతో క్లాసులు చెప్పించనున్నట్టు వివరించారు. తద్వారా.. విద్యార్థులకు శారీర భద్రత, అవగాహన రెండూ తెలుస్తాయని చెప్పారు.
ఎందుకు?
వాస్తవానికి గతంలోనూ అనేక రాష్ట్రాల్లో ఈ ప్రయత్నాలు జరిగాయి. సామాజిక ఉద్యమకారులు సైతం సెక్స్ ఎడ్యుకేషన్‌ను ప్రోత్సహించాలని సూచించారు. దీనికి కారణం.. విద్యార్థినులపై జరుగుతున్న అకృత్యాలు.. అమానుషాలే. విద్యార్థినులను శారీరక మార్పులపై అవగాహన కల్పించడంతోపాటు.. వారికి భద్రతను సమాజ పోకడను కూడా వివరిస్తారు. తద్వారా వారిని వారు రక్షించుకునే విదంగా అవగాహన ఏర్పడుతుందన్నది ప్రధాన ఉద్దేశం. ఈ నేపథ్యంలో సిద్దరామయ్య సర్కారు కూడా.. ఈ తరహా విద్యకు దారి తీసింది. అయితే.. దీనిని బీజేపీ నాయకులు వ్యతిరేకిస్తున్నారు. విద్యను కలుషితం చేస్తున్నారని.. బీజేపీ మాజీ సీఎం ఒకరు వ్యాఖ్యానించారు.