రూపాయి గుంజి.. పైసలు ఇస్తున్నారు: కేంద్రంపై రేవంత్ ఫైర్
రాష్ట్రాల నుంచి వసూలు చేస్తున్న కేంద్ర పన్నుల వాటాలో చాలా వ్యత్యాసం ఉంటోందని తెలిపారు.;
కేంద్రంలోని మోడీ సర్కారుపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రాల నుంచి వసూలు చేస్తున్న కేంద్ర పన్నుల వాటాలో చాలా వ్యత్యాసం ఉంటోందని తెలిపారు. అత్యంత ఘోరంగా ఈ పరిణామం ఉన్నా.. కేంద్రాన్ని కదిలించలేక పోతున్నామనే భావన ఉందని చెప్పారు. ``రాష్ట్రాల నుంచి వసూలు చేస్తున్న పన్నుల్లో న్యాయ బద్ధమైన వాటా అడిగితే.. కేసులు పెడుతున్నారు. ఇదేం సంస్కృతి`` అని నిలదీశారు.
తాజాగా తమిళనాడు రాజధాని చెన్నైలో సీఎం స్టాలిన్ నేతృత్వంలో నిర్వహించిన అఖిల పక్ష సమావేశా నికి రేవంత్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జీఎస్టీలో రాష్ట్రాల వాటాపై మోడీ సర్కారు అనుసరిస్తున్న వైఖరిపై నిప్పులు చెరిగారు. ఆయా రాష్ట్రాలకు జరుగుతున్న అన్యాయాన్ని గణాంకాలతో సహా ఆయన వివరించారు. ``తెలంగాణ నుంచి రూపాయి పన్ను వసూలు చేస్తే.. 42 పైసలు వెనక్కి ఇస్తోంది. ఇదేం పద్ధతి?`` అని వ్యాఖ్యానించారు.
అంతేకాదు.. ఈ సందర్భంగా ఆయన పలు రాష్ట్రాలకు అందుతున్న పన్నుల వాటాను కూడా ఉదహరిం చారు. ``తమిళనాడు ప్రజలు రూపాయి చొప్పున పన్ను కేంద్రానికి చెల్లిస్తే కేవలం 26 పైసలు వెనక్కి వస్తున్నాయి. కర్ణాటక ప్రజలు రూపాయి ఇస్తే.. 16 పైసలు విదిలిస్తున్నారు. కేరళ ప్రజలకు కేంద్రం 49 పైసలు వెనక్కి ఇస్తోంది. కానీ, తమకు అనుకూలంగా ఉన్న రాష్ట్రాలకు మాత్రం కేంద్రం దోచిపెడుతోంది`` అని రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ క్రమంలో బిహార్ రూపాయి పన్ను కడితే.. ఏకగా 6 రూపాయల 6 పైసలు కేంద్రం వెనక్కి ఇస్తున్నట్టు రేవంత్‌రెడ్డి చెప్పారు. అదేవిధంగా ఉత్తరప్రదేశ్ రూపాయి పన్ను ఇస్తే.. రెండు రూపాయలు, మధ్యప్రదేశ్ రూపాయికి రూపాయి 73 పైసల చొప్పున వెనక్కి పొందుతున్నాయని రేవంత్ వివరించారు. ఈ వివక్షపైనా దక్షిణాది రాష్ట్రాలు ఏకం కావాల్సిన అవసరం ఉందన్నారు. ఇక, వచ్చే ఏడాది చేపట్టనున్న పార్లమెంటు నియోజకవర్గాల పునర్విభజనతో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతోందని.. కాబట్టి.. దీనిపై సమగ్ర ప్రణాళికతో కేంద్రంపై కొట్లాడాల్సిన అవసరం ఉందని రేవంత్ రెడ్డి తేల్చి చెప్పారు.