ఫెడరల్ వ్యవస్థకు పెను ముప్పు.. స్టాలిన్ మీటింగ్ లో మోడీపై నిప్పులు

ఈ సమావేశం కేంద్రం 2026లో అమలు చేయబోతున్న డిలిమిటేషన్ విధానాల మీద తీవ్రస్థాయిలో మండిపడింది.;

Update: 2025-03-22 09:18 GMT

కేంద్ర ప్రభుత్వం జనాభా ప్రాతిపదికన డిలిమిటేషన్ విధానం అమలు చేయాలనుకోవడం ఫెడరల్ వ్యవస్థకే ముప్పుగా పరిణమించబోతోంది అని చెన్నైలో జరిగిన దక్షిణాది రాష్ట్రాల అఖిలపక్ష సమావేశం ఆందోళన వ్యక్తం చేసింది. తక్షణం డిలిమిటేషన్ ప్రతిపాదనలను విరమించుకోవాలని డిమాండ్ చేసింది. తమిళనాడు సీఎం డీఎంకే అధినేత స్టాలిన్ అధ్యక్షతన శనివారం జరిగిన ఈ సమావేశానికి తెలంగాణా కేరళ, పంజాబ్ సీఎంలు రేవంత్ రెడ్డి, విజయ్, భగవంత్ మాన్ తో పాటు కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్, తెలంగాణా నుంచి బీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సహా కీలక నేతలు హాజరయ్యారు.

ఈ సమావేశం కేంద్రం 2026లో అమలు చేయబోతున్న డిలిమిటేషన్ విధానాల మీద తీవ్రస్థాయిలో మండిపడింది. జనాభా ప్రాతిపదికన డిలిమిటేషన్ చేయాలనుకోవడం వల్ల దక్షిణాది రాష్ట్రాలు తీవ్రంగా నష్టపోతాయని కూడా పేర్కొంది. మొదటి నుంచి కేంద్రం దక్షిణాది రాష్ట్రాల మీద వివక్ష చూపిస్తూనే ఉందని స్టాలిన్ ఫైర్ అయ్యారు. దక్షిణాది రాష్ట్రాలను బీజేపీ అణచివేస్తోందని ఆయన అన్నారు. భారత దేశం అన్ని వర్గాలు కలసి చేసిన పోరాట ఫలితంగా ఈ రోజు ఉందని గుర్తు చేశారు. భారత దేశ సమాఖ్య వ్యవస్థను కాపాడుకోవాల్సిన తరుణం ఆసన్నమైందని ఆయన అన్నారు.

బీజేపీ నాయకత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం తలపెట్టిన డిలిమిటేషన్ ప్రక్రియ అమలు అయితే సొంత దేశంలోనే కొన్ని రాష్ట్రాలను శక్తి హీనులుగా చేస్తుందని స్టాలిన్ అన్నారు. అదొక్కటే కాదని సంస్క్ర్తి, ప్రగతి, సామాజిక న్యాయంతో పాటు గుర్తింపు వంటివి ప్రమాదంలో పడతాయని అన్నారు.

ఎన్ని సీట్లు ఏమిటి అన్నది నంబర్ గురించి కాదని అధికారంలో దక్షిణాది వాటాకు సంబంధించిన విషయం ఇదని స్టాలిన్ స్పష్టం చేశారు. రాష్ట్రాల పాలన గురించి వారి సొంత నిర్ణయాల గురించి వేరొకరు నిర్ణయాలు తీసుకునే పరిస్థితి ఇపుడు ఉందని ఆయన అన్నారు.

ఇదే విధానం అమలు అయితే రాష్ట్రాలు తమ ఉనికిని పోగొట్టుకుంటాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం జనాభా ప్రాతిపదికన డిలిమిటేషన్ అమలు చేయడం అన్నది మంచిది కాదు ఆమోదయోగ్యం అంతకంటే కాదని ఆయన అన్నారు. డీలిమిటేషన్ మీద ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అన్న దాని మీద రాజకీయ న్యాయ నిపుణులతో ఒక కమిటీని వేయాలని ఆయన డిమాండ్ చేశారు. దీనినే అఖిలపక్ష సమావేశంలో తీర్మానంగా పెడుతూ ప్రతిపాదించారు.

దక్షిణాది రాష్ట్రాలకు మొత్తం ఎంపీ సీట్లలో 33 శాతం వాటా ఉండాలని తెలంగాణా సీఎం రేవంత్ రెడ్డి గట్టిగా కోరారు. ఈ విధానం కనుక అమలు చేస్తే దక్షిణాది రాష్ట్రాలు ఎప్పటికీ దేశంలో ద్వితీయ శ్రేణి పౌరులు అవుతామని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

రాష్ట్రాలు బలంగా ఉండాలి, కేంద్రం బలంగా ఉండాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. కేంద్రం పెద్దన్నలా ఉండాలి తప్ప బిగ్ బాస్ గా కాదని కేటీఆర్ అన్నారు. వందేళ్ళలో దేశం సూపర్ పవర్ గా ఉండాలీ అంటే దక్షిణాది రాష్ట్రాల మీద ఈ వివక్ష మంచిది కాదని కేటీఆర్ అన్నారు. సహకార విధానంలో ఫెడరల్ వ్యవస్థ ఉంటేనే దేశం బాగుంటుంది అని అన్నారు.

డీలిమిటేషన్ తో ఎన్నో నష్ట్రాలు ఉన్నాయని అన్నారు. ఈ విధానం మారాలని అన్నారు. యూనియన్ ఆఫ్ స్టేట్స్ భారత్ అని గుర్తు చేశారు. కేంద్రం ఇప్పటికే దక్షిణాది రాష్ట్రాల పట్ల వివక్ష చూపిస్తోందని దాని వల్ల తీరని అన్యాయం జరుగుతోందని అన్నారు. జనాభా ప్రాతిపదికన డిలిమిటేషన్ మంచిది కాదని ఆయన అన్నారు.

ఇదిలా ఉండగా జనాభా నియంత్రణ పక్కాగా అమలు చేసినందుకు ఇదేనా మాకు బహుమతి అని ఈ సమావేశంలో పలువురు నేతలు కేంద్రం మీద ఆగ్రహం వ్యక్తం చేశారు. మొత్తం మీద స్టాలిన్ నిర్వహించిన ఈ సమావేశం సక్సెస్ అయింది అని అంటున్నారు. ఈ సమావేశంలో తెలంగాణా కాంగ్రెస్ చీఫ్ మహేష్ గౌడ్, బీఆర్ఎస్ తరఫున మాజీ ఎంపీ వినోద్ సహా పలువురు పాల్గొన్నారు.

Tags:    

Similar News