వలసదారులపై ట్రంప్ మరో భారీ దెబ్బ

తాను పట్టిన కుందేలుకు మూడేకాళ్లు అని మొండిగా ముందుకెళుతున్నాడు ట్రంప్.. అసలు ఎన్నికల్లో చెప్పినట్టే వలసదారులను వేటాడుతున్నాడు;

Update: 2025-03-22 08:08 GMT

తాను పట్టిన కుందేలుకు మూడేకాళ్లు అని మొండిగా ముందుకెళుతున్నాడు ట్రంప్.. అసలు ఎన్నికల్లో చెప్పినట్టే వలసదారులను వేటాడుతున్నాడు. రోజుకొక నిర్ణయంతో వారికి కంటి మీద కునుకులేకుండా చేస్తున్నారు. ట్రంప్ ఏ రోజు ఏ బాంబ్ పేలుస్తాడో తెలియక పాపం వలసదారులు భిక్కుభిక్కుగా అమెరికాలో ఉంటున్నారు. ఇప్పుడు ఏకంగా 5 లక్షల మంది వలసదారులపై ట్రంప్ భారీ దెబ్బ కొట్టారు.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వలస విధానాలపై కఠినంగా ముందుకెళుతున్నాడు. అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపిన ట్రంప్ సర్కార్, తాజాగా తాత్కాలిక వలసదారులపై కూడా కన్నెర్ర చేసింది. ఏకంగా 5 లక్షల మందికి పైగా వలసదారుల తాత్కాలిక నివాస హోదాను రద్దు చేస్తూ హోమ్‌లాండ్ సెక్యూరిటీ శాఖ సంచలన ప్రకటన చేసింది.

ఈ నిర్ణయం క్యూబా, హైతీ, నికరాగ్వా, వెనెజువెలా దేశాలకు చెందిన లక్షలాది మంది వలసదారులపై తీవ్ర ప్రభావం చూపనుంది. హోమ్‌లాండ్ సెక్యూరిటీ విభాగం తెలిపిన వివరాల ప్రకారం.. 2022 అక్టోబరు తర్వాత ఈ నాలుగు దేశాల నుంచి అమెరికాకు వచ్చిన దాదాపు 5,32,000 మందికి ఈ ఉత్తర్వులు వర్తిస్తాయి. నెల రోజుల్లో వారిని దేశం నుంచి బహిష్కరించే అవకాశం ఉంది.

మానవతా పెరోల్ కార్యక్రమం కింద అమెరికాకు చేరుకున్న వారందరూ ఈ కొత్త విధానం కారణంగా తమ చట్టపరమైన హోదాను కోల్పోనున్నారు. వీరంతా ఇతరుల ఆర్థిక సహకారంతో అమెరికాకు వచ్చి, రెండేళ్ల పాటు నివసించడానికి , పని చేయడానికి తాత్కాలిక అనుమతులు పొందారని హోమ్‌లాండ్ సెక్యూరిటీ సెక్రటరీ క్రిస్టీ నోయెమ్ తెలిపారు. అయితే ఏప్రిల్ 24న లేదా ఫెడరల్ రిజిస్టర్‌లో నోటీసులు ప్రచురించిన 30 రోజుల తర్వాత వీరు తమ లీగల్ స్టేటస్‌ను కోల్పోతారని ఆమె స్పష్టం చేశారు.

మానవతా పెరోల్‌ను విస్తృతంగా దుర్వినియోగం చేస్తున్నారనే కారణంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ట్రంప్ ఇదివరకే ప్రకటించారు. యుద్ధం లేదా రాజకీయ అస్థిరత ఉన్న దేశాల ప్రజలు అమెరికాకు వచ్చి తాత్కాలికంగా నివసించడానికి వీలుగా ఈ మానవతా పెరోల్ విధానం చాలా కాలంగా ఉంది. అయితే ట్రంప్ ఈ విధానాన్ని పూర్తిగా రద్దు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. గత అధ్యక్ష ఎన్నికల ప్రచారంలోనూ ఆయన ఈ అంశాన్ని పలుమార్లు ప్రస్తావించారు. అక్రమ వలసదారులతో పాటు, కొందరు వలసదారులకు ఉన్న చట్టబద్ధమైన మార్గాలను కూడా మూసివేస్తామని ఆయన అప్పట్లో పేర్కొన్నారు.

గతంలో ఉన్న నిబంధనల ప్రకారం, మానవతా పెరోల్ కింద అమెరికాకు వచ్చిన వారు రెండేళ్ల పాటు చట్టబద్ధంగా ఉపాధి పొందవచ్చు. ఆ గడువు ముగిసిన తర్వాత, వారు శరణార్థిగా లేదా వీసా కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం ఉండేది. అయితే ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ దరఖాస్తుల ప్రక్రియ నిలిచిపోయింది. ఈ నిర్ణయాన్ని సవాలు చేస్తూ అనేక పిటిషన్లు ఫెడరల్ కోర్టుల్లో దాఖలయ్యాయి.

తాజాగా తీసుకున్న ఈ నిర్ణయం లక్షలాది మంది వలసదారుల భవిష్యత్తును ప్రశ్నార్థకం చేసింది. మానవతా దృక్పథంతో అమెరికా ఆశ్రయం పొందిన వారు ఇప్పుడు దేశం విడిచి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడటంతో ఆందోళన నెలకొంది. ఈ పరిణామాలపై అంతర్జాతీయంగా ఎలాంటి స్పందన వస్తుందో వేచి చూడాలి.

Tags:    

Similar News