ఐపీఎల్: 2008 టు 2025.. ఆర్సీబీ వర్సెస్ కేకేఆర్.. మరి ఎవరిది పైచేయి?
వన్డేలకు ఆదరణ తగ్గి.. టి20లు పుంజుకొంటున్న కాలంలో వచ్చింది ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్).. అలా 2008లో తొలి సీజన్ మొదలైంది.;
వన్డేలకు ఆదరణ తగ్గి.. టి20లు పుంజుకొంటున్న కాలంలో వచ్చింది ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్).. అలా 2008లో తొలి సీజన్ మొదలైంది. తొలి మ్యాచ్ సాదాసీదాగా మొదలై ఉంటే ఐపీఎల్ ఇంత పెద్ద సక్సెస్ కాకపోయేదేమో..? కానీ, అచ్చమైన టి20ని తలపిస్తూ తొలి ఇన్నింగ్స్ లోనే కోల్ కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) బ్యాట్స్ మన్ బ్రెండన్ మెక్ కల్లమ్ విధ్వంసకరంగా ఆడాడు. 73 బంతుల్లోనే 158 పరుగులు చేశాడు. 10 ఫోర్లు, 13 సిక్సర్లు బాదేశాడు. దీంతో కోల్ కతా 20 ఓవర్లలో ఏకంగా 222 పరుగుల భారీ స్కోరు చేసింది. బెంగళూరు కేవలం 82 పరుగులకే ఆలౌటైంది.
మరి తర్వాత 16 ఏళ్లలో బెంగళూరు-కేకేఆర్ చాలాసార్లు ఐపీఎల్ లో తలపడ్డాయి. కానీ, 2008 తర్వాత లీగ్ మొదటి మ్యాచ్ లోనే ఈ రెండు జట్లు ఆడడం ఇదే మొదటిసారి. చిత్రంగా ఉంది కదూ..?
కాగా, సాధారణ ఆటగాళ్లతోనే 17 ఏళ్లలో కేకేఆర్ మూడుసార్లు టైటిల్ కొట్టగా, దిగ్గజాలు ఆడినా ఆర్సీబీ ఒక్కసారీ చాంపియన్ గా నిలవలేదు. ఇది మరో విచిత్రం.
ఇప్పుడు కేకేఆర్ డిఫెండింగ్ చాంపియన్ గా ఐపీఎల్ 18 సీజన్ బరిలో దిగుతోంది. ఆర్సీబీ ఈసారైనా టైటిల్ గెలవాలని చూస్తోంది. వాస్తవానికి కోల్ కతా విజయాల వెనుక ఆ జట్టు మాజీ కెప్టెన్, మెంటార్ గౌతమ్ గంభీర్ పాత్ర చాలా ఉంది. ఇప్పుడు అతడు టీమ్ ఇండియా హెడ్ కోచ్ గా వెళ్లినా, గత సీజన్ లో చాంపియన్ గా నిలిపిన కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ లేకున్నా కోల్ కతా పటిష్ఠంగానే ఉంది.
రూ.2 కోట్ల అతి తక్కువ ధరకు తీసుకున్న టీమ్ ఇండియా మాజీ వైస్ కెప్టెన్ అజింక్య రహానేను అనూహ్యంగా కెప్టెన్ చేసిన కోల్ కతా మేటి ఆటగాళ్లతో బలంగా ఉంది. ఈసారీ కప్ కొడితే గనుక నాలుగోసారి చాంపియన్ గా నిలుస్తుంది. ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ టైటిళ్ల (5) సంఖ్యకు దగ్గరవుతుంది.
ఈ సాలా అయినా నమదేనా?
ఐపీఎల్ మొదటి సీజన్ నుంచి బలమైన జట్టే అయినా ఒక్కసారీ టైటిల్ కొట్టలేని బెంగళూరు.. ఈ సాలా కప్ నమదే (ఈ సంవత్సరం కప్ మనదే) అని ప్రతిసారీ బరిలో దిగుతోంది. కానీ, ఒక్కసారీ గెలవడం లేదు. తాజా సీజన్ కు స్టార్ బ్యాట్స్ మన్ విరాట్ కోహ్లి మళ్లీ కెప్టెన్సీ చేపడతాడని ఫ్యాన్స్ ఊహించినా.. జట్టు భవిష్యత్ రీత్యా ఆర్సీబీ మేనేజ్‌మెంట్ రజత్ పటీదార్ ను ఎంపిక చేసింది. బ్యాటింగ్, బౌలింగ్ లో కాగితంపై ఎప్పుడూ బలంగా కనిపించే బెంగళూరు కీలక సమయంలో చేతులెత్తేస్తుంది. అందుకే ఒక్కసారీ విజేతగా నిలవలేదు. ఈసారి కోహ్లి మంచి ఫామ్ లో ఉండడం, విధ్వంసక ఓపెనర్ ఫిల్ సాల్ట్, కెప్టెన్ పటీదార్, తిరిగొచ్చిన దేవదత్ పడిక్కల్, వికెట్ కీపర్ జితేశ్ శర్మ, ఇంగ్లండ్ హార్డ్ హిట్టర్ లియామ్ లివింగ్ స్టోన్ లతో పాటు ఆల్ రౌండర్లు టిమ్ డేవిడ్, జాకబ్ బెతెల్ అందరూ స్టార్లే. బౌలింగ్ లో సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్ ఆస్ట్రేలియాకు చెందిన జోష్ హేజిల్‌వుడ్, ఎడమచేతివాటం యశ్ దయాల్ మేటి ఆటగాళ్లే.. ఆల్ రౌండర్ కృనాల్ పాండ్య, సూయాశ్ శర్మతో పాటు లివింగ్ స్టోన్ స్పిన్ విభాగాన్ని ఎలా నడిపిస్తారో చూడాలి.
ఈ కోల్ కథ చాలా లోతు..
వెస్టిండీస్ మిస్టరీ స్పిన్నర్ సునీల్ నరైన్ ఓపెనర్ గా వస్తున్నాడంటే కోల్ కతా ఎంతటి ప్రమాదకర జట్టో తెలుస్తోంది. కోల్ కతాకు లోయర్ ఆర్డర్ వరకు హిట్టర్లు ఉన్నారు. వైస్ కెప్టెన్ వెంకటేశ్ అయ్యర్, రింకూసింగ్, డికాక్, ఆండ్రీ రస్సెల్, రమణ్ దీప్ సింగ్ వీరంతా భారీ హిట్టర్లే.
కెప్టెన్ అజింక్య రహానె, గుర్బాజ్, మనీశ్ పాండే నిలకడ, దూకుడు కలగలిసినవారు. మిస్టరీ స్పిన్నర్లు వరుణ్ చక్రవర్తి, సునీల్ నరైన్ లు ప్రత్యర్థులకు సవాలే. పేసర్లు ఆన్రిచ్ నోకియా, హర్షిత్ రాణా, స్పెన్సర్ జాన్సన్, చేతన్ సకారియా , స్పిన్ ఆల్ రౌండర్ మొయిన్ అలీ, పేస్ ఆల్ రౌండర్ రస్సెల్ మ్యాచ్ ను మలుపు తిప్పేయగలరు.
17 సీజన్లలో కేకేఆర్-ఆర్సీబీ 34 సార్లు తలపడగా కోల్ కతా 20 మ్యాచ్ లలో.. బెంగళూరు 14 మ్యాచ్ లలో గెలిచాయి.