ఐపీఎల్ 'ఫస్ట్..' టాస్ నుంచి సెంచరీ వరకు స్పెషల్!
రూ.లక్ష కోట్ల ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో అనేక సంచలనాలు.. వందల వేల కొద్దీ పరుగులు.. అంతేస్థాయిలో వికెట్లు.. రికార్డులకే రికార్డులు..;
రూ.లక్ష కోట్ల ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో అనేక సంచలనాలు.. వందల వేల కొద్దీ పరుగులు.. అంతేస్థాయిలో వికెట్లు.. రికార్డులకే రికార్డులు.. మరి అలాంటి ఐపీఎల్ 18వ సీజన్ మొదలైంది. మరి ఇన్నేళ్లలో ’ఫస్ట్’ ఏమేమిటి..? వాటిని సాధించినది ఎవరు?
2008 ఏప్రిల్ లో మొదలైంది ఐపీఎల్. 17 సీజన్లు పూర్తిచేసుకుని 18వ సీజన్ లోకి అడుగుపెట్టింది. కొత్త సీజన్ తొలి మ్యాచ్ కు డిఫెండింగ్ చాంపియన్ కోల్ కతా నైట్ రైడర్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య టాస్ పడనుంది. ఈ సీజన్ కు ఇదే తొలి టాస్ అన్నమాట. ఆసక్తికరం ఏమంటే.. ఐపీఎల్ మొదటి సీజన్ లో తొలి మ్యాచ్ ఆడింది ఈ రెండు జట్లే. మళ్లీ టోర్నీ తొలి మ్యాచ్ లో ఈ రెండు జట్లు తలపడడం ఇప్పుడే.
సెంచరీతోనే స్టార్ట్..
ఐపీఎల్ లో తొలి మ్యాచ్ తొలి ఇన్నింగ్స్ లోనే సెంచరీ నమోదైంది. కోల్ కతా ఆటగాడు బ్రెండన్ మెకల్లమ్ దానిని సాధించాడు.
2008లో తొలి మ్యాచ్ కోల్ కతా-బెంగళూరు మధ్యనే జరిగినా వేదిక మాత్రం బెంగళూరు. నాడు టాస్ గెలిచి అప్పటి ఆర్‌సీబీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్ కోల్ కతాకు బ్యాటింగ్ అప్పగించాడు.
-ఐపీఎల్ మొదటి బంతిని ఆడింది ఎవరో కాదు.. టీమ్ ఇండియా మోస్ట్ సక్సెస్ ఫుల్ కెప్టెన్ సౌరభ్ గంగూలీ. నాడు కోల్ కతా కెప్టెన్ కూడా అతడే.
-గంగూలీకి మొదటి బంతిని వేసింది బెంగళూరు బౌలర్ ప్రవీణ్ కుమార్. మొదటి ఫోర్, సిక్స్ లు మాత్రం గంగూలీతో తోడుగా దిగిన మెక్ కల్లమ్ వే.
-తొలి బంతిని ఎదుర్కొన్న గంగూలీనే తొలి వికెట్ గా జహీర్ ఖాన్ బౌలింగ్ లో కలిస్ కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.
- ఐపీఎల్‌లో తొలి హాఫ్ సెంచరీ, సెంచరీలు సాధించినది మెకల్లమ్ (158). అంతేకాదు తొలిసారి 150 దాటినది కూడా ఇతడే. దీంతో అతడికే మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ దక్కింది. ఇదే మ్యాచ్ లో కోల్ కతా 140 పరుగుల తేడాతో నెగ్గింది.
-ఐపీఎల్‌లో సెంచరీ చేసిన తొలి భారతీయుడు.. మనీష్ పాండే. బెంగళూరుకు ఆడుతూ 2009లో దక్కన్ ఛార్జర్స్ పై దీనిని సాధించాడు.
-ఐపీఎల్ లో హ్యాట్రిక్ సాధించిన తొలి ఆటగాడు.. చెన్నైకు చెందిన లక్ష్మీపతి బాలాజీ (సీఎస్‌కే). 2008లో పంజాబ్ పై దీనిని సాధించాడు.
-ఐపీఎల్‌లో 5 వికెట్లు తీసిన తొలి ఆటగాడు.. పాక్ కు చెందిన సోహైల్ తన్వీర్ (రాజస్థాన్ రాయల్స్). తొలి సీజన్ లో చెన్నైపై ఈ రికార్డు నెలకొల్పాడు. అత్యధిక వికెట్ల వీరుడికి ఇచ్చే పర్పుల్ క్యాప్ విజేత కూడా సొహైల్ తన్వీరే కా వడం విశేషం. అతడు రాజస్థాన్ తరఫున 22 వికెట్లు పడగొట్టాడు.
-తొలి ఐపీఎల్ చాంపియన్.. రాజస్థాన్ రాయల్స్.
-ఐపీఎల్ లో తొలి ఆరెంజ్ క్యాప్ విజేత.. షాన్ మార్ష్ (కింగ్స్ ఎలెవన్ పంజాబ్)– 616 పరుగులు
-ఐపీఎల్‌లో తొలి మ్యాచ్ లోనే కోల్‌కతా నైట్ రైడర్స్ 200 పరుగుల మైలురాయి(222/3)ని దాటింది. 200+ పరుగులు చేసిన తొలి జట్టు ఇదే.
రెండేళ్ల కిందట ప్రవేశపెట్టిన ఇంపాక్ట్ ప్లేయర్ విధానంలో తొలిసారిగా బరిలో దిగింది తుషార్ దేశ్‌పాండే (సీఎస్‌కే).
కొసమెరుపు: అప్ కమింగ్ ప్లేయర్ కు ఇచ్చే ఎమర్జింగ్ ప్లేయర్ అవార్డు.. తొలి సీజన్ లో శ్రీవాత్స్ గోస్వామి (ఆర్‌సీబీ)కి దక్కింది. కానీ, అతడు టీమ్ ఇండియాకు ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు.