సభ్యులపై సంతకాల ఆరోపణ.. జగన్ రియాక్షన్ ఏంటి..?
ఈ పరిణామం.. రోజు రోజంతా రాజకీయాలను వేడెక్కించింది. అంతేకాదు.. వైసీపీ సభ్యులపైనా విమర్శలు వచ్చేలా చేసింది.;
అసెంబ్లీలో గురువారం చోటు చేసుకున్న పరిణామాలు.. రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపాయి. వైసీపీకి చెంది న ఏడుగురు సభ్యులు దొంగచాటుగా వచ్చి.. అటెండెన్సు రిజిస్టర్‌లో సంతకాలు చేసి వెళ్లిపోతున్నారని.. ఇదేం పద్ధతని స్పీకర్ అయ్యన్నపాత్రుడు నిలదీశారు. ఒకరకంగా.. వారిని తిట్టిపోశారనే చెప్పాలి. ప్రజా ప్రతినిధులుగా ఉన్నవారు.. ప్రజలతో ఓటు వేయించుకున్నవారు..ఇలానేనా చేసేందని ప్రశ్నించారు. దొంగల్లా వచ్చి.. సంతకాలు పెట్టి పోతారా? అని నిలదీశారు.
ఈ పరిణామం.. రోజు రోజంతా రాజకీయాలను వేడెక్కించింది. అంతేకాదు.. వైసీపీ సభ్యులపైనా విమర్శలు వచ్చేలా చేసింది. కాగా.. దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రజాప్రతినిధిగా ఎన్నికైన అభ్యర్థి.. సభకు రాకపోయినా లిఖిత పూర్వకంగా ప్రశ్నలు అడిగే అవకాశం రాజ్యాంగమే కల్పించిందని రాజ్యాంగ నిపుణులు చెబుతున్నారు. ప్రజాప్రాతినిధ్య చట్టంలోని పలు సెక్షన్లు.. అత్యవసర పరిస్థితిలో సభ్యుడు సభకు హాజరుకాలేకపోయినప్పుడు.. సభలో లిఖిత పూర్వక ప్రశ్నలు అడగొచ్చన్నది వారి వాదన.
పార్లమెంటులోనూ ఇదే సంప్రదాయం కొనసాగుతోందని అంటున్నారు. మాజీ ప్రదాని దేవెగౌడ .. తరఫున రోజూ.. రాజ్యసభలో ఏదొ ఒక ప్రశ్న వస్తోందని.. కానీ, ఆయన మాత్రం పెద్దల సభకు రావడం లేదని కొంద రు అంటున్నారు. అయితే.. వైసీపీ సభ్యుల విషయంలో మాత్రం రాజకీయంగా విమర్శలు వచ్చాయి. సభకు రాకుండా ప్రశ్నలు అడగడం ఏంటని స్పీకర్ వ్యాఖ్యానించారు. కానీ, సభకు రాకపోయినా.. ప్రశ్నలు అడిగే హక్కు సభ్యులకు ఉంటుంది.
కట్ చేస్తే.. ఈ విషయంపై వైసీపీ అధినేత జగన్.. సదరు ఏడుగురు సభ్యులకు ఫోన్లు చేసినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నారు. గురువారం ఈ వ్యవహారం తెరమీదికి వచ్చినప్పుడే.. ఆయన పార్టీ బాధ్యులతో ఫోన్లలో మాట్లాడారని.. అదేవిధంగా ఎమ్మెల్యేలతోనూ మాట్లాడినట్టు విశ్వసనీయ వర్గాలు చెప్పాయి. ``ఎలానూ మనం సభకు వెళ్లడం లేదు.ఏదైనా ఉంటే ప్రజల మధ్యకే వెళ్లండి. మీడియా ముఖంగానే ప్రశ్నలు సంధించండి. ఇలా చేసి పొరపాటుగా కూడా విమర్శలకు అవకాశం ఇచ్చే పరిస్థితిని తెచ్చుకోకండి`` అని జగన్ తన వారికి సూచించినట్టు పార్టీ వర్గాలు చెప్పాయి.