చంద్రుని చీకటి భాగాన్ని కబ్జా చేయాలని చూస్తోన్న చైనా?
ఈ విషయాలను నాడు చైనా నేషనల్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ తన వెబ్ సైట్ లో తెలిపింది. మే 3న దీన్ని ప్రయోగించగా సుమారు 53 రోజులు ప్రయాణించి చంద్రుడిని చేరుకున్నట్లు తెలిపారు.;
చంద్రుని అవతలి వైపు ఖనిజాలను అన్వేషించేందుకు మానవరహిత వ్యోమనౌకను పంపించగా అది సేఫ్ ల్యాండింగ్ అయ్యిందని గత ఏడాది జూన్ లో చైనా అంతరిక్ష సంస్థ తెలిపిన సంగతి తెలిసిందే. ఈ విషయాలను నాడు చైనా నేషనల్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ తన వెబ్ సైట్ లో తెలిపింది. మే 3న దీన్ని ప్రయోగించగా సుమారు 53 రోజులు ప్రయాణించి చంద్రుడిని చేరుకున్నట్లు తెలిపారు.
అవును... అంతరిక్ష ప్రయోగాల్లో చైనా కీలక అడుగు వేసిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా... చంద్రుని చీకటివైపుకు ల్యాండర్, అసెండర్ తో కూడిన వ్యోమనౌకను పంపి, ఆ ప్రాంతంలో ఉండే రాళ్లు, మట్టి నమూనాలను సేకరిస్తోంది. ఆ సంగతి అలా ఉంటే... తాజాగా చంద్రుని అవతలి వైపున రేడియో టెలిస్కోప్ శ్రేణిని నిర్మించాలని చైనా శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.
ఈ మేరకు ప్రతిష్టాత్మక ప్రణాళికను ముందుకు తెచ్చారు. దీంతో... ఈ ప్రాజెక్టుకు అనుమతి లభిస్తే అది మొదటి కార్యాచరణ చంద్ర రేడియో అబ్జర్వేటరీని అందించగలదని చెబుతున్నారు. ఈ టెలీస్కోప్ శ్రేణి 7,200 సీతాకోక చిలుక ఆకారపు వైర్ యాంటెన్నాలతో రూపొందించబడిందని.. ఇది ఆల్ట్రా లాంగ్ వేవ్ లెంగ్త్ కాస్మిక్ సిగ్నల్ లను గుర్తించగలదని చెబుతున్నారు.
ఈ టెలీస్కోప్ శ్రేణి సుమారు 30 కి.మీ. విస్తీర్ణంలో విస్తరించి ఉంటుందని.. ఇది మరిన్ని ఎక్సోప్లానెట్ లను కనుగొనడానికి అధిక రిజల్యూషన్, సున్నితత్వాన్ని అందిస్తుందని అంటున్నారు. అన్నీ అనుకూలంగా జరిగితే రోబోటిక్, సిబ్బందితో కూడిన చంద్ర యాత్రలతో పాటు 2035 నాటికి ఇది పనిచేయగలదని అంచనా వేస్తున్నారు.
వాస్తవానికి ఈ తరహా ఆలోచన అమెరికా శాస్త్రవేత్తలు ఇప్పటికే ప్రతిపాదించినప్పటికీ.. చైనా వెర్షన్ పదేళ్లలోనే సాకారం కావొచ్చని చెబుతున్నారు. అయితే... ఈ టెలీస్కోప్ శ్రేణి నిర్మాణం అత్యంత సంక్లిష్టమైన ఇంజినీరింగ్ ప్రాజెక్ట్ అని చెబుతున్నారు. ఈ ప్రాజెక్ట్ బహుళ రంగాల్లో ఆవిష్కరణలను నడిపిస్తుందని.. ఫలితంగా.. ఖగోళ పరిశోధనల్లో చైనా స్థానాన్ని బలోపేతం చేస్తుందని విశ్వసిస్తున్నారు!
కాగా... భూమిపై ఉన్నవారికి చంద్రుడు ఒకవైపే కనిపిస్తుందనే సంగతి తెలిసిందే. అవతలివైపు కనిపించదు. అందువల్లే దాన్ని చీకటి భాగమని అంటారు. వాస్తవానికి అక్కడ నిజంగా చీకటేమీ ఉండదు.. మనకు కనిపించేవైపులాగానే అవతలివైపు కూడా సూర్యకిరణాలు ప్రసరిస్తాయి.
కాకపోతే.. చంద్రుడు తన కక్ష్య మీద ఒకసారి పూర్తిగా భ్రమించటానికి పట్టే సమయం, భూమి చుట్టూ తిరిగి రావటానికి పట్టే సమయం సమానంగా ఉండటం వల్ల ఎప్పుడూ ఒకవైపే కనిపిస్తుంది. దీనే... టైడల్ లాకింగ్ అంటారు.