రేవంత్ రెడ్డితో మల్లారెడ్డి.. ఏంది కథ?
మాజీ మంత్రి, బిఆర్‌ఎస్ నేత మల్లారెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో భేటీ కావడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.;
ఊరికే వెళ్లరు మహానుభావులు అని.. రాజకీయాల్లో ప్రతీ కలయిక వెనుక అర్థం పరమార్థం ఉంటాయి. పైకి అబ్బే అదేం లేదు అని చెప్పినా కూడా బలమైన అధికార శక్తులతో ప్రతిపక్ష నేతల భేటి ఎప్పుడు ప్రాధాన్యత సంతరించుకుంటూనే ఉంటుంది. తెలంగాణ రాజకీయాల్లో సంచలన నేత మల్లారెడ్డి వ్యవహారశైలి కూడా విభిన్నంగా ఉంటుంది. ఆయన రాజకీయంగా ఎదిగేందుకు చాలా పార్టీలు మారారు. ఓసారి ఎంపీ, తర్వాత ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి కూడా అయ్యారు.ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డితో ఆయన భేటి కావడంతో ఊహాగానాలు మరింత ఊపందుకున్నాయి.
మాజీ మంత్రి, బిఆర్‌ఎస్ నేత మల్లారెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో భేటీ కావడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఒకప్పుడు రేవంత్ రెడ్డిని తీవ్రంగా వ్యతిరేకించిన మల్లారెడ్డి ఆయనతో సమావేశం కావడం అనేక ఊహాగానాలకు దారితీసింది. వీరిద్దరి మధ్య రాజకీయ వైరం అందరికీ తెలిసిందే. అలాంటి పరిస్థితుల్లో ఈ భేటీ రాజకీయ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేసింది.
ఈ భేటీ అనంతరం మల్లారెడ్డి మీడియాతో మాట్లాడుతూ తన నియోజకవర్గంలోని పెండింగ్ పనుల గురించే ముఖ్యమంత్రిని కలిశానని స్పష్టం చేశారు. "నా నియోజకవర్గం నుంచి కొన్ని పనులు పెండింగ్‌లో ఉన్నాయి. వాటిని పూర్తి చేయమని సీఎం రేవంత్ రెడ్డిని కలిస్తే తప్పేముంది?" అని ఆయన ప్రశ్నించారు.
పార్టీ మారే ఆలోచన తనకు లేదని కూడా మల్లారెడ్డి తేల్చిచెప్పారు. "72 ఏళ్ల వయసులో నేనెందుకు పార్టీ మారుతాను?" అంటూ ఆయన వ్యాఖ్యానించారు. అంతేకాకుండా, రాబోయే ఎన్నికల్లో బిఆర్‌ఎస్ పార్టీ నుండి తమ కుటుంబం నుంచి నలుగురు పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నారని ఆయన చమత్కరించారు. ఒకవేళ జమిలీ ఎన్నికలు వస్తే తాను ఖచ్చితంగా ఎంపీగా పోటీ చేస్తానని ఆయన స్పష్టం చేశారు.
మల్లారెడ్డి, రేవంత్ రెడ్డిల మధ్య ఉన్న రాజకీయ విభేదాల దృష్ట్యా ఈ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. నియోజకవర్గ అభివృద్ధి కోసమే ఈ భేటీ జరిగిందా లేక ఇందులో మరేదైనా రాజకీయ కోణం ఉందా అనేది వేచి చూడాలి. అయితే, ఈ సమావేశం తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఒక హాట్ టాపిక్‌గా మారింది.