స్టెప్ రాంగ్ అయిందా : మోపిదేవి...ఏది దారి ?
ఆయన ఒంట్లో అంతా కాంగ్రెస్ రక్తమే ఉంది. భక్తి ఉంది అంటారా అది వైఎస్సార్ కుటుంబం మీదనే ఉంది.;
ఆయన ఒంట్లో అంతా కాంగ్రెస్ రక్తమే ఉంది. భక్తి ఉంది అంటారా అది వైఎస్సార్ కుటుంబం మీదనే ఉంది. ఆయనే మోపిదేవి వెంకటరమణ. ఆయన ఉమ్మడి గుంటూరు జిల్లా రేపల్లెకు చెందిన వారు. ఆయనది మూడున్నర దశాబ్దాల రాజకీయ జీవితం. 1989, 1994లలో కూచిపూడి నుంచి అసెంబ్లీకి కాంగ్రెస్ తరఫున పోటీ చేసి ఓటమి పాలు అయ్యారు.
అయితే 1999, 2004లలో అదే కూచిపూడి నుంచి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీకి వచ్చారు. ఇక అసెంబ్లీ నియోజకవర్గాల పునర్ విభజనలో రేపల్లెకు ఆయన షిఫ్ట్ అయ్యారు. 2009లో అక్కడ నుంచి తొలిసారి గెలిచారు. 2014 నాటికి వైసీపీలో చేరి రేపల్లె నుంచి పోటీ చేసి ఓటమి పాలు అయ్యారు. 2019లో అదే రిపీట్ అయింది. ఈ విధంగా చూస్తే ఆయన మొత్తం తన రాజకీయ జీవితంలో 2024లో తప్ప 1989 నుంచి ఏడు సార్లు పోటీ చేస్తే మూడు సార్లు మాత్రమే గెలిచారు.
అయితే ఆయన వైఎస్సార్ మంత్రివర్గంలో కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గంలో జగన్ మంత్రివర్గంలో కూడా మంత్రిగా పనిచేయడం విశేషం. శాసనమండలి రద్దు అని వైసీపీ నిర్ణయం తీసుకుంటే మోపిదేవిని రాజ్యసభకు 2020లో ఎంపిక చేశారు. అలా ఆయన పదవీ కాలం 2026 జూన్ వరకూ ఉంది.
అయితే 2024లో రేపల్లె టికెట్ తనకు కానీ తన కుటుంబానికి కానీ ఇస్తారని ఆశించిన మోపిదేవి అది దక్కకపోవడంతో అసంతృప్తి చెందారు. వైసీపీ ఓటమి పాలు అయ్యాక ఆయన ఆగస్టులో తన ఎంపీ పదవికి రాజీనామా చేశారు. టీడీపీలో చేరారు. అయితే ఆయనకు ఎమ్మెల్సీ ఇస్తామని పార్టీ హామీ ఇచ్చింది అని అంటారు.
ఇదిలా ఉంటే తాజాగా అయిదు ఎమ్మెల్సీ పదవులు ఖాళీ అయినా టీడీపీ అందులో మూడు తీసుకున్నా మోపిదేవి పేరు ఏ దశలోనూ పరిశీలనకు రాలేదని అంటున్నారు ఇక రేపల్లెలో బలమైన నాయకుడిగా మంత్రి అనగాని సత్యప్రసాద్ ఉన్నారు. ఆయనను కాదని అక్కడ మోపిదేవికి రాజకీయ పెత్తనం ఇచ్చే చాన్స్ లేదు.
మరో వైపు చూస్తే వైసీపీ ఎమ్మెల్సీలు రాజీనామా చేసినా ఆ ఖాళీలతో పాటు 2027లో మరిన్ని ఖాళీలు వచ్చినా మోపిదేవికి చాన్స్ దక్కుతుందా అంటే డౌటే అని అంటున్నారు. ఎందుకంటే ఆయనకు రేపల్లెలో కౌంటర్ పార్ట్ గా మంత్రి సత్యప్రసాద్ ఉన్నారు. ఆయన మోపిదేవి రాజకీయ ప్రాబల్యాన్ని ఆదిలోనే అడ్డుకుంటారు అని అంటున్నారు.
ఇవన్నీ పక్కన పెడితే వైసీపీలోనే మోపిదేవి కొనసాగి ఉంటే మరో ఏడాదిన్నర పాటు ఎంపీ పదవి ఉండేది కదా అని అంటున్నారు. పైగా ఆయనకు కాంగ్రెస్ వైసీపీ రాజకీయం అచ్చివచ్చిందని టీడీపీతో దశాబ్దాలుగా పోరాడుతూ వచ్చి ఇపుడు కలిసిపోవడం అంటే అవతల పార్టీ వారు సర్దుకుని పోరు కదా అని అంటున్నారు.
మోపిదేవికి జగన్ అన్ని విధాలుగా న్యాయం చేసినా ఆయన పార్టీ మారి ఏమి సాధించారు అని అంటున్నారు. ఇటీవల ఎమ్మెల్సీ అభ్యర్ధులను టీడీపీ భర్తీ చేసిన తరువాత సోషల్ మీడియాలో వైసీపీ యాక్టివిస్టులు అయితే మోపిదేవి మీద సెటైర్లు వేశారు కూడా. ఇపుడు ఆయన అనుచరులు కూడా ఇదే విషయం మీద ఆవేదనతో ఉన్నారుట. మొత్తానికి మోపిదేవి రాంగ్ స్టెప్ వేశారని చేతిలో ఉన్న బంగారం లాంటి రాజ్యసభ పదవిని వదులుకుని టీడీపీ పెద్దల బ్లెస్సింగ్స్ కోసం ఎదురుచూడడం తప్ప చేయగలిగింది ఏమీ లేదని అంటున్నారు.