కశ్మీర్ లో థియేటర్స్ హౌస్ ఫుల్... ఎందుకో తెలుసా?
2019 వరకు జమ్ముకశ్మీర్ అంతా ఒకటే దానికింద ఉండేది. ఆ తర్వాతనే నరేంద్ర మోదీ ప్రభుత్వం ఆర్టికిల్ 370 రద్దుతో చరిత్రాత్మక అడుగు వేసింది.;
ఇప్పుడంటే వేర్పాటు వాదం.. ఉగ్రవాదం బారినపడి కశ్మీర్ అలా తయారైంది కానీ.. 1990లకు ముందు కశ్మీర్ అంటే భూతల స్వర్గమే.. ‘కశ్మీరీ లోయలో’ అంటూ చిరంజీవి నుంచి ఎందరో సూపర్ స్టార్లు అక్కడ సినీమాల పాటలు పాడుకున్నవారే.. కానీ, 1990ల తర్వాత కశ్మీర్ లో వేర్పాటు వాదం పెరిగిపోయింది. దీనికి పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాదం తోడైంది. అలా సుందర కశ్మీర్ చిందరవందర అయింది.
2019 వరకు జమ్ముకశ్మీర్ అంతా ఒకటే దానికింద ఉండేది. ఆ తర్వాతనే నరేంద్ర మోదీ ప్రభుత్వం ఆర్టికిల్ 370 రద్దుతో చరిత్రాత్మక అడుగు వేసింది. దీంతో కశ్మీర్, లద్దాఖ్ రెండు భాగాలుగా విడిపోయింది. అప్పటివరకు కశ్మీర్ లో భూములు, ఆస్తులు కొనాలంటే అక్కడి ప్రజలకే హక్కు. ఆర్టికిల్ 370 రద్దుతో ఇక అంతా ఫ్రీ అయిపోయింది.
గత ఏడాది చివరలో ఎన్నికలు కూడా జరిగి కశ్మీర్ లో ప్రభుత్వం కూడా ఏర్పాటైంది. అంతేకాదు.. కశ్మీర్‌లో సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయని, అక్కడి యువత ఉద్యోగాలు చేస్తున్నారని కేంద్ర హోం మంత్రి అమిత్ షా తెలిపారు. గతంలోలా కశ్మీర్ లో ఉగ్రవాదులకు సానుభూతిగా ఆందోళనలు జరగట్లేదని పేర్కొన్నారు. ఇప్పుడు కశ్మీర్‌లో సాయంత్రం కూడా సినిమాహాళ్లు తెరిచే ఉంటున్నాయన్నారు. మోదీ ప్రభుత్వం ఉగ్రవాదం పట్ల కఠిన వైఖరి అనుసరిస్తోందని చెప్పారు.
అమిత్ షా శుక్రవారం రాజ్యసభలో మాట్లాడారు. గత ప్రభుత్వాలు ఉగ్రవాదుల పట్ల మెతక వైఖరి అనుసరించాయని మండిపడ్డారు. కశ్మీర్ లోనే కాక ఈశాన్య భారతంలోని ఉగ్రవాదం, తీవ్రవాదంతో 92వేల మంది ప్రాణాలు కోల్పోయారని షా వివరించారు. మోదీ పాలనలో జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదం కారణంగా మరణాలు 70 శాతం తగ్గాయని చెప్పారు. ఆర్టికల్ 370 రద్దు చేయడం ద్వారా ‘ఒకే రాజ్యాంగం- ఒకే జెండా’ అనే రాజ్యాంగ నిర్మాతల కలను మోదీ ప్రభుత్వం నెరవేర్చిందన్నారు.
2019 నుంచి కశ్మీరీ యువతకు 40వేల ప్రభుత్వ ఉద్యోగాలు లభించాయన్నారు.