విజయసాయిరెడ్డి ఎంపీ సీటు ఆయనకే కన్ ఫర్మ్ ?

వైసీపీకి చెందిన విజయసాయిరెడ్డి ఈ ఏడాది జనవరి 25న తన ఎంపీ పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.;

Update: 2025-03-22 00:30 GMT

వైసీపీకి చెందిన విజయసాయిరెడ్డి ఈ ఏడాది జనవరి 25న తన ఎంపీ పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఆయన ఏకంగా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించి సంచలనం రేపారు. అయితే ఆయన పదవీ కాలం 2028 జూన్ దాకా ఉంది. అంటే మరో మూడేళ్లకు పైగా ఉంది అన్న మాట.

రాజ్యసభ సభ్యత్వం ఇంత ఎక్కువ టైం ఉండగా రాజీనామా చేయడం ద్వారా విజయసాయిరెడ్డి త్యాగ పురుషులు అనిపించుకున్నారు. అయితే ఆ త్యాగ ఫలితం మాత్రం ఏపీలో అధికారంలో ఉన్న కూటమికే వెళ్తోంది. కూటమిలో పెద్దన్నగా టీడీపీ ఉంది. అలాగే జనసేన బీజేపీ మిత్రులుగా ఉన్నాయి.

ఈ ఖాళీ అయిన ఎంపీ సీటు ఎవరికి దక్కుతుంది అన్న చర్చ అయితే కొంతకాలంగా నడుస్తోంది. అంతకు ముందు ముగ్గురు వైసీపీ ఎంపీలు రాజీనామా చేస్తే అందులో ఒక దానిని బీజేపీ తీసుకుంది. తెలంగాణాకు చెందిన ఆర్ క్రిష్ణయ్య వైసీపీకి రాజీనామా చేసి బీజేపీలో చేరి ఆ సీటు పొందారు. ఇక వైసీపీ నుంచి టీడీపీలోకి చేరిన బీద మస్తాన్ రావు తన మాతృ సంస్థ టీడీపీ కావడంతో ఆ సీటుని యధాతధంగా పొందారు. వైసీపీ ఎంపీ మోపిదేవి వెంకటరమణ రాజీనామా చేసిన ఎంపీ సీటు టీడీపీ తీసుకుంది. ఆ సీటుని కాకినాడ లోక్ సభ సీటుని పొత్తులలో పొందలేకపోయిన సానా సతీష్ కి ఇచ్చారు.

ఇపుడు విజయసాయిరెడ్డి ఖాళీ చేసిన సీటు మూడు పార్టీలలో ఎవరికి దక్కుతుంది అన్నది చర్చగా ఉంది. నిజానికి జనసేన నుంచి నాగబాబుకు ఈ సీటు ఇస్తారని అనుకున్నారు. కానీ నాగబాబు ఇటీవలే ఎమ్మెల్సీ అయ్యారు. దాంతో జనసేన తరఫున ఎవరైనా రేసులో ఉంటారా ఉండరా అన్నది ఒక మ్యాటర్. మరో వైపు చూస్తే టీడీపీ ఈ సీటుని కోరుతుంది అని అంటున్నారు. ఎమ్మెల్సీ సీటుని బీజేపీకి ఇచ్చినందువల్ల రాజ్యసభ సీటు తమకు ఇవ్వాలని కోరవచ్చు అని అంటున్నారు.

అయితే విజయసాయిరెడ్డి బీజేపీ పెద్దలతో సాన్నిహిత్యం నెరిపారు. ఆయన వారి సూచనలతోనే రాజీనామా చేశారు అని ప్రచారం సాగింది. దాంతో అది తమ సీటే అని బీజేపీ క్లెయిం చేసే చాన్స్ ఉందని అంటున్నారు. ఇక రాజ్యసభలో బీజేపీకి ఎంపీల కొరత ఉంది. కీలక బిల్లుల ఆమోదం కోసం ఆ పార్టీ చూస్తూ వస్తోంది. అందుకే కచ్చితంగా బీజేపీ తీసుకుంటుంది అని అంటున్నారు.

అయితే బీజేపీలో ఈ సీటు విషయంలో చాలా మంది పోటీ పడుతున్నారు. మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి పేరు కూడా వినిపిస్తోంది. కానీ బీజేపీ పెద్దలు మాత్రం విశాఖకు చెందిన జీవీఎల్ నరసింహారావు కి ఈ సీటు ఇస్తారని అంటున్నారు. ఆయన గతంలో బీజేపీ నుంచి ఉత్తరప్రదేశ్ కోటాలో ఆరేళ్ల పాటు రాజ్యసభ మెంబర్ గా పనిచేశారు. ఆయన 2024 ఎన్నికల్లో విశాఖ నుంచి లోక్ సభకు పోటీ చేయాలని అనుకున్నారు.

అయితే పొత్తులలో భాగంగా ఆయనకు సీటు దక్కలేదు. దాంతో ఆయనను రాజ్యసభకు తీసుకుని రావాలని ఆ పార్టీ చూస్తోంది అని అంటున్నారు. జీవీల్ అయితే పార్టీ గొంతుకను బలంగా మీడియా ముఖంగా వినిపిస్తారు అని అంటున్నారు. ఆయన బీజేపీ కి జాతీయ అధికార ప్రతినిధిగా గతంలో వ్యవహరించారు. బీజేపీ పెద్దలు ఆయన పట్ల సానుకూలంగా ఉన్నారని చెబుతున్నారు.

ఆయనకు రాజ్యసభ సీటు ఇస్తే ఏపీలో కూడా పార్టీ వాణి మరింత బలంగా జనంలోకి తీసుకుని వెళ్తారని భావిస్తున్నారు. అయితే బీజేపీలోనే మరి కొందరు ఈ సీటు కోసం యత్నిస్తున్నారు అని అంటున్నారు. కానీ ఆల్మోస్ట్ ఆల్ జీవీఎల్ కే ఫైనలైజ్ అయింది అని అంటున్నారు. వేరే ఏ రకమైన సమీకరణలు తెర మీదకు రాకపోతే మాత్రం జీవీఎల్ కే ఎంపీ సీటు అని టాక్ వినిపిస్తోంది.

విశాఖలో మకాం పెట్టి అక్కడ వైసీపీ రాజకీయాలను మొత్తం చూసిన విజయసాయిరెడ్డి ఖాళీ చేసిన సీటు అదే విశాఖకు చెందిన జీవీఎల్ కి దక్కితే మాత్రం అది విశేషంగానే చూడాల్సి ఉంటుంది అని అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.

Tags:    

Similar News