116 ఏళ్లనాటి బ్రిటిష్ చట్టానికి సెలవు.. మహిళలకు ఇకపై కొత్త కొలువు!
బార్లలో మహిళలు పనిచేయవచ్చని బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకొంది.;
ఈ రోజుల్లో మహిళలు అన్ని విషయాల్లో పోటీ పడుతున్నారు.. పురుషులతో సమానంగా పెర్ఫార్మెన్స్ చేస్తున్నారని అంటారు! అయినప్పటికీ కొన్ని ఉద్యోగాలు చేయడానికి మాత్రం వారికి అనుమతి దొరకడం లేదు! ఈ సమయంలో.. ఆ లోటు కూడా లేకుండా బెంగాల్ రాష్ట్ర అసెంబ్లీ సంచలన బిల్లుకు ఆమోదం తెలిపింది. దీంతో.. ఇకపై బార్లలో మహిళలు కనిపించనున్నారు!
అవును... బార్లలో మహిళలు పనిచేయవచ్చని బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకొంది. ఈ సందర్భంగా దీనికి సంబంధించిన బిల్లుకు అసెంబ్లీ ఆమోదం తెలిపింది. ఈ సందర్భంగా స్పందించిన బెంగాల్ మంత్రి చంద్రిమ భట్టాచార్య... మహిళల ఉపాధి, ఉద్యోగ అవకాశాలకు బెంగాల్ ఎక్సైజ్ యాక్ట్ - 1909 ఆటంకంగా మారిందని అన్నారు.
అందుకే దాన్ని సవరించినట్లు తెలిపారు. ఫలితంగా... ఇకపై బార్లలో ఉపాధి అవకాశాలకు ఆడ, మగ అనే విభేదాలు లేవని అన్నారు.. తమ ప్రభుత్వానికి ఉపాధి అవకాశాల్లో ఈ తరహా తారతమ్యాలు లేవని నొక్కి చెప్పారు. ఇక.. తక్షణమే ఈ బిల్లు రాష్ట్ర వ్యాప్తంగా అమల్లోకి రానుందని మంత్రి చంద్రిమ భట్టాచార్య తెలిపారు.
కాగా... తాజాగా పశ్చిమ బెంగాల్ లోని తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీ ఆమోదించిన సవరణ 116 ఏళ్ల నాటిది. ఇందులో భాగంగా... కోల్ కతా (అప్పటి కలకత్తా) భారతదేశానికి రాజధానిగా ఉన్న సమయంలో 1909లో బెంగాల్ ఎక్సైజ్ చట్టం ద్వారా బ్రిటిష్ వారు ఈ నిషేధాన్ని విధించారు. దీన్ని తాజా ప్రభుత్వం ఎత్తివేసింది!