డిజిటల్ అరెస్టు పేరుతో రూ.20 కోట్లు కొట్టేశారు!

తాజాగా ముంబయికి చెందిన ఒక పెద్దవయస్కురాలి నుంచి రూ.20 కోట్లు కొల్లగొట్టిన వైనం షాకింగ్ గా మారింది.;

Update: 2025-03-21 04:01 GMT

సైబర్ నేరగాళ్లు దారుణాలు అంతకంతకూ ఎక్కువ అవుతున్నాయి. ప్రజల్లో ఆశను.. భయాన్ని తమ ఆయుధంగా చేసుకొని అమాయకుల్ని లూటీ చేస్తున్న ఉదంతాలు అంతకంతకూ ఎక్కువ అవుతున్నాయి. మరోవైపు ప్రభుత్వాలు సైతం పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ.. ప్రజల్లో అవగాహన కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. అయినప్పటికీ.. సైబర్ దోపిడీదారుల దుర్మార్గాలు మాత్రం తగ్గట్లేదు. తాజాగా ముంబయికి చెందిన ఒక పెద్దవయస్కురాలి నుంచి రూ.20 కోట్లు కొల్లగొట్టిన వైనం షాకింగ్ గా మారింది.

ఇందుకోసం ఆమెను డిజిటల్ అరెస్టు చేస్తున్నట్లుగా ప్రకటించి.. ఆమెను ఇంట్లో నుంచి బయటకు రాకుండా బంధించారు. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఉదంతంలోకి వెళితే.. సౌత్ ముంబయికి చెందిన 86 ఏళ్ల పెద్దవయస్కురాలికి గత డిసెంబరు 26న సీబీఐ అధికారి అంటూ ఒకరు ఫోన్ చేశారు. మీ బ్యాంక్ ఖాతా ద్వారా అక్రమంగా నగదు చలామణి జరిగిందని.. మీరు డిజిటల్ అరెస్టు అయ్యారని.. ఎక్కడికి వెళ్లకుండా ఇంట్లోనే ఉండాలని.. దీనిపై విచారణ జరుపుతున్నట్లుగా భయపెట్టారు.

ప్రతి మూడు గంటలకు ఒకసారి తనిఖీలు చేస్తామని.. లేదంటే మీ పిల్లలు కూడా డిజిటల్ అరెస్టు అవుతారని బెదిరింపులకు పాల్పడ్డారు. ఆ తర్వాత ఆమె నుంచి విడతలవారీగా డబ్బులు వసూలు చేశారు. ఇదంతా రూ.20.26 కోట్లు కావటం గమనార్హం. ఆలస్యంగా తాను సైబర్ నేరగాళ్ల నుంచి లూటీ అయినట్లుగా అర్థమైన ఆమె పోలీసుల్ని సంప్రదించారు. ఆమె ఖాతా నుంచి వేర్వేరు ఖాతాలకు బదిలీ అయిన నగదులో రూ.77 లక్షల మొత్తాన్ని ఫ్రీజ్ చేశారు. వీరి కోసం గాలింపులు చేపట్టిన పోలీసులు ముంబయిలోని వేర్వేరు ప్రాంతాలకు చెందిన ముగ్గురిని గుర్తించి అదుపులోకి తీసుకొని అరెస్టు చేశారు. ఈ దుర్మార్గంలో భాగస్వాములైన మరో ఇద్దరి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

Tags:    

Similar News