ప్రతివారం ఉచితంగా రెండు మద్యం బాటిల్స్... అసెంబ్లీలో చర్చ!
ఈ సందర్భంగా... మద్యం ఆదాయాన్ని పెంచుకునేందుకే ప్రభుత్వం ఆలోచనలు ఉన్నాయని ప్రతిపక్షాలు ఎద్దేవా చేశాయి.;

దేశంలోని మెజారిటీ రాష్ట్రాల్లో అతిపెద్ద ఆదాయవనరుల్లో ఒకటి ఎక్సైజ్ శాఖ అని చెబుతుంటారు. కొన్ని రాష్ట్రాలైతే ప్రధానంగా ఈ ఆదాయంపైనే ఎన్నో ఆశలు పెట్టుకుని ఉంటుందని చెబుతారు. ఈ నేపథ్యంలో తాజాగా కర్ణాటక అసెంబ్లీలో ఎక్సైజ్ ఆదాయం, లక్ష్యాలపై చర్చ జరిగింది. ఈ సమయంలో వారానికి రెండు ఫ్రీ బాటిల్స్ అనే ఆలోచన తెరపైకి వచ్చింది.
అవును... తాజాగా కర్ణాటక రాష్ట్ర అసెంబ్లీలో ఎక్సైజ్ శాఖపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా... ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఎక్సైజ్ శాఖ ఆదాయం రూ.36,500 కోట్లుగా ఉండగా.. 2025-26 ఆర్థిక సంవత్సరానికి ఎక్సైజ్ శాఖ ఆదాయ లక్ష్యాన్ని రూ.40 వెట్లకు పెంచారు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య.
ఈ సందర్భంగా... మద్యం ఆదాయాన్ని పెంచుకునేందుకే ప్రభుత్వం ఆలోచనలు ఉన్నాయని ప్రతిపక్షాలు ఎద్దేవా చేశాయి. దీంతో.. అధికార, విపక్షాల మధ్య లిక్కర్ ఆదాయం, లక్ష్యాలపై ఆసక్తికర చర్చ జరిగింది. ఈ సందర్భంగా మైకందుకున్న జేడీ(ఎస్) సీనియర్ ఎమ్మెల్యే ఎంటీ కృష్ణప్ప ప్రభుత్వం ముందు ఆసక్తికర ప్రతిపాదన పెట్టారు.
ఇందులో భాగంగా... కేవలం ఒక ఏడాది కాలంలోనే కర్ణాటక సర్కార్ మూడుసార్లు ఎక్సైజ్ పన్నులు పెంచిందని.. ఇది పేదవర్గాల్లో మద్యం సేవించే వారికి చాలా భారంగా మారుతుందని అన్నారు. అలా అని ప్రజలు మద్యం మానేయాలని ఆశించలేమని.. ఆ ప్రజల డబ్బులతోనె ప్రభుత్వ పథకాలు అమలవుతున్నాయని అన్నారు. ఈ నేపథ్యంలోనే ఓ సూచన చేశారు.
ఇందులో భాగంగా... మద్యం సేవించేవారందరికీ ప్రతీవారం ఉచితంగా రెండు బాటిల్స్ ను ప్రభుత్వమే సొసైటీల ద్వారా ఎందుకివ్వకూడదు అని ప్రశ్నించారు. దాన్ని కూడా ఓ ప్రభుత్వ పథకంగా ఎందుకు అమలుచేయకూడదని అడిగారు. దీంతో.. సభలో ఒక్కసారిగా సందడి వాతావరణ కనిపించింది!
ఈ సూచన పూర్తి వెటకారంతో కూడినది అని భావించారో ఏమో కానీ... ఈ సూచనపై స్పందించిన మంత్రి కేజే జార్జ్... ఎన్నికల్లో గెల్లిచి, మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ ఉచిత లిక్కర్ పథకాలేవో మీరే చేయండి అంటూ సెటైర్ వేశారు. తమ ప్రభుత్వంలో ప్రజలు ఎక్కువగా మద్యం సేవించకుండా కట్టడిచేసేలా ప్రయత్నిస్తున్నామని అన్నారు.