పవన్ అలా సెట్ చేశారు : వారం వారం పిఠాపురం

వారం వారం పోలవరం. ఇది ఏపీ సీఎం చంద్రబాబు విధానం. మరి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి ఒక నినాదం ఉండాలి కదా.;

Update: 2025-03-27 23:30 GMT
Pawan Kalyan Sets His Sights on Pithapuram

వారం వారం పోలవరం. ఇది ఏపీ సీఎం చంద్రబాబు విధానం. మరి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి ఒక నినాదం ఉండాలి కదా. అందుకే ఆయన తన సొంత నియోజకవర్గం పిఠాపురం మీద ఫుల్ ఫోకస్ పెడుతున్నారు. పిఠాపురం జనసేన అడ్డా అని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్న తరువాత పవన్ అలా సెట్ చేయకుండా ఉంటారా అన్నదే ఇపుడు అంతా అనుకునే మాట.

పిఠాపురం నియోజకవర్గంలో అభివృద్ధిని చూపించాలని పవన్ కంకణం కట్టుకున్నారు. ఒక రోల్ మోడల్ అసెంబ్లీ నియోజకవర్గంగా దానిని తీర్చిదిద్దాలని ఆయన చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉప ముఖ్యమంత్రి పేషీకి చెందిన అధికారులు పిఠాపురంలో తాజాగా పర్యటించారు. అంతే కాదు అర్బన్ డెవలప్మెంట్ అధికారులతో వారు ప్రత్యేకంగా సమావేశం అయి అన్ని వివరాలూ తెలుసుకున్నారు.

పిఠాపురంలో ఇప్పటిదాకా జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల మీద పవన్ కళ్యాణ్ ఒక సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇందులో కీలక శాఖల అధికారులు పాల్గొన్నారు. పిఠాపురంలో ఉన్న నాలుగు పోలీస్ స్టేషన్లలో ఉన్న పరిస్థితి మీద ఇంటెలిజెన్స్ నివేదిక తీసుకోవాలని పవన్ ఆదేశించారు. కొందరు అవినీతికి పాల్పడుతున్నారని వారి వల్లనే మొత్తం పోలీస్ వ్యవస్థకే చెడ్డపేరు అని ఆయన అన్నట్లుగా చెబుతున్నారు. ఆ పరిస్థితి సరిదిద్దాలని ఆయన కోరారు

ఇక మీదట తాను ప్రతీ వారం పిఠాపురం అభివృద్ధి మీద సమగ్రమైన సమీక్ష చేస్తాను అని పవన్ అధికారులకు స్పష్టం చేయడం విశేషం. పిఠాపురంలో సాగుతున్న అభివృద్ధి మీద క్షేత్ర స్థాయిలో అధికారులు ఎప్పటికపుడు సమీక్షిస్తూ పురోగతిని తెలియచేయాలని పవన్ కోరారు.

ప్రధాన అంశాలలో పిఠాపురం ముందుండాలని ఆయన ఆకాంక్షించారు. లా అండ్ ఆర్డర్ విషయంలో పిఠాపురం బాగుండాలని పవన్ ఆదేశించారు. అలాగే వేసవి కాలంలో ఎక్కడా నీటి ఎద్దడి అన్నది రాకూడదని స్పష్టం చేశారు. అమృత్ 2.0 ద్వారా పిఠాపురంలో తాగు నీటి సమస్యలు పరిష్కరిస్తున్నామని అన్నారు. పిఠాపురం ఉప్పాడ గేటు వద్ద ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారం కనుగొనేందుకు దాదాపు అరవై కోట్ల నిధులు మంజూరు చేస్తున్నామని అన్నారు.

అదే విధంగా జాతీయ ఉపాధి హామీ పనుల కింద 40 కోట్లతో ఏకంగా 444 పనులు చేపట్టామని అన్నారు. పిఠాపురం ఆసుపత్రిని ఏరియా ఆసుపత్రిగా స్థాయిని పెంచామని అన్నారు. దీని కోసం 38.22 కోట్ల నిధులు కూడా మంజూరు అయ్యాయని పవన్ చెప్పారు.

పిఠాపురంలో అభివృద్ధి పనుల విషయంలో పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టాలని పవన్ అధికారులకు స్పష్టం చేశారు. తాను ప్రతీ వారం పూర్తి రివ్యూ చేస్తాను అని ఆయన అన్నారు. మొత్తానికి చూస్తే పిఠాపురం విషయంలో పవన్ ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నారని అంటున్నారు. దాంతో దశాబ్దాల సమస్యలు పరిష్కారం కావడం ఖాయమని స్థానికులు జనసేన నేతలు అంటున్నారు. పవన్ రానున్న నాలుగేళ్ళ కాలంలో అనుకున్న పనులు అన్నీ పూర్తి చేస్తే కనుక పిఠాపురం కచ్చితంగా జనసేన అడ్డగా మారిపోవడం ఖాయమని అంటున్నారు.

Tags:    

Similar News