క్యాబ్ డ్రైవర్ పై ఉమ్మేసిన మహిళ... షాకింగ్ రీజన్!
ఈ ఏడాది జనవరిలో ముంబై ఎయిర్ పోర్టు నుంచి వెలుగులోకి వచ్చిన ఓ వీడియో వైరల్ గా మారిన సంగతి తెలిసిందే.;

ఈ ఏడాది జనవరిలో ముంబై ఎయిర్ పోర్టు నుంచి వెలుగులోకి వచ్చిన ఓ వీడియో వైరల్ గా మారిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా... విమానం తప్పిపోయిందనే కారణంతో ఓ మహిళ ఓలా క్యాబ్ డ్రైవర్ పై దాడికి పాల్పడింది. ఎక్స్ లో షేర్ చేయబడిన ఆ వీడియోలో.. డ్రైవర్ పై కోపంతో ఊగిపోతూ అతడిని తన్నడం, కొట్టడం.. ఫ్లైట్ మిస్ అయిపోవడానికి అతనిపై నిందలు వేయడం కనిపిస్తుంది.
ఆ ఘటనలో వాస్తవానికి ఆమె ఇంటి నుంచి ఆలస్యంగా బయలుదేరినట్లు డ్రైవర్ ఆరోపించారు. అయితే.. ఆ కారణంగా ఆ మహిళ తన ఫ్లైట్ మిస్ అయితే.. ఆమె తన తప్పును అంగీకరించకుండా, దాన్ని కప్పిపుచ్చుకుంటూ క్యాబ్ డ్రైవర్ పై తన ప్రతాపాన్ని చూపింది.. ఇది అతడి నిర్లక్ష్య ఫలితం అంటూ మండిపడింది. ఈ నేపథ్యంలో తాజాగా మరో షాకింగ్ ఘటన తెరపైకి వచ్చింది.
అవును... తాజాగా ఓ మహిళ తన క్యాబ్ డ్రైవర్ పై ఉమ్మివేసిందనే విషయం నెట్టింట తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఆ మహిళను పికప్ చేసుకుని, గమ్యస్థానానికి తీసుకెళ్లడానికి అతను సుమారు ఏడు నిమిషాలు ఆలస్యం చేసినప్పుడు ఈ ఘటన జరిగిందని తెలుస్తోంది. ఈ సమయంలో ఆమెకు రెండు ఆప్షన్స్ ఉండగా.. ఊహించని మూడో ఆప్షన్ ఎంచుకున్నట్లు చెబుతున్నారు.
ఇందులో భాగంగా.. ఆలస్యంగా వచ్చినందుకు ఆ బుక్కింగ్ ని తిరస్కరించడం.. లేదా రద్దు చేయడం కాకుండా ఆ మహిళ సదరు క్యాబ్ డ్రైవర్ ను దుర్భాషలాడటం ప్రారంభించారు. అయితే.. ఆ సమయంలో డ్రైవర్ ప్రశాంతంగా ఉండగా.. క్యాబ్ దిగే ముందు ఆమె సదరు క్యాబ్ డ్రైవర్ పై ఉమ్మి వేసింది! దీంతో.. ఈ విషయం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.