వైసీపీ చూపు అటే : ఓడలు బళ్ళు అవడం అంటే ఇదేనేమో !

ఇపుడు మాత్రం వారు వస్తే వీరు వీరు వస్తే వారు కేసులు పెట్టించుకుని కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు.;

Update: 2025-03-27 22:30 GMT
YSRCP Leaders Navigating Legal Hurdles

కన్నీరు పెట్టకుండా జీవితం అనే కడలిని దాటలేమని పెద్దలు చెబుతారు. రాజకీయ నాయకుల విషయానికి వస్తే కోర్టు మెట్లు ఎక్కకుండా రాజకీయ జీవితాలను కొనసాగించలేరు అన్న పరిస్థితి వచ్చేసింది. గతంలో అయితే ప్రజా సమస్యల మీద న్యాయస్థానాల చుట్టూ తిరిగేవారు. ఇపుడు మాత్రం వారు వస్తే వీరు వీరు వస్తే వారు కేసులు పెట్టించుకుని కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు.

గత అయిదేళ్ళూ టీడీపీ నేతల వంతు అయితే ఇపుడు సీన్ రివర్స్ అయింది వైసీపీ మాజీ మంత్రులు నేతల ముంగిటి దాకా వ్యవహారం వచ్చేసింది. దాంతో ముందస్తు బెయిల్ పిటిషన్లు వరసబెట్టి పెట్టుకుంటున్నారు. లిక్కర్ స్కాం తో తనకు సంబంధం లేదని ఎంపీ మిధున్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ పెట్టుకుంటే ఆయనకు కొంత ఊరట లభించింది.

ఇక నెల్లూరు జిల్లాకు చెందిన సీనియర్ నేత మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి మీద కేసులు పడుతున్నాయి. దాంతో ఆయనను అరెస్ట్ చేస్తారు అన్న ప్రచారం ముమ్మరంగా సాగుతోది. దాంతో ఆయన కూడా ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేశారు. అదే విధంగా పల్నాడు జిల్లాకు చెందిన మాజీ మంత్రి విడదల రజనీ కూడా తన మీద ఉన్న కేసుల విషయంలో అరెస్టులు ఉండొచ్చు అన్న ఆలోచనతో ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేశారు.

ఇంకా ఎంత మంది ఈ విధంగా వేస్తారో తెలియదు కానీ గత తొమ్మిది నెలలుగా చూస్తే చాలా మంది ముందస్తు బెయిల్ పిటిషన్లు వేశారు. అందులో కొంతమంది ఊరట పొందారు. మరికొందరు అరెస్ట్ అయ్యారు. కొందరు జైలులో ఉన్నారు. మరి కొందరు బెయిల్ మీద బయటకు వస్తున్నారు.

మాజీ ఎంపీ నందిగం సురేష్ అయితే నెలల తరబడి జైలులో ఉండి ఈ మధ్యనే బెయిల్ మీద వచ్చారు. మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్ట్ అయి జైలులో ఉన్నారు. ఆయన బెయిల్ కి దాఖలు చేస్తే కోర్టు తాజాగా కొట్టివేసింది. దాంతో ఈ ఫైర్ బ్రాండ్ కి తీవ్ర నిరాశ ఎదురైంది.

ఇదిలా ఉంటే వైసీపీలో చాలా మంది తృతీయ శ్రేణి నేతలు దాని కంటే ముందు సోషల్ మీడియా యాక్టివిస్టులు అరెస్ట్ అయ్యారు, ఆ తరువాత ద్వితీయ శ్రేణి నేతల దాకా కేసుల వ్యవహారం వచ్చింది. ఇపుడు చూస్తే సీనియర్ నేతలు మాజీ మంత్రుల వరకూ వస్తోంది అని అంటున్నారు.

అయితే చాలా మంది వైసీపీ నేతలు మాత్రం కేసులు అరెస్టులతో ఇబ్బందులే పడుతున్నారు. వైసీపీ లీగల్ టైంగట్టిగా ఫైట్ చేయడం లేదన్న అసంతృప్తి అయితే పార్టీలో ఉందని అంటున్నారు. బిగ్ షాట్స్ మంత్రులుగా చేసిన వారు తమ న్యాయ వ్యవహారాలను వారే చూసుకుంటున్నారు. కానీ ద్వితీయ తృతీయ శ్రేణి నేతలు మాత్రం నలిగిపోతున్నారు. ఇక సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉన్న వారు అయితే వారి బాధలు అడగొద్దు అన్నట్లుగానే ఉంది.

ఈ రకమైన పరిస్థితి వస్తుందని ఊహించని వారు అడ్డంగా బుక్ అవుతున్నారు. వారి విషయంలో ఏమి జరుగుతుందో కూడా ఎవరికీ తెలియడంలేదనే అంటున్నారు. మొత్తం మీద వైసీపీలో ఇపుడు కేసులు అరెస్టులు బెయిల్ వంటి వాటి విషయంలోనే హాట్ హాట్ గా చర్చ సాగుతోంది. బయటకు ఎలా ఉన్న ఒక విధమైన భయాలు అయితే ఫ్యాన్ పార్టీ నేతలలో ఉన్నాయని అంటున్నారు. అధినాయకత్వం ఎంతగా ధైర్యం నూరిపోస్తున్నా కూడా ఫేస్ చేసే వారికే అసలు బాధలు తెలుస్తాయని అంటున్నారు. ఓడలు బళ్ళు అవడం అంటే ఇదేనేమో అని వాపోతున్న వారి లిస్ట్ ఎక్కువగానే ఉందిట.

Tags:    

Similar News