‘ఇప్పుడు మీరు ట్రైలర్ చూపిస్తే.. పవర్లోకి వచ్చాక సినిమా చూపిస్తాం’
పల్నాడు జిల్లా వినుకొండలో మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు ఆఫీసులో విలేకరులతో మాట్లాడారు.;

ఐదేళ్ల వైసీపీ పాలనలో రూల్ ఆఫ్ లా నడిచినట్లుగా వ్యాఖ్యానించారు వైసీపీ లీగల్ సెల్ నాయకుడు.. మాజీ అదనపు అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకరరెడ్డి. ఈ సందర్భంగా ఆయన అధికార పార్టీపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. హెచ్చరిక స్వరంతో వార్నింగ్ ఇచ్చారు. రాష్ట్రంలో అధికార పార్టీ వారు ఇప్పుడు ట్రైలర్ చూపిస్తే.. ఎన్నికల తర్వాత తాము అధికారంలోకి వచ్చిన తర్వాత సినిమా చూపిస్తామననారు.
పల్నాడు జిల్లా వినుకొండలో మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు ఆఫీసులో విలేకరులతో మాట్లాడారు. తమ పార్టీ వారిని ఇప్పుడు అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం వేధిస్తుందన్నారు. ప్రభుత్వ పాలనపై వ్యంగ్యంగా మాట్లాడితే అదెలా నేరమవుతుందని ప్రశ్నించారు.
తమ నేతల్ని..కార్యకర్తల్ని కూటమి ప్రభుత్వం వేధింపులకు గురి చేస్తుందన్న ఆయన.. ఈవూరు మండలం బొమ్మరాజు పల్లెకు చెందిన నాగేశ్వరరావు ఉదంతాన్ని ప్రస్తావించారు. అతను.. ప్రభుత్వ పాలనపై వ్యంగ్యంగా వ్యాఖ్యలు చేస్తే.. నేరం ఎలా అవుతుందని ప్రశ్నించారు. అతడ్ని పోలీసులు తీసుకెళితే తాను హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ వేసినట్లుగా పేర్కొన్నారు. మరోవైపు వినుకొండ మండలం పరిధిలో జరిగిన మహిళ హత్య కేసు ఏడాదిగా పోలీసులు తేల్చటం లేదని విమర్శించారు. పోలీసుల తీరును ఆయన తప్పు పట్టారు.