నాగబాబు ఆగాల్సిందే ?

ఏపీ మంత్రివర్గం ఏర్పాటు అయి ఏప్రిల్ 12 నాటికి పది నెలలు నిండుతాయి. పాలనాపరంగా చూసుకుంటే అది తక్కువ సమయమే.;

Update: 2025-03-21 00:30 GMT

ఏపీ మంత్రివర్గం ఏర్పాటు అయి ఏప్రిల్ 12 నాటికి పది నెలలు నిండుతాయి. పాలనాపరంగా చూసుకుంటే అది తక్కువ సమయమే. ఎందుకంటే తమ శాఖల మీద మంత్రులు ఇపుడే పట్టు సాధించారు. రానున్న కాలంలో వారి పనితీరు ఇంకా చూపించాల్సి ఉంది. అందువల్ల మంత్రులను రీషఫలింగ్ పేరుతో ఎవరూ ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయరు.

ఏపీలో చూస్తే చంద్రబాబు వంటి అనుభవశాలి అధికారంలో ఉన్నారు. ఆయన ఒక నిర్ణయం తీసుకోవాలీ అంటే ఎన్నో ఆలోచిస్తారు. ఆషామాషీగా బాబు డెసిషన్స్ ఉండవని అందరికీ తెలుసు. ఆయన మంత్రులకు దిశా నిర్దేశం చేస్తూ పనితీరు మెరుగుపరచుకోవాలని సూచిస్తారు తప్పించి వారిని ఇప్పటికిప్పుడు మార్చే ఆలోచన ఏదీ చేయరు అని అంటున్నారు.

గతంలో టీడీపీ ట్రాక్ రికార్డు చూసిన మొదట మూడేళ్ళూ మంత్రివర్గం అలాగే ఉంచి చివరి రెండేళ్ళలో ఏమైనా మార్పులు చేర్పులూ చేపడతారు. అది 2017లో చేసి కొంతమందిని తీసుకుని కొందరికి శాఖలు మార్చారు. ఇక ఇపుడు చూసినా అదే విధానం ఆయన కొనసాగిస్తారు అని అంటున్నారు.

అంటే 2024లో అధికారం చేపట్టిన కూటమి ప్రభుత్వంలో ఏమైనా మార్పులు చేర్పులూ చేయాలీ అంటే 2027 జూన్ దాకా ఆగాల్సిందే అని అంటున్నారు. అలా ఆగడానికి మరో కారణం కూడా ఉంది అని అంటున్నారు. 2027లో పెద్ద ఎత్తున ఎమ్మెల్సీ పదవులు ఖాళీ అవుతాయి. అవన్నీ కూటమికే చెందుతాయి. అలా ఎమ్మెల్యేలు కాని వారు హామీలు ఇచ్చిన వారికి ముందు చట్ట సభలలో చోటిచ్చి వారిలో అర్హులకు మంత్రి పదవులు ఇచ్చేందుకు వీలుగా అప్పుడు ఏమైనా మార్పులు చేపడతారు అని అంటున్నారు.

ప్రస్తుతానికి అయితే ఇదే మంత్రివర్గం కొనసాగుతుంది అని అంటున్నారు. ఇక సడెన్ గా ఎవరిని అయినా తీసుకోవాల్సిన ప్రత్యేక పరిస్థితులు అయితే లేవని అంటున్నారు. నాగబాబుకు మంత్రి పదవి హామీ అయితే ఉంది. కానీ ఎపుడు తీసుకోవాలన్నది ముఖ్యమంత్రి విచక్షణ మీదనే ఆధారపడి ఉంటుందని అంటున్నారు.

అదే సమయంలో మంత్రివర్గంలో మార్పులు జరిగితే ఆ విషయంలో మిగిలిన వారి నుంచి అసంతృప్తులు లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా సీఎం గా ఆయన మీద ఉంది. ఇక నాగబాబు ఒక్కరికే మంత్రి పదవి ఇస్తే బీజేపీకి టీడీపీలోని ఆశావహులకు కూడా ఒకింత అసంతృప్తితో పాటు రాజకీయ అలజడి ఎంతో కొంత రేగే అవకాశం ఉందని అంటున్నారు.

దాంతో పాటు చట్టసభలకు నాగబాబు కొత్త కాబట్టి కొంతకాలం ఆయన ఎమ్మెల్సీగా తన పనితీరు కనబరచిన తరువాత మంత్రి పదవి ఇస్తే రాణిస్తారు అన్న ఆలోచన కూడా ఉండొచ్చు అని అంటున్నారు. ఎమ్మెల్సీ పదవి పిఠాపురం వర్మకు 2027లో ఇస్తామని ఒక హామీ అయితే ఇపుడు ఉంది. దాంతో ఆయనతో పాటు మరికొందరికి ఆ హామీని తీర్చి వారిని కూడా చట్ట సభలకు తెస్తే ఆ మీదట నాగబాబు సహా ఎవరికి ఏ పదవి ఇచ్చినా ఇబ్బంది ఉండదని కూడా భావిస్తున్నారు అని అంటున్నారు.

మొత్తానికి చూస్తే కనుక నాగబాబు ఎమ్మెల్సీ అయ్యారు. ఆయన ఈ నెల 30న బాధ్యతలు స్వీకరిస్తారు. ఈ కొత్త హోదాలో ఆయన ముందుకు సాగాల్సి ఉంటుంది. మంత్రి పదవి అంటే మాత్రం కొంతకాలం ఆగాల్సిందే అన్నది ప్రచారంలో ఉంది. చూడాలి మరి ఏమి జరుగుతుందో.

Tags:    

Similar News