రూ.118 కోట్లు... ఆధునిక భారత చరిత్రలో అత్యంత ఖరీదైన కళాకృతి!

ప్రముఖ భారతీయ చిత్రకారుడు ఎంఎఫ్ హుస్సేన్ గీసిన ఓ అద్భుతమైన పెయింటింగ్ అత్యంత అరుదైన రికార్డును సృష్టించింది.;

Update: 2025-03-20 21:30 GMT

ప్రముఖ భారతీయ చిత్రకారుడు ఎంఎఫ్ హుస్సేన్ గీసిన ఓ అద్భుతమైన పెయింటింగ్ అత్యంత అరుదైన రికార్డును సృష్టించింది. ప్రముఖ వేలం సంస్థ "క్రిస్టీ".. న్యూయార్క్ లో తాజాగా నిర్వహించిన వేలంలో ఎంఎఫ్ హుస్సేన్ గీసిన "అన్ టైటిల్డ్ (గ్రామ్ యాత్ర)" కళాఖండం ఎవరూ ఊహించని స్థాయిలో అన్నట్లుగా రికార్డ్ ధర పలికి, చరిత్ర సృష్టించింది.

అవును... ఎంఎఫ్ హుస్సేన్ పెయింటింగ్ లలో అత్యంత గణనీయమైన, ముఖ్యమైన పెయింటింగ్ గా పేరొందిన అన్ టైటిల్డ్ (గ్రామ్ యాత్ర) పెయింటింగ్ ను తాజాగా న్యూయార్క్ లో వేలం వేశారు. ఈ వేలంలో ఈ అద్భుత కళాఖండం 13.8 మిలియన్ డాలర్ లకు అమ్ముడైపోయింది. అంటే.. భారత కరెన్సీలో సుమారు 118 కోట్ల రూపాయలన్నమాట.

దీంతో... ఆధునిక భారతదేశ చరిత్రలో అత్యంత ఖరీదైన కళాకృతిగా ఈ అన్ టైటిల్డ్ (గ్రామ్ యాత్ర) పెయింటింగ్ సరికొత్త రికార్డ్ సృష్టించింది.

ఈ అన్ టైటిల్డ్ (గ్రామ్ యాత్ర) కళాఖండం... సుమారు 14 అడుగుల విస్తీర్ణంలో ఉంటుంది. ఈ కాన్వాస్ లో మొత్తం 13 ప్రత్యేకమైన చిత్రాలు ఉంటాయి. ఈ అద్భుత కళాఖండం కొత్త రికార్డ్ సృష్టించడంలో భాగస్వామ్యం అయినందుకు చాలా సంతోషంగా ఉందని క్రిస్టీ సౌత్ ఏషియన్ మోడ్రన్ అండ్ కాంటెంపరరీ ఆర్ట్ అధిపతి నిషాద్ అవారి తెలిపారు.

కాగా... ప్రముఖ ఆర్టిస్ట్ అమృతా షెర్గిల్ 1937లో గీసిన "ది స్టోరీ టెల్లర్" పెయింటింగ్ ను 2023లో వేలం వేయగా.. అది రూ.61.8 కోట్ల ధర పలికింది. దీంతో... అత్యంత ఖరీదైన భారతీయ కళాకృతిగా ఆ పెయింటింగే ఇప్పటివరకూ కొనసాగింది. అయితే... తాజాగా ఎం.ఎఫ్. హుస్సేన్ పెయింటింగ్ అంతకు రెట్టింపు ధర పలకడం విశేషం.

ఈ సందర్భంగా క్రిస్టీ సంస్థ... ఎంఎఫ్ హుస్సేన్ "అన్ టైటిల్డ్ (గ్రామ్ యాత్ర) న్యూయార్క్ లో జరిగిన సౌత్ ఆసియన్ మోడరన్ + కాంటెంపరరీ ఇండియన్ ఆర్ట్ సేల్ సందర్భంగా 13,750,000 యూఎస్ డాలర్లు సాధించి.. గత కళాకారుల రికార్డులను బద్దలు కొట్టింది.. ఇది ప్రపంచంలో ఏ ఆధునిక భారతీయ కళాకృతికి లభించని అత్యధిక ధర అని తెలిపింది.

Tags:    

Similar News