కార్యకర్త హత్య ఎఫెక్ట్.. అన్నమయ్య జిల్లా మొత్తం ప్రక్షాళన

కూటమి ప్రభుత్వం కొరడా ఝుళిపించింది. ఒక్క దెబ్బతో అన్నమయ్య జిల్లాలో ఏకంగా 382 మందిని బదిలీ చేసింది.;

Update: 2025-03-21 10:30 GMT
AP Govt Transfer Annamayya Dist Police Officers

కూటమి ప్రభుత్వం కొరడా ఝుళిపించింది. ఒక్క దెబ్బతో అన్నమయ్య జిల్లాలో ఏకంగా 382 మందిని బదిలీ చేసింది. పుంగనూరులో టీడీపీ కార్యకర్త రామక్రిష్ణ హత్యతో మేల్కొన్న ప్రభుత్వం పోలీసుశాఖలో ప్రక్షాళనకు దిగింది. ప్రధానంగా వైసీపీకి చెందిన మాజీ మంత్రి పెద్దిరెడ్డికి అనుకూలంగా పనిచేస్తున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న పలువురు పోలీసులకు షాక్ ఇచ్చింది. అధికారంలోకి వచ్చాక కొందరిపై సస్పెన్షన్ వేటు వేయగా, మరికొందరిని అప్రధాన పోస్టుల్లో నియమించింది. అయితే ఇప్పటికీ ఇంకొందరు వైసీపీకి అనుకూలంగా పనిచేస్తున్నారని కార్యకర్తల నుంచి విమర్శలు వస్తుండటంతో ప్రభుత్వ పెద్దలు పోలీసు బదిలీలను సీరియస్ గా తీసుకున్నట్లు చెబుతున్నారు.

పుంగనూరులో వైసీపీ కార్యకర్త చేతిలో హత్యకు గురైన రామక్రిష్ణ ఉదంతం రాష్ట్రంలో తీవ్ర చర్చకు దారితీసింది. పార్టీ అధికారంలో ఉన్నా కార్యకర్తల బలిదానాలు ఆగవా? అంటూ టీడీపీ సోషల్ మీడియా అధిష్టానంపై దుమ్మెత్తిపోయడంతో ప్రభుత్వ పెద్దలు ఆగమేఘాల మీద రంగంలోకి దిగారు. అన్నమయ్య జిల్లాలో వైసీపీకి అనుకూలంగా చెబుతున్న పోలీసులతోపాటు టీడీపీ నేతల మాటలను లెక్కచేయని పోలీసులకు స్థాన చలనం కల్పించారు. జిల్లాలో మొత్తం 228 మంది కానిస్టేబుళ్లు, 123 మంది హెడ్ కానిస్టేబుళ్లు, 41 మంది ఏఎస్సైలను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. అదేవిధంగా ఎస్ఐ, సీఐ, డీఎస్పీ స్థాయి అధికారుల బదిలీలు త్వరలో జరగుతాయని చెబుతున్నారు.

పుంగనూరులో తన ప్రాణాలకు హాని ఉందని హతుడు రామక్రిష్ణ పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆరోపణలు వినిపించాయి. దీంతో హత్య జరిగిన తర్వాత అక్కడి పోలీసు అధికారులను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఇక ఆ తర్వాత జిల్లా పోలీసు శాఖపై పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ప్రధానంగా వైసీపీ నేత పెద్దిరెడ్డికి అనుకూలంగా పనిచేస్తున్న పోలీసులే పుంగనూరు, తంబళ్లపల్లె, పలమనేరు, మదనపల్లె వంటి నియోజకవర్గాల్లో పనిచేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆయా నియోజకవర్గాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యే మాటలను కూడా పోలీసు అధికారులు పట్టించుకోవడం లేదని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లారంటున్నారు.

కార్యకర్త రామక్రిష్ణ హత్య తర్వాతైనా తమ మాట ప్రకారం పోలీసులను బదిలీ చేయకపోతే భవిష్యత్తులో మరిన్న ఇబ్బందులు ఎదురయ్యే ప్రమాదం ఉందని జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు హెచ్చరించడంతో ప్రభుత్వం ఆగమేఘాలపై స్పందించిందని చెబుతున్నారు. వాస్తవానికి కొత్తగా ఏర్పడిన అన్నమయ్య జిల్లాలో అటు ఉమ్మడి కడప, ఇటు ఉమ్మడి చిత్తూరు జిల్లా నేతల ప్రభావమెక్కువ. మాజీ సీఎం జగన్, సీనియర్ నేత పెద్దిరెడ్డికి అనుకూలంగా వ్యవహరించేవారిని గత ఐదేళ్లలో అన్నమయ్య జిల్లాలోని పోలీసుస్టేషన్లలో నింపేశారంటున్నారు. దీంతో కూటమి ప్రభుత్వంలోనూ చీమ చిటుక్కుమన్నా, వైసీపీ నేతలకు సమాచారం చేరిపోతోందని అంటున్నారు. అదే సమయంలో టీడీపీ కార్యకర్తల నుంచి ఫిర్యాదులు వస్తే రాజీ చేసేలా ప్రయత్నాలు జరుగుతున్నాయంటున్నారు. దీంతో తమ మాట చెల్లుబాటు కావడం లేదని టీడీపీ కేడర్ ఆగ్రహం చెందుతోంది. ఇదే సమయంలో ఓ కార్యకర్త ప్రాణాలు కోల్పోవడంతో ప్రభుత్వం సీరియస్ అయింది. దీంతో ఒకేసారి బదిలీ వేటు వేసిందని అంటున్నారు.

Tags:    

Similar News