పురందేశ్వరికి స్థాన చలనం.. ఏపీలో కీలక మార్పు?
ఈ నేపథ్యంలోనే పురందేశ్వరికి ఢిల్లీలో పదవి ఖాయమన్నది రాష్ట్ర పార్టీ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది.;

ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు, రాజమండ్రి పార్లమెంటు సభ్యురాలు దగ్గుబాటి పురందేశ్వరికి స్థాన చలనం కలగనుందా? అంటే.. బీజేపీ వర్గాల నుంచి ఔననే సమాధానమే వస్తోంది. ప్రస్తుతం జరుగుతున్న చర్చల్లో కేంద్రంలోని మంత్రివర్గంలోకి పురందేశ్వరికి అవకాశం కల్పించనున్నట్టు సమాచారం. ప్రస్తుతం మోడీ మంత్రి వర్గంలో కమ్మలకు ప్రాధాన్యం ఇవ్వాలన్న చర్చ గత కొన్నాళ్లుగా ఉంది. తద్వారా.. ఆసామాజిక వర్గాన్ని ఆకర్షించాలన్నది కమల నాథుల ప్రయత్నంగా ఉంది.
ఈ నేపథ్యంలోనే పురందేశ్వరికి ఢిల్లీలో పదవి ఖాయమన్నది రాష్ట్ర పార్టీ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. దీంతో ప్రస్తుతం ఆమె చూస్తున్న ఏపీ బీజేపీ చీఫ్ పదవి ఖాళీ కానుంది. వాస్తవానికి రెండేళ్లపైగానే పురందేశ్వరి ఈ పదవిలో ఉన్నారు. నిబంధనల మేరకు.. ఇప్పుడు ఆ పదవిని మార్చే దిశగా అడుగులు పడుతు న్నాయి. దీంతో ఏపీ చీఫ్ పదవి కోసం సామాజిక వర్గాల వారీగా నాయకులు కర్చీఫ్‌లు వేసేందుకు రెడీ అవుతున్నారు.
ఇప్పటికి వరకు ప్రాతినిధ్యం వహించిన కోస్తా జిల్లాల నుంచి కాకుండా.. రాయలసీమ లేక ఉత్తరాంధ్ర నాయకులకు అవకాశం ఇవ్వాలని పార్టీలో బలంగా వినిపిస్తున్న డిమాండ్. ఇదేసమయంలో సామాజిక వర్గాల వారీగా కూడా బలమైన కసరత్తే జరుగుతోంది. రాయలసీమలో బలిజ సామాజిక వర్గం నుంచి కోలా ఆనంద్, రెడ్డి సామాజిక వర్గం నుంచి చదిపిరాళ్ళ ఆదినారాయణ రెడ్డి(జమ్మలమడుగు ఎమ్మెల్యే)లు బలంగా ప్రయత్నాలు చేస్తున్నారు.
ఇదే సమయంలో ఉత్తరాంధ్ర బీసీ నేత, మాజీ ఎమ్మెల్సీ మాధవ్ పేరుకూడా పరిశీలనలో ఉన్నట్టు పార్టీ అంతర్గత సమాచారం. ఇవన్నీ కాదని... ఆర్ధిక పరిపుష్ఠి ఉన్న విజయవాడ వెస్ట్ ఎమ్మెల్యే కమ్మ వర్గానికి చెందిన సుజనా చౌదరి, అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ లలో ఒకరికి ఈసారి అవకాశం రావచ్చని మరో వాదన కూడా హల్చల్ చేస్తోంది. మరోవైపు.. ఆర్ ఎస్ ఎస్ నేపథ్యం ఉండడంతోపాటు రాష్ట్ర, కేంద్ర స్థాయి బీజేపీలో అత్యంత ప్రభావశీలి అయిన సోము వీర్రాజు కూడా.. తన ప్రయత్నాలు ముమ్మరం చేశారు. గతంలో ఈయన ఒకసారి ఏపీ బీజేపీకి చీఫ్‌గా వ్యవహరించిన విషయం తెలిసిందే.