బీజేపీలో పదవుల గ్యారెంటీ ఆఫర్.. ఇదేదో కొత్తగా ఉందే..?
ప్రస్తుతం ఏపీలో అధ్యక్షురాలు పురందేశ్వరి రూపంలో సమర్థనాయకత్వం ఉందని ఢిల్లీ పెద్దలు భావిస్తున్నారు.;

ఏపీలో బీజేపీ స్పీడు పెంచాలని నిర్ణయించింది. కొత్త చేరికలపై ఫోకస్ చేయాలని రాష్ట్ర నాయకత్వానికి దిశానిర్దేశం చేస్తోంది. కూటమిలో మిగిలిన పార్టీలకు దీటుగా కమలంలో కొత్త చేరికలు ఉండేలా ప్రణాళిక రచించాలని అవసరమైతే హైకమాండ్ పెద్దల దృష్టికి తేవాలని సూచిస్తోందని సమాచారం. ప్రస్తుతం టీడీపీ, జనసేనతోపాటు కూటమిగా అధికారంలో కొనసాగుతున్న బీజేపీ.. చేరికల విషయంలో ఆ రెండు పార్టీలకన్నా వెనకబడుతోందని అధిష్టానం గుర్తించింది. రాష్ట్రంలో పార్టీ బలోపేతానికి ఇదే సరైన సమయంగా భావిస్తున్న బీజేపీ.. వైసీపీ నేతలను ఆకర్షించాలని ప్లాన్ చేస్తున్నట్లు చెబుతున్నారు.
కేంద్రంలో 11 ఏళ్లుగా అధికారంలో కొనసాగుతున్నా, ఏపీలో 2014-18 మధ్య అధికారం, ఇప్పుడు మళ్లీ సర్కారులో భాగస్వామ్యం ఉన్నా బీజేపీ మాత్రం ఏపీలో పట్టు సాధించలేకపోతుందనే అభిప్రాయం ఉంది. ప్రస్తుతం ఆ పార్టీకి 8 మంది శాసనసభ్యులు, ముగ్గురు పార్లమెంటు సభ్యులు ఉన్నారు. అయితే పొత్తు లేకుండా విడిగా పోటీ చేస్తే ఇందులో ఒక్కస్థానంలో గెలుపు కూడా డౌటేనంటున్నారు. ఈ పరిస్థితి భవిష్యత్తులో తలెత్తకూడదంటే ఇప్పుడు క్షేత్రస్థాయి నుంచి పార్టీని నిర్మించుకోవాలని కమలనాథులు భావిస్తున్నారు.
ప్రస్తుతం ఏపీలో అధ్యక్షురాలు పురందేశ్వరి రూపంలో సమర్థనాయకత్వం ఉందని ఢిల్లీ పెద్దలు భావిస్తున్నారు. అయితే ఆమెకు ఆర్ఎస్ఎస్ బ్యాక్ గ్రౌండ్ లేకపోవడం మైనస్ గా భావిస్తున్నారు. బీజేపీ మార్కు రాజకీయం చేయడంలో పురందేశ్వరి కాస్త తడబాటు ఎదుర్కొంటున్నారనే అభిప్రాయం ఉంది. అందుకే మాజీ అధ్యక్షుడు సోము వీర్రాజుకు వెతికి మరీ ఎమ్మెల్సీ చేశారంటున్నారు. ఆర్ఎస్ఎస్ భావజాలం వ్యాప్తి చేసి పార్టీ సిద్ధాంతాల మేరకు ఏపీలో విస్తరణకు అడుగులు వేయాలని కమలం పెద్దలు స్కెచ్ వేస్తున్నారు. అందుకే పురందేశ్వరికి తోడుగా ఆర్ఎస్ఎస్ నేతలనూ రంగంలోకి దింపాలని చూస్తున్నారని అంటున్నారు.
రాష్ట్రంలో బీజేపీని విస్తరించాలంటే ఇదే తగిన సమయంగా ఆ పార్టీ పెద్దలు భావిస్తున్నట్లు చెబుతున్నారు. కేంద్ర, రాష్ట్రాల్లో అధికారంలో ఉండటంతో ఇతర పార్టీల నుంచి నేతలను ఆకర్షించాలని చూస్తున్నారంటున్నారు. ఏపీలో ప్రస్తుతం టీడీపీ, వైసీపీ, జనసేన పార్టీలు బలమైన స్థానంలో ఉన్నాయి. కాంగ్రెస్, వామపక్షాలు కూడా కొందరు నేతలు ఉన్నా, వారి ప్రభావం చెప్పుకోదగ్గ స్థాయిలో లేదంటున్నారు. అంతేకాకుండా టీడీపీ, వైసీపీ, జనసేనలకు ప్రత్యామ్నాయంగా ఈ పార్టీలు ఎదిగే పరిస్థితి ఇప్పట్లో కనిపించడం లేదనే విశ్లేషణలు ఉన్నాయి. దీంతో ప్రభుత్వంలో కొనసాగుతూనే బలమైన ప్రత్యామ్నాయంగా తెలంగాణలో మాదిరిగా ఏపీలోనూ ఎదగాలని కమలం పెద్దలు ప్రణాళికలు వేస్తున్నారు.
దీనికోసం ప్రతిపక్షం వైసీపీ నేతలపై వల వేస్తున్నారు. ప్రస్తుతం వైసీపీ బలహీన పడుతోందని కమలం పెద్దలు అనుమానిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత వైసీపీ నుంచి పెద్ద ఎత్తున వలసలు జరుగుతుండటం కమలనాథులు గమనిస్తున్నారు. ఇలా పార్టీని వీడిన వారు ఎక్కువగా టీడీపీ, జనసేనలకు ప్రాధాన్యమివ్వడాన్ని కూడా బీజేపీ సీరియస్ గా తీసుకుంటోందని చెబుతున్నారు. కొత్త నేతలు ఎందుకు బీజేపీలో చేరడం లేదని అంతర్మథనం చెందుతోందని అంటున్నారు. అయితే కొత్తగా పార్టీలో చేరేవారు ఏదో ఒక అధికారిక పదవి ఆశిస్తున్నారని, టీడీపీ, జనసేనల్లో చేరితే ఒకటి రెండేళ్ల తర్వాతైనా ఏదైనా అవకాశం వస్తుందని భావనలో నేతలు ఉన్నారని కమలం పెద్దలకు సమాచారం వెళ్లిందని అంటున్నారు.
దీంతో ఏపీపై స్పెషల్ ప్లాన్ చేయాలని బీజేపీ భావిస్తోందని చెబుతున్నారు. వైసీపీ నుంచి బీజేపీలో చేరిన వారికి పదవులు గ్యారెంటీ ఆఫర్ ప్రకటించాలని అనుకుంటున్నారని సమాచారం. ప్రస్తుతం పదవుల్లో ఉన్నవారు చేరితే తిరిగి అవే పదవులు కట్టబెట్టేలా కూటమిలో ఒప్పందం చేసుకుంటామని, ఈ విషయంలో సీఎం చంద్రబాబును ఒప్పిస్తామని ఆఫర్ చేస్తున్నట్లు చెబుతున్నారు. ఒకవేళ అలా కుదరకపోతే కేంద్రంలో పదవులు ఇస్తామని ఆశపెడుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరితోపాటు ఎంపీ సీఎం రమేశ్, ఎమ్మెల్యే సుజనా చౌదరి, ఎమ్మెల్సీ సోము వీర్రాజుకు కొత్త చేరికల బాధ్యతలు అప్పగించాలని బీజేపీ భావిస్తోందని చెబుతున్నారు. మరి కమలం పార్టీ ఆకర్ష్ ఎంతవరకు పనిచేస్తోందో చూడాల్సివుంది.