పోలీసు విచారణలో విష్ణుప్రియ.. రీతూ చౌదరిలు ఏం చెప్పారు?

పోలీసుల నోటీసులు అందుకున్న టీవీ యాంకర్ విష్ణుప్రియ.. సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్ రీతూచౌదరిలు వేర్వేరుగా పంజాగుట్ట పోలీసుల ఎదుట హాజరయ్యారు.;

Update: 2025-03-21 04:06 GMT
పోలీసు విచారణలో విష్ణుప్రియ.. రీతూ చౌదరిలు ఏం చెప్పారు?

అనూహ్యంగా తెర మీదకు వచ్చిన ఆన్ లైన్ బెట్టింగ్ యాప్ లకు ప్రముఖులు ప్రచార ఉదంతం పెను సంచలనానికి తెర తీయటమే కాదు షాకింగ్ నిజాలను బయటపెడుతోంది. సినీ రంగానికి చెందిన చిత్ర ప్రముఖులు మొదలు సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్ల వరకు ఎవరిని వదిలిపెట్టని ఈ బెట్టింగ్ యాప్ లపై హైదరాబాద్ పోలీసులు సీరియస్ గా ఫోకస్ చేస్తున్నారు. ఈ బెట్టింగ్ యాప్ ల బారిన పడిన పలువురు ఆత్మహత్యలు చేసుకుంటున్న నేపథ్యంలో.. తమ వరకు వచ్చిన ప్రముఖులకు నోటీసులు ఇచ్చారు పంజాగుట్ట పోలీసులు. ఒక్కసారి ఈ నోటీసుల వార్త మీడియాలో వచ్చిన తర్వాత నుంచి ఇప్పటివరకు వీరికి ప్రచారకర్తలుగా వ్యవహరించిన ప్రముఖులు మొదలు.. హైదరాబాద్ మెట్రో లాంటి సంస్థలు సైతం ప్రచార మాధ్యమాలుగా నిలవటం ఇప్పుడు మరో సంచలనంగా మారింది.

పోలీసుల నోటీసులు అందుకున్న టీవీ యాంకర్ విష్ణుప్రియ.. సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్ రీతూచౌదరిలు వేర్వేరుగా పంజాగుట్ట పోలీసుల ఎదుట హాజరయ్యారు. ఈ సందర్భంగా వారిని పోలీసులు సుదీర్ఘంగా విచారించారు. దాదాపు 11 గంటల పాటు సాగిన విచారణలో తొలుత వేర్వేరుగా.. ఆ తర్వాత ఇరువురిని కలిపి ప్రశ్నించినట్లుగా తెలుస్తోంది. విష్ణుప్రియను 11 గంటలు.. రీతూచౌదరిలను ఐదున్నర గంటల పాటు విచారించారు. బెట్టింగ్ యాప్ లకు ప్రచారం చేయాలని ఎవరు సంప్రదించారు? ఎంత పారితోషికం ఇచ్చారు? ప్రచారానికి ఒప్పందం ఎప్పుడు? ఎలా జరిగింది? ఏయే సోషల్ మీడియా వేదికలపైన ప్రచారం సాగింది? లాంటటి కోణంలో ఎక్కువగా విచారణ జరిగినట్లుగా తెలుస్తోంది.

పోలీసుల విచారణలో తాను మూడు యాప్ లకు ప్రచారం చేసినట్లుగా విష్ణుప్రియ ఒప్పుకోగా.. పోలీసులు ఆమె మొత్తం 15 యాప్ లకు ప్రచారం చేసినట్లుగా పేర్కొన్నట్లు సమాచారం. అయితే.. అవేమీ తనకు తెలీవని.. తన ప్రచార ఒప్పంద వ్యవహారాలన్నీ తన మేనేజర్ చూసుకుంటారని బదులిచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ ఇరువురి బ్యాంకు లావాదేవీలు.. బెట్టింగ్ యాప్ లకు ప్రచారం చేసినందుకు ఎంత ఆదాయం వచ్చిందన్న వివరాల్ని సైతం సేకరించినట్లుగా తెలుస్తోంది. విచారణలో భాగంగా మరోసారి అవసరమైతే పిలుస్తామని వారికి చెప్పి పంపినట్లుగా తెలుస్తోంది. వీరి విచారణలో బెట్టింగ్ యాప లకు పని చేసిన మరికొందరి సమాచారాన్ని పోలీసులు సేకరించినట్లుగా తెలుస్తోంది. మరికొందరు ప్రముఖుల్ని విచారిస్తే.. బెట్టింగ్ యాప్ మూలాల్ని మరింత లోతుగా తెలుసుకునే వీలు ఉంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Tags:    

Similar News