విశాఖలో సినీపరిశ్రమ వృద్ధికి కొత్త పాలసీ: మంత్రి కందుల
దీనికోసం సినీపరిశ్రమ ప్రముఖులతో విస్త్రతంగా చర్చించాల్సి ఉందని కూడా అన్నారు.;
బీచ్ సొగసుల విశాఖపట్నంలో సినీపరిశ్రమ అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధంగా ఉన్నాయని ప్రకటించారు ఆంధ్రప్రదేశ్ సమాచార సాంస్కృతిక సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్. విశాఖలో సినీపరిశ్రమ అభివృద్ధికి కొత్త పాలసీని తీసుకు వస్తామని మంత్రివర్యులు వెల్లడించారు. దీనికోసం సినీపరిశ్రమ ప్రముఖులతో విస్త్రతంగా చర్చించాల్సి ఉందని కూడా అన్నారు.
విశాఖలో సినీపరిశ్రమ అభివృద్ధి, పర్యాటకం, గిరిజన ప్రాంతాల్లో పర్యాటక అభివృద్ధి వంటి వాటిపై ప్రభుత్వం దృష్టి కేంద్రీకరించిందని కందుల తెలిపారు. మండలిలో ప్రశ్నోత్తరాల సందర్భంగా సభ్యులు అడిగిన ప్రశ్నలకు కందుల పైవిధంగా సమాధానమిచ్చారు.
అయితే విశాఖలో సినీపరిశ్రమ అభివృద్ధి జరగాలంటే ఇండస్ట్రీ పెద్దలు సానుకూలంగా ఉండాల్సి ఉంటుంది. ఈ విషయంలో ప్రకటనలు ఘనంగా ఉన్నా కానీ, హైదరాబాద్ నుంచి విశాఖకు తరలి రావాలంటే దానికి ప్రభుత్వాల చొరవ, స్టూడియోల ఏర్పాటు కోసం భూముల కేటాయింపు, రాయితీలు చాలా ఎక్కువ అవసరం. దీనికోసం చిత్తశుద్ధితో ప్రభుత్వం వద్ద ప్రణాళిక ఉంటేనే పరిశ్రమ తరలింపు సాధ్యమని ప్రముఖులు విశ్లేషిస్తున్నారు. విశాఖ బీచ్ పరిసరాల్లో ఐదు నక్షత్రాల హోటళ్ల అభివృద్ధి, భోగాపురం విమానాశ్రయ నిర్మాణం సహా వైజాగ్ మెట్రో ప్రణాళికలు ఇతర పరిశ్రమల్ని ఆకర్షించే ఎలిమెంట్స్ అనడంలో సందేహం లేదు.