అప్పుడు కత్తులు.. ఇప్పుడు పొత్తులు.. ఇద్దరి ఎమ్మెల్యేల స్పెషల్

కూటమి పార్టీల్లోని ఇద్దరు ఎమ్మెల్యేల తీరు ఏపీలో చర్చనీయాంశంగా మారింది. ఆ ఇద్దరిని చూసిన వారు రాజకీయాల్లో ఎప్పుడు ఏమవుతుందో చెప్పలేమంటూ అవాక్కవుతున్నారు.;

Update: 2025-03-21 06:19 GMT
అప్పుడు కత్తులు.. ఇప్పుడు పొత్తులు.. ఇద్దరి ఎమ్మెల్యేల స్పెషల్

కూటమి పార్టీల్లోని ఇద్దరు ఎమ్మెల్యేల తీరు ఏపీలో చర్చనీయాంశంగా మారింది. ఆ ఇద్దరిని చూసిన వారు రాజకీయాల్లో ఎప్పుడు ఏమవుతుందో చెప్పలేమంటూ అవాక్కవుతున్నారు. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు ఉండరనే నానుడికి వారే ఉదాహరణగా నిలుస్తున్నారంటున్నారు. ఒకప్పుడు ఒకే నియోజకవర్గంలో పనిచేసి కత్తులు దూసుకున్న ఆ ఇద్దరు ఇప్పుడు పక్కపక్క నియోజకవర్గ ఎమ్మెల్యేలుగా దోస్త్ మేరా దోస్త్ అంటూ పాట పాడుతుండటం ఆసక్తి రేపుతోంది.

విశాఖ నగరంలోని నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా, ఆ నాలుగు చోట్ల టీడీపీ, జనసేన, బీజేపీ ఎమ్మెల్యేలు ఎన్నికయ్యారు. విశాఖ తూర్పు నుంచి ఎమ్మెల్యే వెలగపూడి రామక్రిష్ణబాబు, విశాఖ పశ్చిమ నుంచి ఎమ్మెల్యే గణబాబు, విశాఖ దక్షిణ నుంచి జనసేన ఎమ్మెల్యే వంశీ క్రిష్ణ శ్రీనివాస్, విశాఖ ఉత్తర నుంచి విష్ణుకుమార్ రాజు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

అయితే బీజేపీ ఎమ్మెల్యే విష్ణుతో టీడీపీకి ఎప్పుడూ సఖ్యత ఉండేదని చెబుతారు. ఆయన బీజేపీలో ఉన్నా, టీడీపీతో ఎప్పుడూ సత్సంబంధాలు కొనసాగించేవారు. ఆ బంధం చిరస్థాయిగా చెబుతారు. ఇక జనసేన ఎమ్మెల్యే వంశీక్రిష్ణ శ్రీనివాస్ తొలిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అంతేకాదు ఆయన గతంలో వైసీపీలో పనిచేయగా, టీడీపీపై రాజీలేని పోరాటం చేసేవారు. ఎన్నికల ముందు జనసేనలో చేరిన వంశీక్రిష్ణ శ్రీనివాస్ పొత్తులో భాగంగా దక్షిణ నియోజకవర్గం సీటును కైవసం చేసుకున్నారు. అంతేకాకుండా ఎమ్మెల్యేగా గెలిచి టీడీపీ నేతలతో మంచి స్నేహ సంబంధాలు కొనసాగించడం విశాఖ నగర రాజకీయాలను ఆకర్షిస్తోంది.

ఎమ్మెల్యే వంశీక్రిష్ణ శ్రీనివాస్, టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి మధ్య ఇటీవల పెరిగిన సానిహిత్యంపై విస్తృత చర్చ జరుగుతోంది. విశాఖ తూర్పు నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యే వెలగపూడి వరుసగా నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. వ్యాపార రీత్యా విజయవాడ నుంచి విశాఖ వచ్చిన వెలగపూడి ఇక్కడే స్థిరపడ్డారు. ప్రజల్లో పలుకుబడి పెంచుకుని కార్పొరేటర్ గా, ఎమ్మెల్యేగా పట్టు సాధించారు. ఆయనను ఓడించేందుకు రాజకీయ ప్రత్యర్థులు ఎన్ని ఎత్తులు వేసినా, చివరికి విజయం వెలగపూడినే వరిస్తూ వస్తోంది.

ఈ క్రమంలోనే వెలగపూడి జోరును కట్టడి చేసేందుకు కొన్నాళ్లు వంశీక్రిష్ణ శ్రీనివాస్ ను వాడుకుంది వైసీపీ. వైసీపీ నగర పార్టీ అధ్యక్షుడిగా పనిచేసిన వంశీక్రిష్ణ శ్రీనివాస్ విశాఖ తూర్పు సమన్వయకర్తగా కొన్నాళ్లు పనిచేశారు. వైసీపీలో ఉండగా, రెండు సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేయాలని భావించిన వంశీ క్రిష్ణ శ్రీనివాస్ ఆశలు నెరవేరలేదు. అయితే తూర్పు నమన్వయకర్తగా పనిచేసిన అన్నిరోజులూ ఎమ్మెల్యే వెలగపూడికి వ్యతిరేకంగా ఆయన తీవ్ర పోరాటమే చేశారు. ఎమ్మెల్యే వెలగపూడిని విజయవాడ తిప్పి పంపుతానని శపథాలు చేసేవారు. గత ఎన్నికలకు ముందు ఈ ఇద్దరి మధ్య యుద్ధం రాజకీయంగా వేడిపుట్టించేంది.

అయితే ఎన్నికల ముందు వైసీపీకి రాజీనామా చేసి వంశీక్రిష్ణ జనసేనలో చేరడంతో పరిస్థితిలో ఎంతో మార్పు వచ్చింది. ఎలాగైన ఎమ్మెల్యేగా ఎన్నికవ్వాలని చూసిన వంశీక్రిష్ణ గత ఎన్నికల్లో చక్కగా ప్లాన్ చేసి జనసేనలో అవకాశాన్ని అందిపుచ్చుకున్నారు. అంతేకాకుండా పార్టీ ఆదేశాల ప్రకారం తన సొంత నియోజకవర్గం విశాఖ తూర్పు వదులుకుని విశాఖ దక్షిణ నియోజకవర్గానికి మారారు. పొత్తులో భాగంగా ఆయన సర్దుకోవడంతో వెలగపూడితో రాజకీయ యుద్ధానికి బ్రేక్ పడింది. ఇక ఇద్దరూ గత ఎన్నికల్లో గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టాక రాజకీయం పూర్తిగా మారిపోయింది.

నగరంలో నాలుగు నియోజకవర్గాలు ఉండగా, ఎమ్మెల్యేలు వెలగపూడి, వంశీక్రిష్ణ శ్రీనివాస్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలుస్తున్నారు. ఈ ఇద్దరు చక్కటి సమన్వయంతో పనిచేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఒకప్పుడు కత్తులు దూసుకున్న ఇద్దరు ఇప్పుడు పొత్తులలో భాగంగా స్నేహమేరా జీవితం అన్నట్లు కలిసిమెలిసి తిరుగుతున్నారు. ఈ ఇద్దరు ఇలా పనిచేయడానికి ఒక గమ్మత్తు అయిన విషయమే కారణమంటున్నారు. లిక్కర్ బిజినెస్ లో ఎమ్మెల్యే వెలగపూడిది అందెవేసిన చెయ్యి అనే ప్రచారం ఉంది. నగరంలో లిక్కర్ వ్యాపారుల్లో వెలగపూడి ప్రముఖుడిగా చెబుతారు.

ఇప్పుడు ప్రభుత్వం అధికారంలో ఉండటంతో ఆయనతో కలిసి వ్యాపారం చేయడానికి ఎమ్మెల్యే వంశీక్రిష్ణ ఆసక్తి చూపారని ప్రచారం జరుగుతోంది. వెలగపూడి కూడా వంశీక్రిష్ణను తన వ్యాపారంలో కలుపుకుని వెళ్లడంతో రెండు నియోజకవర్గాల్లో ఈ ఇద్దరి అనుచరులే లిక్కర్ బిజినెస్ ను శాసిస్తున్నారని అంటున్నారు. కారణం ఏదైనా తమ ఇద్దరి మధ్య జరిగిన రాజకీయ యుద్ధాన్ని ఎమ్మెల్యేలు మరచిపోయి కలిసిమెలిసి తిరుగుతుండటం ఆసక్తికరంగా చెబుతున్నారు.

Tags:    

Similar News