ఎయిర్ పోర్ట్ ను మూయించిన పవర్ కట్... అసలేం జరిగింది?
లండన్ లోని హీథ్రో విమానాశ్రయం సమీపంలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది.;

లండన్ లోని హీథ్రో విమానాశ్రయం సమీపంలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. దీంతో... ప్రస్తుతానికి మార్చి 22 వరకూ ఎయిర్ పోర్ట్ లో రాకపోకలను నిలిపివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. మరిన్ని వివరాల కోసం విమానయాన సంస్థను ఆశ్రయించాలని తెలిపారు. తిరిగి ఎప్పుడు ప్రారంభిస్తారనే విషయంపై క్లారిటీ ఇవ్వలేదని తెలుస్తోంది.
అవును... ఓ భారీ అగ్ని ప్రమాదంతో పవర్ కట్ చోటు చేసుకోగా.. అది ఓ విమానాశ్రయాన్ని మూతపడేలా చేసింది. దీంతో.. ప్రస్తుతం రెండు రోజులపాటు ఎయిర్ పోర్ట్ లో రాకపోకలను నిలిపివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. అప్పటివరకూ ప్రయాణికులు ఎవరూ ఎయిర్ పోర్ట్ వైపు రావొద్దని కూడా విజ్ఞప్తి చేశారు.
హీథ్రో విమానాశ్రయానికి విద్యుత్ సరఫరా చేసే సబ్ స్టేషన్ లో ఈ అగ్నిప్రమాదం జరిగింది. దీంతో.. విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం కలిగిందని చెబుతున్నారు. ఫలితంగా... ఎయిర్ పోర్ట్ తో పాటు సమీపంలోని వేలాది ఇళ్లల్లో చీకట్లు అలుముకున్నాయని అంటున్నారు. అగ్ని ప్రమాదం జరిగిన సమయంలో మంటలు భారీ ఎగసిపడ్డాయని చెబుతున్నారు.
దీంతో... ఆ సబ్ స్టేషన్ కు చుట్టుపక్కల నివాసాల్లో ఉన్న వంద మందికి పైగా ప్రజలను ఖాళీ చేయించినట్లు అధికారులు తెలిపారు. మరోపక్క ఈ మంటలను ఆర్పడానికి సుమారు 10 ఫైర్ ఇంజిన్లు.. దాదాపు 100 మందికి పైగా అగ్నిమాపక సిబ్బంది కృషిచేస్తున్నారని అధికారులు వెల్లడించారు. అయితే... ఈ ప్రమాదంలో ఎవరూ గాయపడలేదని తెలుస్తోంది.
ఈ సందర్భంగా స్పందించిన గ్లోబల్ ట్రావెల్ డేటా సంస్థ ఓఏజీ.. ఈ విమానాశ్రయం నుంచి ఏటా సుమారు 51 మిలియన్ల మంది ప్రయాణాలు చేస్తున్నట్లు తెలిపింది. ఇక.. ప్రమాదం జరిగినప్పటి నుంచి అనేక విమానాలను దారి మళ్లించామని.. వాటికి సంబంధించిన వివరాలు వెబ్ సైట్ లో చెక్ చేసుకోవాలని అధికారులు సూచించారు.
కాగా... ప్రపంచంలోని అత్యంత రద్దీ విమానాశ్రయాల్లో హీథ్రో ఎయిర్ పోర్ట్ ఒకటి. ఓఏజీ గణాంకాల ప్రకారం.. కిందటి ఏడాది రద్దీ ఎయిర్ పోర్టుల జాబితాలో ఇది నాలుగో స్థానంలో నిలిచింది.